పదేళ్ళు సరిపోద్దా వెంకయ్యా.?

కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుగారికి రెండేళ్ళు సరిపోలేదు.. పదేళ్ళలోపు చెయ్యాల్సిన పనులు రెండేళ్ళలోపే చేసెయ్యాలనడం ఎంతవరకు సబబు.? అని ప్రశ్నించేస్తున్నారు. ఇలాంటోళ్ళు వుండబట్టే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి ఈ దుస్థితి. 'ఎటూ అధికారంలోకి మేమే వస్తాం.. అప్పుడు ఐదేళ్ళు కాదు, పదేళ్ళు ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇస్తాం..' అని పార్లమెంటు సాక్షిగా చెప్పిన ఘనుడు ఈ వెంకయ్య. ఇప్పుడేమో, మాట మార్చి.. ప్రత్యేక హోదా జిందా తిలిస్మాత్‌ కాదని వెటకారం చేస్తున్నారు. 

ఆంధ్రప్రదేశ్‌లో పుట్టి, ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తుని వెటకారం చేయడమంటే, వెంకయ్యకు ఎంత అహంకారం వుండి వుండాలి. అప్పటి పార్లమెంటు సమావేశాల్లో.. ప్రతిపక్షంలో వున్నప్పుడు వెంకయ్యనాయుడు, ప్రత్యేక హోదా అడిగింది ఆంధ్రప్రదేశ్‌కి కాదు.. ఆ పేరు చెప్పి, పార్టీలో వెంకయ్యనాయుడే ప్రత్యేక హోదా సంపాదించుకున్నారు. ఆ విషయం ఇప్పుడిప్పుడే అందరికీ అర్థమవుతోంది. 

రికార్డు స్థాయిలో (బీజేపీ లెక్కల ప్రకారం) రాజ్యసభకు ఎంపికయ్యారంటే అది కేవలం ఆంధ్రప్రదేశ్‌ పుణ్యమే. వెంకయ్యను పక్కన పెడితే, ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ నుంచి శ్రేణుల నుంచి వ్యతిరేకత పెరుగుతుందేమోనని నరేంద్రమోడీ ఇంకోసారి వెంకయ్యనాయుడిని రాజ్యసభకు పంపారన్నది ఓపెన్‌ సీక్రెట్‌. లేదంటే, ఎప్పుడో ఎల్‌కె అద్వానీ తరహాలో వెంకయ్యనాయుడిని నరేంద్రమోడీ 'ఉత్సవ విగ్రహం'లా మార్చేసి, సైడ్‌ చేసేసి వుండేవారే. 

ఒక్క సంతకంతో ప్రత్యేక హోదా ఇవ్వొచ్చు.. అని ఉచిత సలహా ఇచ్చింది ఇదే వెంకయ్యనాయుడు. ఇప్పుడు ఇదే వెంకయ్యనాయుడు, దేశంలో 14 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్‌తోపాటు ప్రత్యేక హోదా అడుగుతున్నాయని కహానీలు విన్పిస్తున్నారు. ఏదీ, ఎక్కడ.? రాజ్యసభలో కేవీపీ ప్రైవేటు బిల్లు సందర్భంగా ఒక్కటంటే ఇంకొక్క రాష్ట్రానికి చెందిన ఎంపీ కూడా ప్రత్యేక హోదా అడగలేదేం.? 

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక రైల్వే జోన్‌ ఖచ్చితంగా వస్తుందట.. ఇది వెంకయ్యగారి మాట. రెండేళ్ళు సరిపోలేదు నరేంద్రమోడీ సర్కార్‌కి.. రైల్వే జోన్‌ విషయంలో కూడా. అంతేనా, పోలవరం ప్రాజెక్టుకి నిధులు ఇవ్వాల్సి వున్నా, బొచ్చెలో బిచ్చంతోనే సరిపెడ్తోంది. రాజధాని సంగతి సరే సరి. ఎట్నుంచి ఎటు చూసినా, రెండేళ్ళలో ఆంధ్రప్రదేశ్‌కి బీజేపీ ప్రభుత్వం కొత్తగా చేసిందేమీ లేదు. చెయ్యాల్సినవే చెయ్యని బీజేపీ ప్రభుత్వం, ఇంకో పదేళ్ళు కావాలని అడగడమంటే దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం.

Show comments