దెయ్యాల కొంపలో దెయ్యాలెవరు.?

చదువేస్తే వున్న మతి పోయిందనేది వెనకటికి ఓ సామెత. 'పెద్దల సభ'పై సోషల్‌ మీడియాలో వచ్చే కామెంట్లపై అధికార తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో గుస్సా అవుతోందిగానీ, ఆ పెద్దలు తమ పెద్దరికాన్ని నిలబెట్టుకుంటున్నారా.? లేదు, తమ స్థాయిని దిగజార్చుకుంటున్నారు. తద్వారా పెద్దల సభ పరువు తీసేస్తున్నారు. ఇలాంటోళ్ళనా మనం పెద్దల సభకు పంపిస్తున్నాం.? అని జనం సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తోంది. 

టీడీపీ ఎమ్మెల్సీ ఎంవీఎస్‌ఎస్‌ మూర్తి, ప్రతిష్టాత్మక ఆంధ్ర విశ్వ కళా పరిషత్‌ (ఆంధ్రా యూనివర్సిటీ)ని ఏకంగా దెయ్యాల కొంపతో పోల్చారు. ఎందరో మేధావుల్ని సమాజానికి అందించిన ఘన చరిత్ర ఆంధ్రా యూనివర్సిటీది. దేశంలోని మేటి యూనివర్సిటీల్లో ఆంధ్రా యూనివర్సిటీ ఒకటి. దురదృష్టవశాత్తూ ఈ యూనివర్సిటీలో ఇప్పుడు రాజకీయం రాజ్యమేలుతోంది. అధికార తెలుగుదేశం పార్టీ 'మహానాడు'ని ఇక్కడ నిర్వహిస్తున్నారు. సహజంగానే విద్యార్థుల నుంచి, ఈ కార్యక్రమం పట్ల వ్యతిరేకత వచ్చింది. 

అంతే, ఎంవీవీఎస్‌ మూర్తిగారికి ఎక్కడో కాలిపోయింది. దెయ్యాల కొంపని బాగు చేస్తామంటే ఎందుకంత అసహనం.? అంటూ విరుచుకుపడ్డారాయన. దెయ్యాల కొంపా.? ఆ మాట అనడానికి కాస్తంతైనా ఇంగితం వుండాలి. యూనివర్సిటీలైనా, కళాశాలలైనా ఒకవేళ దెయ్యాల కొంపలుగా మారితే, ఆ పాపం రాజకీయ నాయకులది.. ముఖ్యంగా పాలకులదే. విశాఖలో పేరొందిన గీతం యూనివర్సిటీకి ఎంవీవీఎస్‌ మూర్తి ప్రెసిడెంట్‌ కావడం గమనార్హమిక్కడ. 

అన్నట్టు, మంత్రి గంటా శ్రీనివాసరావు - ఎంవీవీఎస్‌ మూర్తి వ్యాఖ్యల్ని ఖండించారు. దెయ్యాల కొంపగా ఆంధ్రా యూనివర్సిటీని అభివర్ణించడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు గంటా శ్రీనివాసరావు. ఇంతకీ, దెయ్యాల కొంపలో దెయ్యాలెవరు.? మేధావుల్ని సమాజానికి అందిస్తున్న ఓ విశ్వవిద్యాలయం దెయ్యాల కొంపగా కన్పించిందంటే, అలాంటి పిశాచి ఆలోచనలు ఎవరికొస్తాయ్‌.! ఆ దెయ్యాల కొంపలో, 'పసుపు' పండుగ ఎందుకు జరుగుతోంది.? ఇంతకీ, ఇక్కడ దెయ్యాలెవరు.? ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సమాధానమివ్వాలి ఈ ప్రశ్నలకి.

ఓ సినీ ప్రముఖుడు మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.. సినీ, రాజకీయ వర్గాల్లో రచ్చ రచ్చ జరిగింది. మరి, ఓ ఎమ్మెల్సీ - చదువుల దేవాలయాన్ని దెయ్యాల కొంప అన్నారు.. ఇప్పుడు వ్యవస్థ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Show comments