బాబుకు 'దూకుడు' నేత తగులుకుంటాడా?

రాజకీయాల్లో ఒక్క ఘటన కారణంగా, ఒక్క వ్యక్తి కారణంగా అన్యూహమైన పరిణామాలు జరుగుతుంటాయి. సజావుగా సాగుతున్న కథ క్లిష్టం కావచ్చు. క్లిష్టమైన కథ సజావుగా మారిపోవచ్చు. ఇలా పరిణామాలు మారడానికి ఆయా ఘటనల తీవ్రత లేదా ఆయా నాయకుల పాపులారిటీ, వారి స్టామినా వంటివి కారణమవుతాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు ఇలాగే ఉన్నాయి.

ఇప్పటివరకు వైకాపా అధినేత జగన్‌ పరిస్థితి, ఆయన భవిష్యత్తు గురించి మాట్లాడుకున్నవారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు క్రియాశీలక రాజకీయాల నుంచి నిష్క్రమించడంతో ముఖ్యమంత్రి కమ్‌ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి భవిష్యత్తు ఏమిటి? అని మాట్లాడుకుంటున్నారు. అంతంతమాత్రంగా ఉన్న టీడీపీ-బీజేపీ సంబంధాలు తెగిపోతాయని చాలామంది అంచనా వేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా ఇక చంద్రబాబుతో ఆడుకుంటారని, వెంకయ్య అండ లేని చంద్రబాబును మరింత ఇబ్బందుల పాలు చేస్తారని అనుకుంటున్నారు.

ఏపీ బీజేపీలో వెంకయ్యనాయుడు అనుకూల వర్గం, వ్యతిరేక వర్గం ఉన్న విషయం తెలిసిందే. వెంకయ్య, బాబు వ్యక్తిగతంగా దోస్తులు కాబట్టి వెంకయ్యకు వ్యతిరేక వర్గం బాబుకూ వ్యతిరేక వర్గమే. ఒరిజినల్‌ బీజేపీ నాయకులే కాకుండా విభజన సమయంలో కాంగ్రెసు నుంచి వచ్చి బీజేపీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ, దగ్గుబాటి పురందేశ్వరి తదితర నాయకులంతా బాబుకు వ్యతిరేకమే.

బాబు వ్యతిరేక వర్గం ఆయనపై, టీడీపీపై విమర్శలు చేయడానికి ఏమాత్రం వెనుకాడదు. అనేకసార్లు బాబు వ్యతిరేకవర్గంలోని నాయకులు, టీడీపీ నేతలు మాటలు ఈటెలు విసురుకున్నారు. ఈ వర్గం టీడీపీతో తెగదెంపులు చేసుకోవాలని యమ ఆత్రంగా ఉంది. విడిపోతేనే మంచిదని అమిత్‌ షాకు పలుమార్లు చెప్పింది. ఈ వర్గంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై ఆశలు పెట్టుకున్న సోము వీర్రాజు టీడీపీ మీద ఘాటు విమర్శలు చేస్తుంటారు.

తెలంగాణతో సహా పలు రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్షులు మారినా ఏపీలో మారలేదు. వెంకయ్యనాయుడు అనుకూలుడైన కంభంపాటి హరిబాబే కొనసాగుతున్నారు. ఇందుకు వెంకయ్యే కారణం. అధిష్టానం సోము వీర్రాజును అధ్యక్షుడిని చేద్దామనుకున్నా వెంకయ్యనాయుడు అడ్డుకున్నారు. వీర్రాజు అధ్యక్షుడైతే ఆయన 'దూకుడు' కారణంగా టీడీపీ-బీజేపీ బంధం తెగిపోయే ప్రమాదం ఉంది. ఇది గ్రహించిన అధ్యక్షుడిని మార్చకుండా చేశారు.

ఇప్పుడు వెంకయ్య అడ్డు తొలగిపోయింది కాబట్టి సోము వీర్రాజు అధ్యక్షుడవుతాడని అనుకుంటున్నారు. దూకుడుగా వ్యవహరించే నాయకుడు కావాలని అమిత్‌ షా ఆశిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మెత్తగా ఉండే హరిబాబు పార్టీని నడిపించలేరనే అభిప్రాయముంది. వీర్రాజు అధ్యక్షుడైతే మాత్రం బాబు వ్యతిరేకులకు పండగే. బాబుకు 'దూకుడు' నాయకుడు తగులుకుంటాడు. ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ నాయకులకు 'హరి' కథ విసుగుపుడుతోంది. ఇంకా ఎన్నాళ్లు వినాలి ఈ హరి కథ. వెంటనే దాన్ని కట్టిపెట్టండి అని మండిపడుతున్నారని సమాచారం. 

హరి కథ ఆపకపోతే రాష్ట్రంలో కాషాయం కషాయం తాగాల్సిందేనని అంటున్నారట...! ఇక్కడ హరి కథ అంటే బీజేపీ ఏపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు కథ అని అర్థం. రాష్ట్ర హరిబాబును మార్చాలని నాయకులు ఓసారి రాష్ట్రస్థాయి సమావేశంలోనే, అందులోనూ హరిబాబు సమక్షంలోనే డిమాండ్‌ చేశారని సమాచారం.

టీడీపీని సంతృప్తిపరచడానికే హరిబాబును కొనసాగిస్తున్నారని అప్పట్లో ఆరోపించారు. గతంలో ఢిల్లీలో పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా అధ్యక్షతన రెండు తెలుగు రాష్ట్రాల  బీజేపీ సమావేశాలు జరిగినప్పుడు ఆంధ్రా బీజేపీ అధ్యక్షుడుగా ఎమ్మెల్సీ సోము వీర్రాజును ఎంపిక చేశారని, ఇక అధికారికంగా ప్రకటించడమే తరువాయని మీడియాలో వార్తలొచ్చాయి.

కాని ఆ తరువాత ఇప్పటివరకు డెవెలప్‌మెంట్‌ లేదు. కొత్త అధ్యక్షుడిని ప్రకటించకపోవడానికి చంద్రబాబు, వెంకయ్య లాబీయింగ్‌ కారణమని ఒక వర్గం నాయకులు చెప్పారు. నిజానికి బీజేపీకి ఇప్పుడు కావల్సింది టీడీపీ మీద దూకుడుగా వ్యవహరించేవాడు ప్లస్‌ కాపు సామాజిక వర్గాన్ని పార్టీ వైపు తిప్పగలిగినవాడు. ఈ రెండు పనులు సోము వీర్రాజు చేయగలడనే నమ్మకం నాయకత్వానికి ఉంది. హరిబాబును తొలగించాలని పార్టీ నిర్ణయించుకోగానే ముందుగా వినిపించిన పేరు సోము వీర్రాజు. వెంకయ్య ఉపరాష్ట్రపతి పదవికి ఎంపికయ్యాక మళ్లీ ఆయన పేరు వినబడుతోంది.

Show comments