చంద్రబాబు ‘డాక్టర్’ అయ్యి తిరిగి వస్తారా!

అమెరికా పర్యటనను పూర్తి చేసుకు వచ్చే సరికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు ‘డాక్టర్ చంద్రబాబు’ అవుతారా? ఆ మధ్య షికాగో ప్రాంతానికి చెందిన ఒక యూనివర్సిటీ బాబుకు డాక్టరేట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మామూలుగా అయితే ఆయా వర్సిటీలు ఏటా జరిగే కాన్వొకేషన్ ఫంక్షన్ లో డాక్టరేట్లు ప్రదానం చేస్తూ ఉంటాయి. అయితే బాబుకు డాక్టరేట్ ప్రకటించిన వర్సిటీ మాత్రం.. ఆయనకు ఎప్పుడు వీలైతే అప్పుడు వచ్చి డాక్టరేట్ పట్టాను తీసుకెళ్లవచ్చు అని ప్రకటించిందనడం ఆశ్చర్యాన్ని కలిగించింది. 

ఇక బాబుకు డాక్టరేట్ ను ప్రకటించిన వర్సిటీ డమ్మీ అని… అది బిచాణా ఎత్తేసిందనే వార్తలూ వచ్చాయి. డాక్టరేట్ ప్రకటించగానే.. తన ఘనతకు అంతర్జాతీయ గుర్తింపు దక్కిందన్నట్టుగా బాబు మాట్లాడాడు. మామూలు యూనివర్సిటీలు డాక్టరేట్ ను  ప్రకటించి ఉంటే తీసుకునే వాడిని కాదు, ఆ యూనివర్సిటీ ప్రకటించింది కాబట్టే తీసుకుంటున్నా.. అని బాబుగారు చెప్పుకొచ్చారు.

ఆ వర్సిటీకి వందల సంవత్సరాల చరిత్ర ఉందని.. అది చాలా గొప్పదని బాబుగారి అభిమాన గణం ప్రకటించింది. అయితే అంత సీన్ లేదని.. ఆ వర్సిటీ ఇప్పుడు లేనే లేదనే వర్గమూ ఉంది. మరి ఇలాంటి నేపథ్యంలో బాబు అమెరికా పర్యటనతో తిరిగి ‘డాక్టరేట్’ అంశం తెరపైకి వచ్చినట్టుగా అవుతోంది.

ఎలాగూ ఆ వర్సిటీ వేదిక అయిన నగరానికి కూడా బాబు వెళ్తున్నాడు కాబట్టి… ఇప్పుడు డాక్టరేట్ ప్రదానం జరుగుతుందా? లేక.. నిజంగానే ఆ వర్సిటీ బిచాణా ఎత్తేసిన విషయం రూడీ అవుతుందా? ఆ వర్సిటీ తనకు డాక్టరేట్ ప్రకటించడం గర్వకారణం అని ఇప్పటికే ప్రకటించిన బాబు.. ఇప్పుడు దాన్ని తెచ్చుకుంటే సరేసరి! లేకపోతే.. ఆ వ్యవహారం అంతా ఫాల్సూ.. కేవలం ఒక రోజు ప్రచారం కోసం దాన్ని ఉపయోగించుకున్నారని అనుకోవాల్సి వస్తోంది. ఈ ప్రశ్నలన్నింటికీ బాబు అమెరికా పర్యటన సమాధానం ఇవ్వబోతోంది!

Show comments