తన గొయ్యిని తానే తవ్వుకుంటుంది

తెలుగు దేశం పార్టీ తన గొయ్యిని తానే తవ్వుకుంటుంది ..ఆ పార్టీకి ఓటేసి తప్పు చేశామా(నా) అని బాధ పడాల్సి వస్తుంది. బోడి నీలాంటి వాడు ఓటేస్తే ఎంత? వెయ్యకపోతే ఎంత? అని నన్ను వీరాభిమానులు ప్రశ్నించవద్దు. నా అభిమానం ఓటు వేసినంతవరకే. ఆ తరువాత వాళ్లు ఏమి చేసినా బుజాల మీద మోసే అభిమానం కాదు నాది. 

ప్రజల ఆకాంక్షని తీర్చలేని ఏ పార్టీ అయినా దేనికి? చెప్పండి వాళ్ళ ఆగ్రహాన్ని అసంతృప్తిని అణచాలి అనుకోవటం కూడా చాలా పొరపాటు. ప్రతి దానికి రాజకీయం చేస్తున్నారని ప్రతిపక్షాల మీదకు నెట్టేయటం సరికాదు. అసలు ప్రతిపక్షం అన్నది లేకుండా చేసే ప్రయత్నాలు కూడా ప్రజలకి శ్రేయస్కరం కాదు.

నాలా డబ్బులు తీసుకోకుండా ఓటేసినవాళ్లు వేలు లక్షలమంది ఉండవచ్చు అందరూ నాలా బాధపడుతూ ఉండవచ్చు అది ఆ పార్టీకి నాలాంటివారిని దూరం చెయ్యనూ వచ్చు. అందరూ నాలా రచయితలు కాకపోవచ్చు. అందరూ నాలా రాయలేకపోవచ్చును. అందరికీ నాలా ఫెసుబుక్కు అకవుంటులు ఉండకపోవచ్చు.

అది వాళ్ళు తెలుసుకొని తప్పులు సరిదిద్దుకుంటే సరి.. లేదంటే వచ్చే ఎలక్షన్స్ లో తప్పకుండా మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది. ఊహ తెలిసిన నుండి తెలుగు దేశం అభిమానిని అయినా 2009 లో లోక్ సత్తాకి వేసాను 2014 తెలుగు దేశానికి వేసాను. మరలా 2019 లో బావుంటే వేస్తాను లేదా జగన్ కో పవన్ కళ్యాణ్ కో ఓటు వేస్తాను లేదంటే ఓటు వెయ్యటమే మానుకుంటాను.

చివరగా ఒక్కమాట నాకు ఏ పార్టీతో సంబంధం లేదు ఏ న్యూస్ ఛానల్ తో సంబంధం లేదు. అది ఫెసుబుక్కులో నా రచనలు చదివిన వారికి బాగా తెలుసు. నాకు నాలాంటి వారికి ఏ పార్టీ అయినా ఒక్కటే. ఒక్కో విషయంలో ఒక్కో నాయకుడిని అభిమానిస్తాను ఒక్కో నాయకుడిని విమర్శిస్తాను.

రాజకీయ కారణాలు ఏమైనా కేసీర్ గారు పార్టీని విలీనం చెయ్యకుండా కాంగ్రెస్కి ఝలక్ ఇచ్చినపుడు ఆయన్ని అభిమానించాను. హుదూద్ తుఫాన్ సమయంలో చంద్రబాబు నాయుడు గారి చొరవని దార్శినికతను అభిమానిస్తాను. అభిమానాన్ని ఢిల్లీ లో తాకట్టు పెట్టకుండా సొంత పార్టీ పెట్టిన జగన్ ని అభిమానిస్తాను. నల్లధనం కోసం ప్రయత్నం మొదలు పెట్టిన విషయంలో మోడీని అభిమానిస్తాను. తనకంటూ ఒక సొంత అజెండా, జెండా ఏర్పరచుకున్న విషయంలో పవన్ కళ్యాణ్ ని అభిమానిస్తాను.

పార్టీలు, కులాలు ముసుగు దుప్పటి కప్పుకొని మనం నిద్ర పోతున్నట్టు నటిస్తున్నంతకాలం మన బ్రతుకులు ఇంతే మన తెలుగు  జాతిని ఆ భగవంతుడు కూడా బాగు చెయ్యలేడు.. 

ఇట్లు 
నేను అంటే నేను కానీ నేను నాలాంటి వాళ్లలో ఒక నేను

మీగడ త్రినాధ రావు

Show comments