అసలు సీక్రెట్‌ చెప్పేసిన చంద్రబాబు!!

పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబునాయుడు అసలు సీక్రెట్‌ చెప్పేశారు. సదరు ప్రాజెక్టును ఆయన ఎప్పటికి పూర్తి చేయదలచుకున్నారో, ఏమో గానీ.. ఆ ప్రాజెక్టు నిర్మాణం అనేది కాంట్రాక్టర్లకు పెద్ద అదృష్టం అని ఆయన వెల్లడించారు. మొత్తానికి కాంట్రాక్టర్లకు అనుచితమైన లబ్ధి చేకూర్చడానికే పోలవరం విషయంలో చంద్రబాబు దారి తప్పి వ్యవహరిస్తున్నారంటూ చాలా కాలంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న ఆరోపణలకు కూడా ఆయన ఊతం ఇచ్చినట్లయింది. 

చంద్రబాబునాయుడు ప్రభుత్వం ప్రస్తుతం రాష్ట్రంలో 'పోలవరం' అనే ప్రహసనాన్ని ముందుకు తీసుకువెళ్లడం తప్ప మరో పని చేయడం లేదు. నిజానికి ఇది జాతీయ ప్రాజెక్టు. కానీ ఒక ఏజన్సీ హోదాలో నిర్వహణ, పనిచేయించే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. చంద్రబాబునాయుడు కాంట్రాక్టర్లతో కుమ్మక్కు అయ్యారనే ఆరోపణలు విశృంఖలంగా ఉన్నాయి. పోలవరం కాంట్రాక్టర్లకు అనుచిత లబ్ధి చేకూర్చేందుకు ఎస్టిమేట్లు దాదాపు 20 వేల కోట్ల రూపాయల మేర రివైజ్‌ చేయడం జరిగింది. 

పనులు ఆలస్యంగా చేస్తున్నారంటూ కేంద్రం కాంట్రాక్టర్ల మీద కన్నెర్ర చేసే పరిస్థితి వస్తే అడ్డగోలుగా తాను అడ్డుండి కాపాడే ప్రయత్నం చేసిన వ్యక్తి చంద్రబాబునాయుడు అని కూడా కొన్ని పుకార్లున్నాయి. ఏది ఏమైనప్పటికీ.. సవరణల రూపంలో వేల కోట్ల రూపాయల అదనపు లాభాలు అందించే ప్రభుత్వాలు ఉంటే.. అది కాంట్రాక్టర్లకు వరం కాక మరేమవుతుంది అనేది అందరూ చెప్పుకుంటున్న మాట. 

చంద్రబాబునాయుడు కూడా పోలవరం అనేది కాంట్రాక్టర్లకు అదృష్టం అనే సెలవిస్తున్నారు. అవును అదృష్టం పట్టే వారు చంద్రబాబు ద్వారా ఎస్టిమేట్లు రివైజ్‌ చేయించుకోగలుగుతున్నారు. పనులు ఎంత నెమ్మదిగా చేస్తున్నా నెట్టుకు రాగలుగుతున్నారు. ఇదే చంద్రబాబు పోలవరం అనేది రాష్ట్ర ప్రజల అదృష్టం అని చెప్పలేకపోవడం సిగ్గు చేటు అని ఆయన రాజకీయ ప్రత్యర్థులు వ్యాఖ్యానిస్తున్నారు. కాంట్రాక్టర్లకు అదృష్టం అనే మాటను ఆయన బహిరంగంగా అయితే భిన్నమైన అర్థంలోనే వాడారు. అంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకట్టడం వారికీ ప్రతిష్ట అన్నట్లుగా కలర్‌ ఇచ్చారు గానీ.. ఇలా అడ్డగోలుగో దోచుకోడానికి చాన్సిచ్చే ప్రభుత్వాలు ఉన్నప్పుడు కచ్చితంగా అది కాంట్రాక్టర్లకు అదృష్టమే తప్ప ప్రజలకు కాదని పలువురు ఎద్దేవా చేస్తున్నారు. 

Show comments