సెల్ప్‌ గోల్‌: డ్యామిట్‌ కథ అడ్డం తిరిగింది

అసలు తెలంగాణలో ఏం జరుగుతోంది.? నిన్న మొన్నటిదాకా ప్రశాంతంగా వున్న తెలంగాణ, ఒక్కసారిగా ఎందుకు ఉద్రిక్తంగా మారుతోంది.? 'తెలంగాణలో వున్నవాళ్ళంతా మావాళ్ళే..' అని చెప్పిన సోకాల్డ్‌ తెలంగాణ మేధావులు, ఇప్పుడెందుకు అసహనంతో ఊగిపోతున్నారు.? సీమాంధ్ర జడ్జీలపై, సీమాంధ్ర న్యాయాధికారులపై ఎందుకు విరుచుకుపడుతున్నారు.? ఈ ఆందోళనలు, ఉద్రిక్తతలతో తెలంగాణ బ్రాండ్‌ ఇమేజ్‌ ఏమైపోవాలి.! 

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతికి హైద్రాబాద్‌ నుంచి ఉద్యోగులు తరలి వెళ్ళిపోతున్నారు. మొదట్లో ససేమిరా అన్నా, చివరికి ఉద్యోగులు తమ ప్రభుత్వ అల్టిమేటంని స్వీకరించక తప్పలేదు. ఈ క్రమంలో ఇప్పటిదాకా సహచరులుగా పనిచేసిన తామంతా విడిపోతున్నందుకు తెలంగాణ ఉద్యోగులు కంటతడి పెట్టారు. 'మీరు అమరావతికి వెళ్ళిపోయినాసరే, అప్పుడప్పుడూ హైద్రాబాద్‌కి వస్తూ వుండండి.. మేం కూడా అమరావతికి వస్తూనే వుంటాం..' అంటూ ఒకరినొకరు ఓదార్చుకున్నారు. 

చాలా అద్భుతంగా కనిపించింది ఆ దృశ్యం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ఉద్యోగులు మానసికంగా విడిపోలేదనే విషయం అప్పుడు అందరికీ అర్థమయ్యింది. ఉద్యమ గాయాలు మనసులోతుల్లోకి వెళ్ళలేదని ప్రతి ఒక్కరూ ఒప్పుకున్నారు. అలా ఒప్పుకున్నవారిలో సోకాల్డ్‌ తెలంగాణ మేధావులూ వున్నారు. దురదృష్టవశాత్తూ ఇప్పుడు ఆ మేధావులు, ప్రాంతీయ విధ్వేషాల్ని రెచ్చగొడుతున్నారు. 

ఓ పక్క మల్లన్న సాగర్‌ వివాదం తెలంగాణలో రాజకీయంగా తమను ఇరకాటంలో పెట్టేయడంతో ముఖ్యమంత్రి షాక్‌కి గురయ్యారు. అంతే, హైకోర్టు విభజన అంశం తెరపైకొచ్చింది. ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్‌కి వెళ్ళిపోతున్నారు.. తెలంగాణలోని చాలా ప్రభుత్వ కార్యాలయాలు (ఆంధ్రప్రదేశ్‌ ఇప్పటిదాకా వాడుకుంటున్నవి) ఖాళీ అయిపోతున్నాయి.. ఇది కూడా తెలంగాణ ముఖ్యమంత్రికి షాక్‌ ఇచ్చింది. అంతే, హైకోర్టు విభజన అంశం ముదిరి పాకాన పడింది. 

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా.. ఉద్యోగుల తరలింపుతో తెలంగాణ ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పైచేయి సాధించింది. ఒకరా? ఇద్దరా? వందల సంఖ్యలో ఉద్యోగులు, అమరావతికి తరలి వెళుతున్నారు. తద్వారా తెలంగాణ ఖజానాకి పెద్ద లోటే పడనుంది. కొందరు కుటుంబ సమేతంగా తరలి వెళ్ళడంతో విశ్వనగరం హైద్రాబాద్‌ ముందు ముందు చిన్నబోయే ప్రమాదముందన్న ముందస్తు హెచ్చరికలతో కేసీఆర్‌ షాక్‌ల మీద షాక్‌లు తినేస్తున్నారు. 

హైద్రాబాద్‌ విశ్వనగరమే అయినా, వున్నపళంగా కాస్తో కూస్తో ఖాళీ అయితే ఖచ్చితంగా ఇబ్బంది వచ్చి తీరుతుంది. పది మంది పాతిక మంది కాదు.. వంద మంది అసలే కాదు, వెయ్యి మందీ కాదు.. అంతకు మించి.. ఉద్యోగులు హైద్రాబాద్‌కి గుడ్‌ బై చెప్పి అమరావతికి వెళ్ళడం చిన్న విషయమేమీ కాదు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి ఆ విషయం బాగా తెలుసు. ఉద్యోగులు, వారిపై ఆధారపడ్డ కుటుంబాలు.. ఉద్యోగుల ద్వారా పరోక్షంగా ఉపాధి పొందేవారు.. ఇలా ఇదంతా పెద్ద ఛెయిన్‌. 

20 ఏళ్ళ క్రితం హైద్రాబాద్‌ పరిస్థితికీ, ఐదేళ్ళ క్రితం హైద్రాబాద్‌ పరిస్థితికీ స్పష్టమైన తేడా. అనూహ్యంగా ఆ పదిహేనేళ్ళలో హైద్రాబాద్‌ పెరిగిపోయింది. ఆ పెరుగుదలకు ఇప్పుడు ముప్పు వచ్చేలా వుంది. సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్ని తీసుకొస్తున్నాం.. హైద్రాబాద్‌ని విశ్వనగరం చేసేస్తాం.. అంటే సరిపోతుందా.? సరిపోదుగాక సరిపోదు. పరిస్థితులు ఒకటొకటీ అర్థమయ్యేసరికి కేసీఆర్‌, హైకోర్టు విభజన అంశాన్ని నెత్తికెత్తుకున్నారన్నది నిర్వివాదాంశం. 

గడచిన రెండేళ్ళలో లేని ఉద్యమం ఒక్కసారిగా ఎందుకు ఉధృతమయ్యింది.? ఎందుకు హింసాత్మకంగా మారుతోంది.? మల్లన్నసాగర్‌ వివాదం మాటేమిటి.? అమరావతికి ఆంధ్రప్రదేశ్‌ ఉద్యోగులు తరలి వెళ్ళడం సంగతేంటి.? ఈ క్వశ్చన్స్‌ ఒకదాని వెంట ఒకటి వేసేసుకుంటే, సమాధానం దానంతట అదే దొరికేస్తుంది. ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్‌, పరిస్థితుల్ని చక్కదిద్దాల్సింది పోయి, అగ్నికి ఆజ్యం పోస్తున్నారు. తద్వారా హైద్రాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ మటాష్‌ అయిపోవడం తప్ప, ఒరిగేదేమీ లేదు. ఇప్పుడిక సెంటిమెంట్‌ పుట్టించడానికీ కేసీఆర్‌ వద్ద ఆయుధాలేమీ లేవు. అందుకే, కేసీఆర్‌ సెల్ఫ్‌ గోల్‌.. డ్యామిట్‌ కథ అడ్డం తిరిగింది అంటోన్నది.

Show comments