'బాహుబలి' 4 కాదు 6

ఇప్పటిదాకా థియేటర్లలో సినిమా 4 ఆటలు మాత్రమే ప్రదర్శితమవడం చూశాం. ఇకపై రోజుకి ఆరు ఆటలు ప్రదర్శితం కానున్నాయి. మల్టీప్లెక్స్‌లలో ఈ వెసులుబాటు ఎప్పటినుంచో వున్నా, పది రోజులపాటు రోజుకి 6 ఆటలు ప్రదర్శించేందుకు 'బాహుబలి ది కంక్లూజన్‌' చిత్రానికి ఆంధ్రప్రదేశ్‌లో వెసులుబాటు కలగడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. 

'బాహుబలి ది కంక్లూజన్‌' సినిమా వెనుక, ఎవరున్నారో అందరికీ తెల్సిన విషయమే. మీడియా మొఘల్‌ ఓ పక్క, దర్శకేంద్రుడు ఇంకోపక్క 'బాహుబలి' సినిమాని తమ భుజాన కాస్తున్నారు. ఈ ఇద్దరూ తెలుగుదేశం పార్టీకి అత్యంత సన్నిహితులు. ఇంకేముంది, 'బాహుబలి ది కంక్లూజన్‌' సినిమా ఆడిందే ఆట, పాడిందే పాట అన్నమాట. రోజుకి 4 ఆటలు ప్రదర్శితమవుతుంటేనే, వారాంతం తర్వాత థియేటర్ల వైపు జనం కన్నెత్తి చూడటంలేదాయె. అలాంటిది, రోజుకి 6 ఆటలు.. అంటే ఇంకేమన్నా వుందా.? 

నో డౌట్‌, 'బాహుబలి ది కంక్లూజన్‌' కోసం దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. అలాగని, జనంలో వున్న ఆ ఉత్కంఠని ఈ స్థాయిలో క్యాష్‌ చేసుకోవాలా.? థియేటర్లలో టిక్కెట్ల ధరలెలాగూ ఆకాశాన్నంటేస్తాయి. దానికి తోడు బ్లాక్‌ మార్కెటింగ్‌.. వెరసి, ఇదొక దోపిడీగా భావించాల్సి వుంటుందేమో.! ప్రేక్షకులెలా పోతే మనకేంటి.. అన్న చందాన ఇటు 'బాహుబలి' టీమ్‌, అటు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వ్యవహరిస్తుండడం అత్యంత హేయమైన విషయం. 

ఏం చేస్తాం, ప్రభుత్వ అండదండలున్నాక, 'బాహుబలి ది బిగినింగ్‌' సినిమా 6 ఆటలేం ఖర్మ, వీలుంటే 10 ఆటలకూ అనుమతి పొందేయొచ్చు. అంతిమంగా ప్రేక్షకుల జేబులే కదా గుల్లయ్యేది.!

Show comments