ఏయూ వేదికపై రచ్చ!

టీడీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించతలపెట్టిన మహానాడుకు ఆంధ్రాయూనివర్శిటీని వేదికగా చేయడంపై వివాదం కొనసాగుతోంది. ఏయూ విద్యార్ధి సంఘాలు దీనిపై అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించి మరీ ఏయూ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. రాజకీయ కార్యకలాపాలకు ఏయూను వాడుకోవడం తగదని స్పష్టం చేశారు. గతంలో వైసీపీ యువభేరీ సభలకు, జై ఆంధ్రప్రదేశ్‌ సమావేశాలకు ఏయూ వేదికను అడిగితే మరీ రాజకీయ కార్యక్రమాలకు ఏయూను అనుమతించబోమంటూ అప్పటికపుడు జీవోను తయారుచేసి మరీ అడ్డగించారని ఏయూ వైసీపీ విద్యార్ధి విభాగం గుర్తు చేసింది.

ఆ జీవో ఇపుడు ఏమైందని, టీడీపీ మహానాడు నిర్వహిస్తూంటే ఏయూ అధికారులు ఏం చేస్తున్నారని విద్యార్ధి నాయకులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఏయూ వీసీ నాగేశ్వరరావు స్పందిస్తూ ఇంతవరకూ ఏయూలో  మహానాడు నిర్వహణకు అనుమతించలేదని, ప్రభుత్వ స్ధాయిలోనే దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు.

అదే సమయంలో ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాల మైదానంలో మహానాడు కోసం భూమిపూజను పలువురు మంత్రులు అట్టహాసంగా నిర్వహించడం విశేషం. ఓ వైపు అనుమతించలేదని వీసీ ప్రకటిస్తూంటే ఇంకోవైపు బాధ్యత గల ప్రభుత్వ మంత్రులే ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడం అధికార పార్టీ రాజకీయాలకు పరాకాష్టగా మారింది.

దీనిపైన మీడియా అడిగిన ప్రశ్నలకు హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పందిస్తూ, మహానాడు ఏయూలో నిర్వహించుకు నేందుకు మాకు అన్ని అనుమతులూ ఉన్నాయి, మీకు వాటిని చూపించాల్సిన అవసరం లేదంటూ ఘాటుగా మాట్లాడడం గమనార్హం. మరో మంత్రి అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, ఏయూలో మహానాడు జరుపుకుంటే తప్పేంటని ప్రశ్నించారు.

Readmore!

దీనిని వివాదం చేయడం తగదని ఆయన విద్యార్ధి సంఘాలకు హితవు పలికారు. రాజకీయ సభలకు ఏయూను వాడుకోవడంపై మాత్రం విదార్ధిలోకంతో పాటు, మేధావులూ తప్పు పడుతున్నారు. నిబంధనలు అందరికీ ఒకేలా ఉండాలని, అధికార పార్టీకి మాత్రం అవి వర్తించవంటే ఎలా అని నిలదీస్తున్నారు. మొత్తానికి తెలుగుదేశం పార్టీ రుబాబును ప్రదర్శిస్తూ మహానాడును ఏయూ ప్రాంగణంలో నిర్వహిస్తోందని వైసీపీ విమర్శిస్తోంది.

Show comments

Related Stories :