'సుప్రీం' తీర్పు ఎలాంటి పాఠమవుతుందో....!

పెద్ద నోట్ల రద్దు నిర్ణయం సృష్టిస్తున్న ప్రకంపనాలను చూస్తూనే ఉన్నాం. పత్రికల్లో, టీవీ ఛానెళ్లలో సింహభాగం కథనాలు దీనిపైనే వెలువడుతున్నాయి. మరోలా చెప్పాలంటే మీడియాలో వేరే అంశానికి ప్రాధాన్యం లేదు. ఏ ఇద్దరు కలుసుకున్నా డబ్బు బాధల గురించి తప్ప మరో విషయం మాట్లాడటంలేదు. మీడియాలో మేధావులు, పాత్రికేయ ప్రముఖులు, విశ్లేషకులు మొదలైనవారు చేస్తున్న చర్చల్లో ప్రస్తావనకు వస్తున్న విషయం ఒకటుంది. పెద్ద నోట్లు రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగం ప్రకారం కరెక్టేనా? కాదా? దీనికి రాజ్యాంగబద్ధత ఉందా? లేదా? ఈ అంశంపై సామాన్యులు చర్చించకపోయినా మేధావులు, న్యాయనిపుణులు చర్చిస్తున్నారు. 

ఈ అంశాన్ని త్వరలోనే సుప్రీం కోర్టు కూడా పరిశీలించబోతున్నది. వాస్తవానికి నోట్ల రద్దుకు కాకపోయినా, నోట్ల రద్దును సరైన మార్గంలో చేయనందుకు, ప్రజలు ఇబ్బందులు పడకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకోకుండా సర్కారు అనాలోచితంగా వ్యవహరించినందుకు సుప్రీం కోర్టు కూడా మోదీపై గుర్రుగానే ఉంది. తన చర్యల ద్వారా నిరసన వ్యక్తం చేసింది. నోట్ల రద్దు నిర్ణయం వెనక్కి తీసుకోవాలని పలు రాజకీయ పార్టీలు డిమాండ్‌ చేశాయి. అవి నిరసనలో భాగంగా ఈ డిమాండ్‌ చేశాయిగాని ఇంత జరిగాక సాధ్యం కాదు. ఇక మోదీ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని, చెల్లదని పేర్కొంటూ దేశంలోని అనేక హైకోర్టుల్లో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. 

వీటిని విచారణకు స్వీకరించొద్దని, స్టే విధించాలని ప్రభుత్వం సుప్రీం కోర్టును కోరింది. కాని న్యాయస్థానం తిరస్కరించింది. కష్టాల్లో ఉన్న ప్రజలకు న్యాయస్థానంలో ఉపశమనం లభించాలని, ఆ పిటిషన్లను తాము అడ్డుకోబోమని సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది. ప్రజల ఇబ్బందులు తొలగించేందుకు అనేక చర్యలు తీసుకుంటన్నామని, కాబట్టి పిటిషన్లను విచారించాల్సిన పనిలేదని ప్రభుత్వం చేసిన వాదనతో సుప్రీం ఏకీభవించలేదు. డిసెంబరు రెండో తేదీ నుంచి విచారణ జరుగుతుందని స్పష్టం చేసింది. మోదీ నిర్ణయం రాజ్యాంగబద్ధమేనా? కాదా? అనే సందేహం సుప్రీం కోర్టుకూ ఉంది. అందుకే ఈ అంశాన్ని రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించాలని భావిస్తోంది. 

ఈ ధర్మాసనం దీనిపై విచారణ జరిపి మోదీ నిర్ణయాన్ని తప్పుబడితే మాత్రం సర్కారుకు ఇబ్బందికరమైన పరిస్థితి కలుగుతుంది. జరిగింది వెనక్కు తీసుకునే అవకాశం లేదుగాని మోదీ రాజ్యాంగం ప్రకారం వ్యవహరించలేదనే అభిప్రాయం జనాలకు కలుగుతుంది. సుప్రీం కోర్టు నుంచి ఎలాంటి తీర్పు వస్తుందో ఎదురుచూడాలి. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కడం ఇప్పటి పాలకులకు అలవాటే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజనలోనూ యూపీఏ సర్కారు రాజ్యాంగ నిబంధనలు పట్టించుకోలేదు. దీనిపై కొందరు దాఖలు చేసిన పిటిషన్లు సుప్రీం కోర్టులో విచారణకు ఉన్నాయి. నోట్ల రద్దు విషయంలో అనేక వాదనలు తెర మీదికి వస్తున్నాయి.  

Readmore!

ఈ నిర్ణయంతో మంత్రి మండలికి  సంబంధం లేదు. ఇది పూర్తిగా మోదీ వ్యక్తిగత నిర్ణయం. రద్దు ప్రతిపాదనను కేబినెట్‌ సమావేశంలో పెట్టి, చర్చించి, మంత్రుల అభిప్రాయాలు తెలసుకొని నిర్ణయం ప్రకటించలేదు. కేబినెట్‌  సమావేశం ముగించే సమయంలో మోదీ హఠాత్తుగా తన నిర్ణయం ప్రకటించి, మంత్రులను బయటకు వెళ్లొద్దని ఆదేశించి, పెద్ద నోట్లు రద్దు చేసినట్లు మీడియాకు తెలియచేశారు. చివరకు ఆర్థిక మంత్రికి కూడా చెప్పలేదు. కాబట్టి  నోట్ల రద్దు రాజ్యాంగబద్ధం కాదనేది ఒక వాదన.  నోట్ల రద్దు నిర్ణయం చాలా కీలకమైంది. దేశం మొత్తాన్ని ప్రభావితం చేసింది. ఇంతటి కీలక నిర్ణయాన్ని మంత్రి మండలిలో చర్చించకుండా మోదీ ప్రకటించారు. 

ఇది ప్రజాస్వామ్యానికి విరద్ధమని, ఇది చెల్లదని కొందరు ఆర్థిక, న్యాయ నిపుణులు పత్రికల్లో వ్యాసాలు రాస్తున్నారు. కరెన్సీ వ్యవహారమంతా రిజర్వు బ్యాంకుకు సంబంధించింది. నోట్లపై రిజర్వు బ్యాంకు గవర్నర్‌ సంతకం ఉంటుంది. నోట్ల చెల్లుబాటుకు రిజర్వు బ్యాంకు హామీ ఇస్తుంది. నోట్లను రద్దు చేయాలనుకున్నప్పుడు దాన్ని రిజర్వు బ్యాంకు గవర్నర్‌ ప్రకటించాలిగాని ప్రధాని ఎలా ప్రకటిస్తారు? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. నోట్ల రద్దు నిర్ణయం అమల్లోకి వచ్చాక రిజర్వు బ్యాంకు గవర్నర్‌ ఊర్జిత్‌ పటేల్‌ ఇప్పటివరకు సీన్‌లోకి రాలేదు. ఒక్క మాటా మాట్లాడలేదు. 

ఎందుకు అజ్ఞాతంలో ఉన్నారో అర్థం కావడంలేదు. నోట్ల రద్దుకు ప్లాన్‌ తయారుచేసింది ఊర్జిత్‌ పటేలేనట....! అంటే రెండువేల నోటు ప్రింటింగ్‌, దాని డిజైనింగ్‌, తద్వారా దాన్ని ఏటీఎంలు స్వీకరించలేకపోవడం, ఐదొందల నోట్లు ఆలస్యంగా ముద్రించడం, రద్దు నిర్ణయానికి ముందు తగినంత చిన్న నోట్లు అందుబాటులో ఉంచకపోవడం టోటల్‌గా ఇదంతా ఆర్థిక సంక్షోభానికి దారితీయడం...దీనికంతా ఊర్జిత్‌ పటేలే కారణమని మోదీ మండిపడినట్లు వార్తలొచ్చాయి. అందుకే ఆయన్ని అజ్ఞాతంలో ఉంచారట...! ఏది ఏమైనా మోదీ నిర్ణయం వచ్చే తీర్పు భవిష్యత్తు ప్రభుత్వాలకు పాఠం కావాలి. 

Show comments