చిరంజీవిలో పొలిటికల్‌ ఉత్సాహం

'ఖైదీ నెంబర్‌ 150' ఫక్తు కమర్షియల్‌ సినిమా మాత్రమే కాదు, అందులో రైతుల సమస్యల్ని కూడా చూపించారు. మురుగదాస్‌ సినిమాలంటేనే అంత. అయితే, 'ఖైదీ నెంబర్‌ 150' సినిమాని సామాజిక కథాంశంతోపాటు, మెగాస్టార్‌ అభిమానులకోసం ఎంటర్‌టైనింగ్‌గా మలచిన విషయం విదితమే. తమిళంతో పోల్చితే, తెలుగులో ఇంకాస్త ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్‌నే జోడించారు. పనిలో పనిగా, చిరంజీవి కోసం కొన్ని పొలిటికల్‌ డైలాగులూ వదిలేశారు. 

ఇక, సినిమా ప్రమోషన్‌లో బాగంగా చిరంజీవి ప్రస్తుత రాజకీయాలపైనా తనదైన అభిప్రాయాల్ని కుండ బద్దలుగొట్టేశారు. పెద్ద పాత నోట్ల రద్దు వ్యవహారంపైనా, ఉమ్మడి తెలుగు రాష్ట్రం విడిపోవడంపైనా, ఇంకా అనేక అంశాలపై ఆయన పొలిటికల్‌ కామెంట్స్‌ కూడా చేసిన విషయం విదితమే. మీడియా అడిగింది కాబట్టి.. ఆయన సమాధానం చెప్పారంతే.. అనుకోవాలా.? లేదంటే, రాజకీయాలపై ఇంకా చిరంజీవి పూర్తిస్థాయి ఇంట్రెస్ట్‌తోనే వున్నారనుకోవాలా.? ఏమోగానీ, 'ఖైదీ నెంబర్‌ 150' సినిమా తర్వాత చిరంజీవిలో పొలిటికల్‌గానూ కొత్త ఉత్సాహం కన్పిస్తోందన్నది నిర్వివాదాంశం. 

సినిమా వేరు, రాజకీయం వేరు. ఆ విషయం అనుభవం ద్వారానే చిరంజీవి తెలుసుకున్నారు. అయితే, సినిమాల్ని రాజకీయాలకోసం వాడుకోవడం ద్వారా కాస్తంత పబ్లిసిటీ అయితే వస్తుంది. బాలకృష్ణ, తన సినిమాల్లో పొలిటికల్‌ డైలాగులు ఎక్కువగా వుండేందుకు ఇష్టపడ్తుంటారందుకే. సో, ముందు ముందు చిరంజీవి నుంచి కూడా బీభత్సమైన పొలిటికల్‌ డైలాగుల్ని ఆయన సినిమాల్లో ఆశించొచ్చు. రాజకీయ వేదికలపై ప్రత్యర్థులకు కౌంటర్‌ ఇవ్వడంలో విఫలమైన చిరంజీవి, తన సినిమా ద్వారా మాత్రం రాజకీయాల్లో తనపై వచ్చిన విమర్శలకు కౌంటర్‌ ఇచ్చేశారు. 

తదుపరి చేసే సినిమాల విషయంలో కూడా 'పొలిటికల్‌ యాంగిల్‌'ని ఏమాత్రం మిస్‌ అవకూడదని, 'ఖైదీ' తర్వాత చిరంజీవి ఓ అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, పూర్తిస్థాయి పొలిటికల్‌ మూవీ మాత్రం చిరంజీవికి చేసే ఉద్దేశ్యమే లేదట.

Show comments