అభిమానులకు జూనియర్ ఎన్టీఆర్ ఓ విజ్ఞప్తి చేశాడు. రెండున్నర గంటల సినిమాని కేవలం సినిమాగా మాత్రమే చూడాలని కోరాడు. అభిమానం మనసులో వుంచుకోవాలనీ, ఆ అభిమానం పేరుతో అనవసరమైన వివాదాలు కొనితెచ్చుకోవద్దని ఎన్టీఆర్ అభిమానులకు సూచించాడు. పవన్‌కళ్యాణ్ అభిమాని వినోద్ రాయల్, కర్నాటకలో హత్యకు గురైన విషయం విదితమే. హత్య చేసింది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులేనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ కాస్త లేటుగా అయినా ఈ ఘటనపై స్పందించాడు. 'సినీ పరిశ్రమలో మేమంతా కలిసే వుంటాం.. మేం అన్నదమ్ములుగా వుండగా లేనిది, మీరెందుకు వివాదాలు సృష్టించుకుంటారు.?' అని ఇప్పటికీ ఘటనపై పవన్‌కళ్యాణ్ స్పందించిన విషయం విదితమే. జూనియర్ ఎన్టీఆర్ కూడా అదే రేంజ్‌లో అభిమానులకి క్లాస్ తీసుకున్నాడు. అయితే, 'నా అభిమానులు అలా చేయరనే అనుకుంటున్నాను.. ఒకవేళ ఎవరైనా అలాంటివారుంటే.. వారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా.. ముందు మీ తల్లిదండ్రులు, మీ భార్యా బిడ్డలు, సన్నిహితులు, ఇతర కుటుంబ సభ్యులు.. ఆ తర్వాతే మా మీద మీ అభిమానం చూపించండి..' అని జూనియర్ ఎన్టీఆర్ చేసిన విజ్ఞప్తిని అభినందించి తీరాల్సిందే.
అభిమానం వుండొచ్చు.. అది చంపుకునేంత దారుణంగా వుండకూడదు. ఇక్కడ పవన్‌కళ్యాణ్ అభిమాని హత్యకు గురయ్యాడు.. ఆ హత్య చేసింది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు.. మేటర్ ఇంతే కాదు, మొత్తంగా సినీ అభిమానుల్లో విపరీత పోకడలపై చర్చ జరగాలి. మొత్తంగా సినీ పరిశ్రమ సినీ అభిమానులకు 'గ్రేట్ అప్పీల్' చేయాల్సిన సందర్భమిది.
ఈ వ్యవహారంపై ముందుగా పవన్‌కళ్యాణ్ స్పందించడం, ఆ వెంటనే జూనియర్ ఎన్టీఆర్ స్పందించడం అభినందనీయమే.