తేడా వస్తే.. ధోనీకి కౌంట్ డౌనే..!

ఒకవైపు టెస్టుల్లోనేమో టీమిండియా సత్తా చాటుతోంది. నిన్న న్యూజిలాండ్ పై క్లీన్ స్వీప్ చేశారు. మొన్న వెస్టిండీస్ తో ఆ దేశంలో గెలిచి.. క్లీన్ స్వీప్ చేసినంత పని చేసింది టీమిండియా. ఇలా ఇంటా బయట సత్తా చాటుతూ.. విరాట్ కొహ్లీకి కెప్టెన్ గా బోలెడంత పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెడుతోంది.  ప్రస్తుతం టెస్టుల్లో టీమిండియా ప్రపంచ నంబర్ వన్!

ఇక వన్డేల విషయానికి వస్తే.. లాస్ట్ సీరిస్ జింబాబ్వేపై గెలిచినా, అదేమంత గొప్ప కాదు. అంతకు ముందు సీరిస్ ల ఫలితాలను చూసుకొంటే మాత్రం.. టెస్టుల్లో అంత దూకుడు లేదేమో అనుకోవాల్సి వస్తోంది. టీ20 మ్యాచ్ లలో ఆఖరి నిమిషాల్లో ఓటములు.. వన్డే సీరిస్ లు కోల్పోవడాలు జరిగాయి.

ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు కివీస్ తో టీమిండియా వన్డే పోరాటం మొదలు అవుతోంది. ఇక్కడ వన్డేలు, టెస్టులు అంటూ ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఎందుకొస్తోందంటే.. ఈ రెండు ఫార్మాట్ లకూ వేర్వేరు కెప్టెన్ లు ఉండటం వల్ల. 

టీమిండియాలో గత కొన్ని దశాబ్దాల్లో దాదాపు ఇలాంటి పరిస్థితి లేదు. వన్డేలకు ఒక కెప్టెన్ , టెస్టులకు మరో కెప్టెన్.. ఇవన్నీ టీమిండియాలో సాధారణంగా చెల్లవు. అయితే టెస్టుల నుంచి ధోనీ తప్పుకోవడంతో విరాట్ కు కెప్టెన్సీ అవకాశం దక్కింది. దాన్ని అతడు సద్వినియోగం చేసుకుంటున్నాడు. వన్డేలు, టీ20ల్లో మాత్రం ధోనీ కొనసాగుతున్నాడు. ఈ ఫార్మాట్ లలో టీమిండియా ప్రదర్శన మరీ దారుణంగా ఏమీ లేకపోయినా.. ‘నంబర్ వన్’ స్థాయిలో మాత్రం లేదు!

దీంతో ధోనీపై సహజంగానే ఒత్తిడి పెరుగుతోంది. టెస్టు కెప్టెన్ దూసుకుపోతున్న నేపథ్యంలో ధోనీకి విరాట్ తో పోలిక వస్తోంది. ఏమాటకు ఆ మాట చెప్పుకొంటే.. బ్యాట్స్ మన్ గా ధోనీకి అందనంత ఎత్తుకు విరాట్ ఎదిగిపోతున్నాడు. తన తిరుగులేని ఫామ్ తో ప్రస్తుత అంతర్జాతీయ క్రికెట్ లోనే  క్రేజీ క్రికెటర్ ఇమేజ్ ను తెచ్చుకుంటున్నాడు. విదేశీ క్రికెట్ ధిగ్గజాలు, పక్క దేశాల కోచ్ లు కూడా.. విరాట్ బ్యాటింగ్ అంటే అది ఎంత ప్రత్యేకమో చెబుతున్నారు.

కెప్టెన్ గా ధోనీకి ఇన్నేళ్లూ తిరుగులేదు కానీ.. బ్యాట్స్ మన్ గా ధోనీ మంచి ఇన్నింగ్స్ ఆడాడు అని చెప్పుకోవడానికి ఈ మధ్య కాలపు జ్ఞాపకాలు ఏమీ లేవు. లాస్ట్ లో వచ్చి సిక్స్ కొట్టడం మాత్రమే.. ధోనీ ప్రత్యేకత అయిపోయింది చివరకు! కీపింగ్ బాధ్యతలే ధోనీని రక్షిస్తున్నాయి. మరి ఇప్పుడు  న్యూజిలాండ్ తో వన్డే సీరిస్ ఆరంభం నేపథ్యంలో ఈ పరిస్థితిని గమనిస్తే.. ఈ సీరిస్ దగ్గర నుంచి ధోనీ ఒత్తిడి మరింత పెరుగుతుంది. ఫలితాల్లో తేడా వస్తే మాత్రం.. కెప్టెన్ గా ధోనీకి కౌంట్ డౌన్ మొదలయినట్టే.

ఈ విషయం ధోనీకి తెలియనిది ఏమీ కాదు. అలాంటి పరిస్థితే వస్తే.. ఓడీఐల కెప్టెన్సీని కూడా విరాట్ కు అప్పగించి.. ఆటగాడిగా కొనసాగే బ్రాడ్ మైండెడ్ ఎమ్ఎస్. వచ్చే ప్రపంచకప్ వరకూ టీమ్ లో ఉండాలనుకుంటే.. ధోనీ ఆ మార్గాన్నే అనుసరించే అవకాశం ఉంది.  

Show comments