ఆపరేషన్‌ 'ఖతమ్‌ కాంగ్రెస్‌'.!

కాంగ్రెస్‌ పార్టీని మట్టుబెట్టాలి.. దానికోసం ఏం చేయడానికైనా కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్‌ వెనుకాడ్డంలేదు. కేంద్రంలో అధికారం వెలగబెడ్తోన్న మోడీ సర్కార్‌ది ఒకటే లక్ష్యం.. అదే కాంగ్రెస్‌ పార్టీ. 'ఖతమ్‌ కాంగ్రెస్‌' ఆపరేషన్‌లో భాగంగా, ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీని నిలువునా ముంచేసింది బీజేపీ. మొన్నటి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ మెజార్టీ సాధించినా, ఒకే ఒక్క రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారం దక్కించుకోగలిగింది. అదీ కాషాయదళం చేపట్టిన ఆపరేషన్‌ 'ఖతం కాంగ్రెస్‌' తీరు. 

ఇక, ఇప్పుడు ఒకే ఒక్క రాజ్యసభ సీటు కోసం గుజరాత్‌లో కాంగ్రెస్‌ పార్టీని మట్టికరిపించేందుకు సమాయత్తమవుతోంది. ఇప్పటికే ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలని లాగేసిన బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీకి మరో ఝలక్‌ ఇచ్చింది. కర్నాటకలో కాంగ్రెస్‌ అధికారంలో వుంది. ఆ కారణంగా, గుజరాత్‌లోని తమ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా తెలివిగా కాంగ్రెస్‌ అధిష్టానం కర్నాటకకు వారిని తరలించింది. ఏం లాభం.? కాంగ్రెస్‌కి చెందిన ఓ ఎంపీ, అలాగే కర్నాటక మంత్రిపై ఐటీ దాడులు షురూ అయ్యాయి. దాంతో, కాంగ్రెస్‌ దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోయింది. 

'ఒకే ఒక్క రాజ్యసభ సీటు కోసం ఇంతలా దిగజారిపోతారా.?' అంటూ కాంగ్రెస్‌ నేతలు గగ్గోలు పోఎడ్తోంటే, ఐటీ దాడులతో తమకు సంబంధం లేదని బీజేపీ చెబుతోంది. తమిళనాడులోని అన్నాడీఎంకేని ఇలాగే 'బ్లాక్‌మెయిల్‌' చేసిన బీజేపీ, ఆ పార్టీని తమలో విలీనం చేసుకునే దిశగా వ్యూహాల్ని రచించిన విషయం విదితమే. 

కర్నాటకలో గతంలో బీజేపీ ప్రభుత్వం వున్నప్పుడు కుప్పలు తెప్పలుగా అవినీతి ఆరోపణలొచ్చాయి. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది అప్పటి బీజేపీ ప్రభుత్వం. ఇప్పుడు అదే కర్నాటకలో, బీజేపీ తమ రాజకీయ ప్రత్యర్థి కాంగ్రెస్‌పైకి 'ఐటీ అస్త్రం' ప్రయోగించడం ఆశ్చర్యకరమే. అటు గుజరాత్‌ కాంగ్రెస్‌, ఇటు కర్నాటక కాంగ్రెస్‌.. ఒక్క దెబ్బకి రెండు పిట్టలు.. మోడీ చేపట్టిన ఆపరేషన్‌ 'ఖతమ్‌ కాంగ్రెస్‌'కి సంబంధించి మరో కీలక పరిణామం చోటు చేసుకున్నట్టే.

Show comments