నీరుగారిపోతున్న 'అమరావతి'.!

ఇప్పటికైతే అమరావతి అంటే, తాత్కాలిక సచివాలయం మాత్రమే. అదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి. ఆ ప్రాంగణంలోనే సచివాలయం వుంది, అసెంబ్లీ వుంది, శాసనమండలినీ ఏర్పాటు చేసింది చంద్రబాబు సర్కార్‌. సెక్రెటేరియట్‌ అంటేనే అత్యంత ప్రతిష్టాత్మకం. అలాంటిది, అసెంబ్లీ - శాసన మండలి అంటే ఇంకెంత ప్రతిష్టాత్మకం.? ఒక్క మాటలో చెప్పాలంటే పేరుకి 'తాత్కాలికం' అయినాసరే, సచివాలయ ప్రాంగణం - ఆంధ్రప్రదేశ్‌ ఆత్మగౌరవం. 

దాదాపు వెయ్యి కోట్ల ఖర్చు.. మొత్తంగా ఏడాది కాలం పాటు నిర్మాణం.. మరి, ఇంత గొప్పగా నిర్మించినప్పుడు, ఆ ప్రాంగణమెలా వుండాలి.? అద్భుతంగానే తయారైంది. కానీ, మేడిపండు చందమే అని ఇప్పుడు నిరూపితమయ్యింది. ఒక్క వాన.. అదీ గట్టిగా కురిసిన వాన.. అందునా, తొలి వర్షాకాలం. దెబ్బకి 'మేడిపండు' రహస్యం బయటపడిపోయింది. అసెంబ్లీ, సచివాలయ భవనాలు.. ఇవేవీ 'లీకేజీలకు అతీతం' కాలేకపోయాయి. దాదాపు అన్ని చోట్లా లీకేజీలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. 

ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌కి సంబంధించిన చాంబర్‌ అయితే, బొక్కలు పడ్డ రేకుల షెడ్‌ని తలపించింది. లోపల ఖరీదైన ఫర్నిచర్‌.. పైనుంచి మాత్రం యధేచ్ఛగా కారుతున్న వర్షపు నీరు.. వెరసి, అమరావతి పరువు పోయింది. ఇంతకీ, వేల కోట్లు ఎందుకు ఖర్చయ్యాయి.? నాణ్యత ఏది.? ఈ పాపానికి బాధ్యత ఎవరు వహిస్తారు.? ఇవి మాత్రం ప్రస్తుతానికి మిలియన్‌ డాలర్‌ ప్రశ్నలే. 

చిన్న సమస్యనీ బూతద్ధంలో చూడటం తప్పు కావొచ్చు.. కానీ, ఆత్మగౌరవమని చెప్పుకునే సచివాలయ ప్రాంగణం విషయంలో ఇంత నిర్లక్ష్యమా.? ఇది తప్పు మాత్రమే కాదు.. తీవ్రంగా పరిగణించాల్సిన నేరం కూడా. మరి, శిక్ష ఎవరికి.? వెయ్యి కోట్లు అంటే, అదేమీ ఆషామాషీ వ్యవహారం కాదు.. ప్రజాధనం. మరి, ఆ ప్రజాధనం దుర్వినియోగమయినప్పుడు బాధ్యత వహించాల్సిందెవరు.? రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడీ దారుణంపై పెదవి విప్పాల్సిందే. 

చివరగా: తాత్కాలిక సచివాలయం పేరుకే తప్ప.. నిర్మాణాల పరంగా కాదని చంద్రబాబు చెప్పారు. పైన ఇంకో ఆరేడు అంతస్తులు వస్తాయన్నారు. ఇప్పుడు అమరావతి ఇంతలా నీరుగారిపోయాక, రేప్పొద్దున్న శాశ్వత భవనాల పరిస్థితి ఇంకేమవుతుందో.! ఊహించుకుంటేనే ఒళ్ళు జలదరించేయడం ఖాయం.

Show comments