ఒక్కడంటే ఒక్కడు చాలు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు ప్రతిపక్ష నేత జానారెడ్డి. చాలా చిత్రమైన సందర్భమిది. ప్రతిసారీ, కేసీఆర్‌ని జానారెడ్డి పొగిడేయడం.. కాంగ్రెస్‌ పార్టీ కన్‌ఫ్యూజన్‌లో పడిపోవడం జరుగుతూనే వుంది. 'పెద్దరికం' చాటుకోవడానికి జానారెడ్డి పడ్తున్న పాట్లు, జానారెడ్డిని 'పెద్దరికం'తో పడగొట్టేందుకు టీఆర్‌ఎస్‌ వ్యూహాలు.. వెరసి, తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి రోజురోజుకీ దిగజారిపోతోంది. 

మహారాష్ట్రతో తెలంగాణ ప్రభుత్వం నీటి ప్రాజెక్టులపై చేసుకున్న ఒప్పందాల్ని కాంగ్రెస్‌ వ్యతిరేకిస్తోన్న విషయం విదితమే. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సహా పలువురు కాంగ్రెస్‌ నేతలు, కేసీఆర్‌పై ఈ విషయమై దుమ్మెత్తిపోస్తున్నారు. జానారెడ్డి మాత్రం, సింపుల్‌గా తన పని తాను చేసుకుపోతున్నారు. తమ్మిడిహట్టిపై 152 మీటర్ల బ్యారేజీ కోసం కాంగ్రెస్‌ హయాంలో ఒప్పందం జరిగిందని కాంగ్రెస్‌ పార్టీ వాదిస్తూ వచ్చింది. అయితే, ఆ ఒప్పంద పత్రాలుంటే, తీసుకొచ్చి చూపించాలనీ, అలా చూస్తే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని పీసీసీ అధ్యక్షుడికి సవాల్‌ విసిరేశారు కేసీఆర్‌. 

ఇక్కడే జానారెడ్డి, కాంగ్రెస్‌ పార్టీని పాతరేసేశారు. అసలు కాంగ్రెస్‌ హయాంలో అలాంటి ఒప్పందమేమీ జరగలేదు, కాంగ్రెస్‌ అధికారంలో వుంటే 152 మీటర్ల బ్యారేజ్‌ కోసం ఒప్పందాలు జరిగి వుండేవి.. అని సెలవిచ్చారు. ఇంతకీ, మహారాష్ట్రతో తమ్మిడిహట్టి ప్రాజెక్టు విషయంలో కేసీఆర్‌ చేసుకున్న ఒప్పందమేంటో ఎవరికీ తెలియని పరిస్థితి. ఈ గందరగోళాన్ని కాంగ్రెస్‌ నేతగా, ప్రతిపక్ష నేతగా జానారెడ్డి క్యాష్‌ చేసుకోవాల్సింది పోయి, కాంగ్రెస్‌ని ఇంకా ఇరకాటంలో పడేస్తున్నారు. 

జానారెడ్డి 'పెద్దరికం' పాట్లు తమకు అనుకూలంగా మారుతుండడంతో, 'ఆయన్ని చూసి కాంగ్రెసోళ్ళు నేర్చుకోవాలి.. ఆయన పెద్దరికం ప్రదర్శిస్తున్నారు..' అంటూ టీఆర్‌ఎస్‌ నేతలు, కాంగ్రెస్‌కి ఉచిత సలహా ఇస్తుండడం గమనార్హం. త్వరలో అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. సరిగ్గా ఈ టైమ్‌లో జానారెడ్డి, కాంగ్రెస్‌ పార్టీని పాతరేసేశారన్నమాట. ఇంతకీ జానారెడ్డి కాంగ్రెస్‌ నాయకుడేనా.?

Show comments