అఖిలప్రియ... నవ్వుతారమ్మా ఇలా మాట్లాడితే!

టికెట్ కోసమే.. శిల్పా మోహన్ రెడ్డి వైకాపాలో చేరాడు..’ ఇదీ మంత్రి భూమా అఖిలప్రియ తమ రాజకీయ ప్రత్యర్థి శిల్పా మోహన్ రెడ్డిని విమర్శించిన తీరు.

దీని భావం ఏమి? అనగా.. శిల్పా మోహన్ రెడ్డి మొన్నటి వరకూ తెలుగుదేశంలో ఉండేవాడు.. ఆయనకు నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇవ్వను అని చంద్రబాబుగారు చెప్పారు, అదే సమయంలో వైకాపా తరపున టికెట్ ఇస్తానని జగన్ చెప్పారు, బొత్తిగా విలువల్లేని శిల్పా మోహన్ రెడ్డి వైకాపాలో చేరిపోయాడు.

ఆ విధంగా టికెట్ కోసం శిల్పా మోహన్ రెడ్డి పార్టీని మారాడు.. అంటూ మోరల్ పోలిసింగ్ చేసింది మంత్రి భూమా అఖిలప్రియ! భలే ఉంది కదా.. గురివింద చందం కూడా కాదు.. అంత కన్నా ఒక స్టెప్పు కిందే! వైకాపా తరపున ఎమ్మెల్యేలుగా గెలిచిన తను, తన తండ్రి ఆ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయకుండా తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు.

అవతల వాళ్లు ఇష్టానుసారం మాట్లాడుతున్నా.. మీరెందుకు రాజీనామా చేయరు? పార్టీ మారి కూడా అవతల పార్టీ ద్వారా సంక్రమించిన పదవికి ఎందుకు రాజీనామా చేయడం లేదు? అని అంతా నిలదీస్తున్నా.. భూమా కుటుంబం విలువలతో కూడిన రాజకీయం చేయలేకపోయింది.

ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి పార్టీ మారి అందరికీ ఆదర్శంగా నిలవలేకపోయింది. ఒక పార్టీ ద్వారా ఎమ్మెల్యే పదవిని సంపాదించుకుని.. మరో పార్టీలోకి వెళ్లి ఫిరాయింపుకు పాల్పడి.. మంత్రి పదవిని కూడా పొందిన అఖిలప్రియ ఇప్పుడు శిల్పా మోహన్ రెడ్డి విలువలు పాటించడం లేదని అనడం భలే ఉందిలే.

ఫిరాయింపు దారులైన ఎమ్మెల్యే, ఆ హోదాతో మంత్రి పదవిని పొందిన వ్యక్తి.. శిల్పా మోహన్ రెడ్డి తెలుగుదేశాన్ని వీడి వైకాపాలో చేరడాన్ని ఆక్షేపిస్తోంది. ఆయన టికెట్ కోసమే పార్టీ మారాడు.. అని నీతులకు నిర్వచనాలు ఇస్తోంది. బహుశా.. అఖిలప్రియ తనేం చేస్తున్నానో అయినా గుర్తెరగపోవాలి లేదా, ఇలా మాట్లాడితే జనాలు నవ్వుతారనే విషయాన్ని అయినా మరిచి ఉండాలి!

Show comments