అప్పుడు తండ్రి.. ఇప్పుడు తనయ

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో సెంటరాఫ్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది ప్రధానమంత్రి నరేంద్రమోడీ కాదు.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌. తెలుగు ప్రజలు రాష్ట్రాలుగా విడిపోయినా, ఒకే జాతిగా ఎప్పటికీ అన్నదమ్ముల్లా కలిసిమెలిసి వుంటారని కేసీఆర్‌ ఆకాంక్షించారు.. రాజధాని అమరావతి అద్భుతంగా రూపొందాలని, ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి పథంలో నడవాలంటూ కేసీఆర్‌ చేసిన ప్రసంగం అప్పట్లో ఓ సంచలనం. 

నిజానికి, అదే వేదిక పైనుంచి ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తెలంగాణ తరఫున సహాయం అందించేందుకు కేసీఆర్‌ ముందుకొచ్చారు. కానీ, ప్రధానమంత్రి పైసా విదల్చని కారణంగా, ఆ వేదికపై తాను ప్రకటన చేయడం మంచిది కాదని వెనక్కి తగ్గారు. ఆ విషయాన్ని కేసీఆర్‌, పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు కూడా. సాయం సంగతి తర్వాత, తెలుగు ప్రజలంతా ఒక్కటేనని ఆంధ్రప్రదేశ్‌లో కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్‌ ప్రజల్ని కదిలించాయి. 

ఇక, తాజాగా కేసీఆర్‌ కుమార్తె, నిజామాబాద్‌ ఎంపీ కవిత ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో జరిగిన మహిళా పార్లమెంటేరియన్‌ సదస్సులో మాట్లాడుతూ, చాలానే చెప్పారు. మహిళా సాధికారత గురించి సుదీర్ఘ ప్రసంగం చేశారు. అదంతా ఒక ఎత్తు, 'జై ఆంధ్రప్రదేశ్‌.. జై తెలంగాణ..' నినాదాలు ఇంకో ఎత్తు. ఈ నినాదాలతో ఆంధ్రప్రదేశ్‌ ప్రజల హృదయాల్ని కవిత 'టచ్‌' చేసేశారన్నది నిర్వివాదాంశం. అప్పుడేమో తండ్రి.. ఇప్పుడేమో తనయ.. అందరం తెలుగువాళ్ళమేనన్న భావన తీసుకురావడం అభినందనీయమే. రాజకీయ వివాదాలెలా వున్నాసరే, తెలుగు ప్రజల మధ్య ఐక్యత కోసం తెలంగాణ రాష్ట్ర ప్రముఖులు నినదించడాన్ని అభినందించకుండా వుండలేం. 

తెలంగాణ ప్రముఖులు ఇంతలా జై తెలంగాణ, జై ఆంధ్రప్రదేశ్‌ అంటున్నారుగానీ.. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ప్రముఖులు ఆ మాట అనగలరా.? అనాలనే ఆశిద్దాం.

Show comments