దర్శకులతో హీరోల ఫుట్ బాల్!

-ఒక్కో హీరో కాంపౌండ్‌లో కొంతమంది దర్శకులు

-సంవత్సరాలకు సంవత్సరాలు ఎదురుచూపులే!

-హిట్లున్న దర్శకులదీ ఇదే పరిస్థితి

-హీరోల ఆధిపత్య పోకడ, నాన్చుడు ధోరణి

-టాలీవుడ్‌లో ఇంతే మరి!

‘ది డైరెక్టర్ ఈజ్ కెప్టెన్ ఆఫ్ ది షిప్..’’ అని అంటుంటారు ప్రసిద్ధ కవి, రచయిత గుల్జార్. తెలుగునాట కూడా దాసరి నారాయణ రావు వంటి దర్శకులు తరచూ ఈ మాట చెబుతూ ఉంటారు. దర్శకుడి ప్రాధాన్యత ఆ స్థాయిలో ఉంటుందని అంటుంటారు. ఇదే సమయంలో.. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదని కూడా వీరు వాపోతూ ఉంటారు. దర్శకుడి ప్రాధాన్యత తగ్గలేదు కానీ, విలువ లేకుండా పోయిందని.. తరచూ చెబుతూ ఉంటారు. ఇది కాదనలేని వాస్తవం. హీరోల స్వామ్యం అయిపోయిన ఇండస్ట్రీలో దర్శకుడు ఏనాడో డమ్మీగా మారిపోయాడు. తమ పేరు మీదే మార్కెటింగ్ జరుగుతుందనే భావనలో, తమ ఫేస్‌కే టికెట్లు తెగుతాయి, తాము నటిస్తున్నామంటే.. కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుందని ఫిక్సయిన హీరోలు.. నిర్మాతకు, దర్శకుడికి, ఇతర తారాగణానికి, ఆఖరికి ఈ సమాజానికే విలువనివ్వని స్థాయికి వెళ్లిపోయారు!

తమను తాము అతీతులు అనుకునే స్థాయికి చేరుకున్నారు. తమను తాము దైవాంశ సంభూతులు అనే దశకు వెళ్లిన వీరిని, కొందరు భజంత్రీలు కూడా దేవుళ్లుగా చేసేశారు. ఇలాంటి భజన చేస్తున్నదీ ఇండస్ట్రీలోని వ్యక్తులే. మరి అలాంటప్పుడు మళ్లీ దర్శకులకు, నిర్మాతలకు విలువంటూ లేకుండా పోయింది అంటూ మాట్లాడితే ప్రయోజనం ఏముంటుంది!

విలువనివ్వడం సంగతలా ఉంటే.. ఇండస్ట్రీలో జరుగుతున్న కొన్ని పరిణామాలు మరింత విచిత్రంగా ఉన్నాయి. గత నాలుగైదేళ్లుగా జరుగుతున్న కొన్ని పరిణామాలను గమనిస్తే.. దర్శకుల జీవితాలతో హీరోలు ఫుట్‌బాల్ ఆడుకుంటున్నారు! అనే అభిప్రాయం కలగకమానదు. ముందుగా చెప్పినట్టు.. హీరోల స్వామ్యం అయిన ఈ ఇండస్ట్రీల్లో దర్శకుల పరిస్థితి.. హీరోల చేతిల్లో పేక ముక్కల్లా తయారైంది! అవసరం అయినంత సేపూ ఉంచుకుని, అవసరం లేనప్పుడు విసిరి కొడుతున్న వైనాలు గోచరిస్తున్నాయిప్పుడు.

అతడు ఒక యువదర్శకుడు. ఎలాంటి సినీ నేపథ్యం లేదు. సినిమాలంటే ఆసక్తితో ఇటువైపు వచ్చాడు. దర్శకత్వానికి సంబంధించిన చదవులు, కోర్సులు, ఫిల్మ్ స్కూళ్లకు వెళ్లిన నేపథ్యం లేదు. కొన్నాళ్ల పాటు కష్ణానగర్‌లో తిరిగాడు.. చోటామోటా సినిమాలకు అసిస్టెంట్‌గా అవకాశం సంపాదించాడు. చాలా మంది కింద పనిచేశాడు. అలా పది సంవత్సరాలు గడిచిపోయాయి!

అంత అనుభవం సంపాదించినా.. ఏ హీరో పిలిచి అవకాశం ఏమీ ఇవ్వలేదు. ఇండస్ట్రీ గుట్లుముట్లు ఎరిగిన తర్వాత.. వాళ్లనూ వీళ్లను పట్టుకుని ఒక చిన్న సినిమా తీశాడు. బూతు ఫ్లేవర్‌ను గట్టిగానే దట్టించాడు. ఏం చేస్తాడు పాపం.. నిలదొక్కుకోవాలి. తనకున్న పరిమితుల్లో సినిమాను పూర్తి చేశాడు. శంగార సన్నివేశాలకు, హద్దుమీరిన చిత్రీకరణకు లోటు లేకపోవడంతో.. సినిమా కమర్షియల్ సెక్సస్ అయ్యింది!

సినిమాలో మేటర్ లేదు కానీ.. అమ్మాయిల హాస్టళ్లలో బూతు సంభాషణలు చేసుకుంటారని, ఇంటర్నెట్ కేఫుల్లో అన్నీ అయిపోతాయని.. చూపిన సినిమాకు కలెక్షన్ల వర్షం కురిసింది. ఆ వెంటనే ఆ దర్శకుడిలోని వేడిని గుర్తించి.. ఒక స్టార్ హీరో అవకాశం ఇచ్చాడు. బూతు సినిమా తీయాలని కాదు, సినిమాని డీల్ చేయగలడనే నమ్మకంతో అవకాశం ఇచ్చాడు.

హీరో పిలుపు అయితే తొందరగానే వచ్చింది కానీ.. ప్రాజెక్టు పట్టాలెక్కడానికి మాత్రం చాలా సమయమే పట్టింది! దాదాపు సంవత్సరం! అంత వ్యవధిలో.. ఫస్ట్ సినిమా లాంటి వాటినైతే.. రెండు మూడు పూర్తి చేయగలిగే వాడు ఆ దర్శకుడు. కానీ పెద్ద హీరో పిలిచాడు.. అని వేరే సినిమాల జోలికి వెళ్లలేదు. ఎట్టేకలకూ పెద్ద హీరోతో సినిమా పట్టాలెక్కింది. దాదాపు ఏడాదికి సినిమా పూర్తి అయ్యింది. జస్ట్ యావరేజ్ అనిపించుకుంది!

ఆ దర్శకుడి గమనం అలా ఉన్న ఆ దశలోనే ఇండస్ట్రీలో ఒక సంప్రదాయం ఏర్పడింది.. ఒక్కో వంశానికి ఒక్కో క్యాంపుగా విడిపోయిన ఇండస్ట్రీ. తమ వంశంలోని అరడజను మంది హీరోల్లో ఎవ్వరికైనా ఒక్క హిట్టిచ్చాడంటే, అతడికి ఆ తర్వాతి సినిమా అవకాశం కూడా ఆ క్యాంపులోనే లభిస్తుంది. ఈ ఆఫర్ అయితే మంచిదే.. కానీ, ఆ ఆఫర్లకు అంగీకరిస్తేనే, దర్శకుల కెరీర్‌లు గల్లంతయిపోతున్నాయి!

పెద్ద హీరోతో రెండో సినిమా చేసిన ఆ దర్శకుడికి.. మూడో సినిమా ఆఫర్ ఆ క్యాంప్‌లోనే దక్కింది. ఆ కుర్రాడు మురిసిపోయాడు. ఆ పెద్ద హీరో పిలుపు మేరకు.. కథ, స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నాడు. ఆ హీరోకి చెప్పాడు... బాగుంది అన్నాడు  హీరో. ఆ దర్శకుడు మరింత హ్యాపీగా ఫీలయ్యాడు. ప్రస్తుతానికి హీరో బిజీ, ఆ తర్వాత కూడా కొన్ని కమిట్‌మెంట్స్ ఉన్నాయి. అదును చూసి పిలుస్తా.. అని హామీ ఇచ్చిన ఆ స్టార్ హీరో, నువ్వు వేరే సినిమాకు మాత్రం కమిట్ కాకూడదు.. అనే షరతు పెట్టాడు!

డైలామాలో పడిపోయాడు దర్శకుడు. వేచి చూశాడు.. మళ్లీ కొన్నాళ్లకు మళ్లీ పిలుపు.. మరో సబ్జెక్ట్‌ను రాయమన్నాడు, ఆ ముచ్చటా జరిగింది. హీరో నుంచి అప్‌డేట్ లేదు. రెండో సినిమా తర్వాత ఏడాదిన్నర కాలం అలా గడిచిపోయింది. సొంతంగా ఆఫీస్ పెట్టుకున్నాడు, కొంతమంది అసిస్టెంట్స్‌కు నెలవారీగా జీతాలు.. ఇది ఆ దర్శకుడి పరిస్థితి. నెలలు, సంవత్సరాలు అలాగడిచే సరికి.. వాటన్నింటినీ భరించడం కష్టం అయిపోయింది. హీరోనేమో ఏం చెప్పడు.. చివరికి గడవడం కష్టం అయిపోయింది! హీరో అపాయింట్‌మెంట్ దొరకడంలా!

రెండో సినిమాకు అవకాశం ఇచ్చిన పెద్ద హీరోతో ఆ సినిమాను పూర్తి చేయడానికి రెండేళ్లు పడ్డాయి. మూడో సినిమా ఆరంభానికి ముందే రెండేళ్లు గడిచిపోయాయి.. అది ఎప్పటికి మొదలవుతుందో కూడా తెలీయడంలా! హీరోను సంప్రదించడానికి ఆయన దొరకడు! బయటేమో అవకాశాలున్నాయి. చేసేది లేక.. వేరే హీరోతో సినిమాకు కమిట్ అయ్యాడు. రెడీ చేసుకున్న స్క్రిప్ట్‌తో మరో ప్రముఖ హీరోతో ఆ దర్శకుడి సినిమా అనౌన్స్ అయ్యింది. అది జరిగాకా.. ఇది వరకటి హీరో దగ్గర నుంచి పిలుపు! ఏంటి... వెయిట్ చేయలేకపోయావా? అంటూ ప్రశ్న! ‘లేదుసార్.. గడవడం కూడా కష్టం అయిపోయింది..’ అని ధీనంగా చెప్పుకుంటే, ‘సరే.. పో’, అని హీరోగారి ప్రతిస్పందన! మంచి ఊపు మీదున్న ఆ కుర్ర దర్శకుడిని రెండేళ్ల పాటు ఖాళీగా ఉంచిన ఆ టాప్ హీరో.. ఆ ఒక్కమాటా అని పంపించేశాడు! రెండు సంవత్సరాలు.. ఖాళీగా.. ఒక వ్యక్తి జీవితంలో అంది ఎంత విలువైన సమయమో చెప్పనక్కర్లా!  

టాలీవుడ్‌లో పెద్ద హీరోలతో పెట్టుకుంటున్న దర్శకుల పరిస్థితి ఎలా ఉందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. దాదాపు అందరు పెద్ద హీరోల తీరూ ఇలానే ఉంది. వారిని నమ్ముకున్న దర్శకుల పరిస్థితి ఇలానే ఉంది. సంవత్సరాలకు సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఐదారు మంది దర్శకులను క్యూలో నిలబెట్టుకుంటారు. అందరికీ హామీ ఇస్తారు. సినిమా ఎంతకూ పట్టాలెక్కదు. ఎవరో ఒకరికి అవకాశం ఇచ్చి మిగిలిన నలుగురికి నిరాశనే మిగులుస్తున్నారు. నాన్చి నాన్చి.. దర్శకుల కెరీర్‌ను నాశనం చేస్తున్నారు.

పైన పేర్కొన్న ఉదాహరణలోని దర్శకుడు.. ఆఖరికి ఆఫీస్ మెయింటెయిన్ చేసుకోవడానికి డబ్బులు లేని పరిస్థితుల్లో పడిపోయాడంటే, అదంతా ఒక టాప్ హీరో ధోరణి వల్లనే అంటే.. హీరోలు దర్శకులతో ఎలా ఆడుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు.

కేవలం ఆ ఒక్కహీరో కాదు, ఆ ఒక్క దర్శకుడు కాదు.. చాలా మంది పరిస్థితి ఇలానే ఉంది. టాలీవుడ్ హీరోల పరిస్థితి ఎలా ఉందంటే.. వీళ్లు చేసిన సినిమాల కన్నా, చేయబోతున్నామంటూ ప్రకటనలు  చేసే సినిమాల సంఖ్యనే ఎక్కువగా ఉంటుంది! పట్టాలెక్కించే సినిమాలతో పోలిస్తే.. అనౌన్స్ చేసే సినిమాల సంఖ్య చాలా ఎక్కువ. వీళ్లు అవకాశం ఇచ్చే దర్శకుల కన్నా.. వీళ్లు ఆడుకునే దర్శకుల సంఖ్య ఎక్కువ!

మొన్ననే ఎన్టీఆర్ తదుపరి సినిమా గురించి క్లారిటీ వచ్చింది. దర్శకుడు బాబీతో ఎన్టీఆర్ తన తదుపరి సినిమా చేయబోతున్నాడు. దీంతో చాలా మంది దర్శకులు ఊపిరి పీల్చుకున్నారు! మరి బాబీతో ఎన్టీఆర్ కమిటైతే.. మిగతా దర్శకులు ఊపిరి పీల్చుకోవడం ఏమిటి? అంటే.. దాని లెక్కలు దానికున్నాయి. బాబీతో మాత్రమే కాదు.. కొన్ని నెలల నుంచి చాలా మంది దర్శకులను క్యూలో ఉంచుకున్నాడు ఎన్టీఆర్. వారందరితోనూ సంప్రదింపులు కొనసాగుతున్నాయి. ఎంతకూ తేల్చడంలా. ఈ జాబితాలో త్రివిక్రమ్ శ్రీనివాస్, వక్కంతం వంశీ, అనిల్ రావిపూడి, పూరీ జగన్నాథ్, హనూ రాఘవపూడి.... ఇలా ప్రముఖ దర్శకుల పేర్లు వినిపించాయి. చివరకు బాబీతో ఖరారు అయ్యింది! 

గమనించాల్సిన అంశం ఏమిటంటే.. బాబీతో ఎన్టీఆర్ సినిమాను ఖరారు చేయగానే, మిగిలిన వాళ్లు తమ తదుపరి సినిమాల గురించి అనౌన్స్‌మెంట్లు చేసేసుకుంటున్నారు. ఎన్టీఆర్ చాలాకాలం పాటు నాన్చి నాన్చి చివరకు నో అనడంతో.. వక్కంతం వంశీ అల్లుఅర్జున్ దరికి చేరాడు. ఇక అనిల్ రావిపూడి రవితేజతో సినిమాను ఖరారు చేసుకుంటున్నాడు.. ఇక పూరీ లాంటి దర్శకులకు కూడా ఇప్పుడే క్లారిటీ వచ్చింది.. ఎన్టీఆర్ తమతో సినిమా చేయడు అని!

కనీసం అరడజను మంది దర్శకులు ఇప్పుడు రిలీఫ్ ఫీలవుతున్నారు. తమ పనేదో తాము చూసుకోవచ్చు అని! వీళ్లంతా ఎన్టీఆర్ కోసం వేచి ఉన్న వాళ్లే. ఈ జాడ్యం కేవలం ఎన్టీఆర్ ది మాత్రమే కాదు.. మిగిలిన స్టార్ హీరోలదీ ఇదే తీరు. ‘మిర్చి’తో  హిట్ కొట్టిన కొరటాల శివకు యమ డిమాండ్ వచ్చింది. దీంతో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు అతడితో సినిమాకు పోటీపడ్డారు. చివరకు చరణ్‌తో కమిటయ్యాడు శివ. అయితే సినిమా మాత్రం ఎంతకూ ఆరంభం కాలేదు. దాదాపు ఏడాది తర్వాత వచ్చిన వార్తేమిటంటే.. కొరటాలతో చరణ్ సినిమా చేయడం లేదు అనేది! ఆ ఏడాది వ్యవధి అనంతరం కొరటాల మహేశ్‌తో సినిమాను పట్టాలెక్కించాడు!

హిట్టు కొట్టినా ఉపయోగం లేదు!
చాలా మంది దర్శకుల పరిస్థితి ఇలానే ఉంది. మంచి హిట్టు కొడతారు. అందరి దష్టినీ ఆకర్షిస్తారు.. ఏ టాప్ హీరోనో పిలుస్తాడు. సబ్జెక్టు రెడీ చేయమంటాడు.. చేసిన తర్వాత ఉలుకూ పలుకూ ఉండదు. అప్పటికే సదరు ప్రాజెక్టు గురించి చాలా ప్రచారం జరిగి ఉంటుంది. ఆ దర్శకుడు ఆ హీరోని అంతటితో వదిలించుకుంటే.. హీరోనే దర్శకుడిని తిరస్కరించాడు అనే పేరొస్తుంది. నెలలు, సంవత్సరాలు ఇలానే గడిచిపోతాయి! దీంతో హిట్టు కొట్టినా ఆ ఉపయోగం ఉండదు చాలా మంది దర్శకులకు.

ఉదాహరణకు ‘ఊపిరి’ సినిమాతో హిట్టు కొట్టిన వంశీ పైడిపల్లి రోజులు వేచి చూపుల్లోనే గడిచిపోతున్నాయి. మహేశ్‌తో ఈ దర్శకుడి తదుపరి సినిమా అంటున్నారు. అయితే అది ఎప్పటికి తెములుతుందో ఊహించి చెప్పడం చిలక జోస్యుడి తరం కూడా కాదు! అఖిల్ కోసం ఈ దర్శకుడు కొంతకాలం వేచి చూశాడు. అయితే ఆ సినిమా పట్టాలెక్కలేదు, ప్రస్తుతం ఈ దర్శకుడు మహేశ్‌తో సినిమా కోసం వేచి ఉన్నాడు. ఏం జరుగుతుందో చూడాలి!

ఇక దర్శకుడు మేర్లపాక గాంధీ తన తొలి సినిమాతో అందరి దష్టిని ఆకర్షించిన వారిలో ఒకరు. రెండో సినిమాకే ఇతడికి మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ నుంచి పిలుపు వచ్చిందట. తొలి సినిమాలో ప్రేక్షకుడిని స్క్రీన్‌ప్లేతో కట్టిపడేసిన ఈ దర్శకుడి రెండో సినిమా మొదలుపెట్టడం మాత్రం చాలా కష్టం అయ్యింది. అందరూ మరిచిపోతారేమో అనే దశ వరకూ వచ్చింది పరిస్థితి. చివరకు శర్వానంద్‌తో సినిమా ఆరంభం అయ్యింది. రెండో సినిమాతోనూ సత్తా చాటాడితను. మరి ఇంతకీ ఈ దర్శకుడు చరణ్‌తో చేస్తాడన్న సినిమా ఏమైంది? అనేదొక మిస్టరీ!

తనకు హిట్టిచ్చిన దర్శకుడి తదుపరి సినిమాలన్నీ తమ వాళ్లతోనే ఉన్నాయన్నట్టుగా వ్యవహరించాడు నాగార్జున. కల్యాణ్ కష్ణ కురసాల దర్శకత్వంలో ఎట్టేకలకూ ఇటీవల నాగ చైతన్య సినిమా ఆరంభం కావడం కొంతలో కొంత ఊరట. ఈ రకంగా చూస్తే.. దర్శకులను తమ ఇంటి గాటన కట్టేసుకుని.. ఒకింత తొందరగా తెమల్చడంలో నాగార్జున  మంచోడే!

ఎన్నాల్లో వేచిన ఉదయం.. వచ్చేదెప్పుడు?
ఫ్లాఫులిచ్చి.. అవకాశాలు సంపాదించుకోలేని వారి సంగతి ఒక ఎత్తు. కానీ.. హిట్టిచ్చిన వారు కూడా తమ తదుపరి సినిమాల కోసం సంవత్సరాలకు సంవత్సరాలు వేచి చూడాల్సి వస్తుండటమే విడ్డూరం. సుజిత్.. అని ఒక దర్శకుడు, గుర్తున్నాడా? ‘రన్‌రాజా రన్’తో హిట్టు కొట్టిన ఈ దర్శకుడు మళ్లీ కనిపించడం లేదు! ఏమైంది? అంటే.. ప్రభాస్‌తో సినిమా అంటారు! ‘రన్‌రాజా రన్’ వచ్చి ఇప్పటికి దాదాపు రెండున్నర సంవత్సరాలు గడిచిపోయాయి. ఎంత ప్రభాస్‌తో సినిమా కోసం అయితే మాత్రం.. మరీ రెండున్నర సంవత్సరాల పాటు వేచి చూడటమా!

ఈ మధ్యలో సదరు దర్శకుడు కనీసం రెండు మూడు సినిమాలను పూర్తి చేసే అవకాశం ఉండేది. మరి ఇచ్చాపూర్వకంగా సదరు దర్శకుడు వేచి ఉంటే అది అతడి ఇష్టం! ఇలానే వేచి ఉన్న మరో దర్శకుడు త్రివిక్రమ్. పవన్‌కల్యాణ్ అభిష్టపూర్వకంగా మాత్రమే ఈ దర్శకుడు సినిమాలు చేస్తున్నాడనే పేరును తెచ్చుకున్నాడు. చేస్తే పవన్‌తో చేయాలి.. లేకపోతే ఆయన చెప్పినట్టుగా చరణ్‌తోనో, నితిన్‌తోనే చేయాలి! ఓవరాల్‌గా మెగాక్యాంప్‌కు పరిమితం కావాలి.. ఈ పరిమితులకు త్రివిక్రమ్ కూడా లోబడ్డాడు అనే మాట వినిపిస్తోంది. ఇలాంటి స్నేహ పూర్వక ఒప్పందాలు.. అలా సాగుతున్నాయి. 

అయితే.. ఇలాంటి పరిస్థితుల నడుమ దర్శకులవి కేవలం ఉనికిపాట్లే అవుతున్నాయి! విజయాలు సాధించిన వారు కూడా.. ఏదో విధంగా లాక్ అయిపోతున్నారు. తొలి సినిమాలతో వైవిధ్య భరితమైన అనుభూతులను అందించిన వారు కూడా.. రెండో సినిమాకే బంధీలయిపోతున్నారు! క్రియేటర్లు ఎప్పుడూ స్వేచ్ఛగా ఉంటేనే.. సజన ఆవిష్కతం అవుతుంది. అలాగాక.. హీరోలు చెప్పినప్పుడు, హీరోలు చెప్పినట్టుగా, హీరోలు ఖాళీగా ఉన్నప్పుడు.. అంటే మాత్రం వారి నుంచి వచ్చే సినిమాలు కూడా ఆ పరిమితులకు లోబడే ఉంటాయి!

అవతలేమో.. తమిళ దర్శకులు తెలుగుపై దండెత్తుతున్నారు. చాలామంది తమిళ హీరోల, తమిళ దర్శకులకు తెలుగునాట తమిళంతో తీసిపోని మార్కెట్ ఏర్పడింది. వేగంగా సినిమాలు చేసుకొంటూ.. వైవిధ్యంగా ముందుకు వెళుతూ.. వాళ్లు తెలుగు వాళ్లను ఆకట్టుకుంటున్నారు!

తెలుగునాట మాత్రం.. హీరోలు తమ కుటుంబాలు, తమ ఆధిపత్యం.. అన్నట్టుగానే కొనసాగుతున్నారు. సినీ నిర్మాణం విషయంలో నిర్మాతలను ఇప్పటికే డమ్మీలుగా చేశారు. తమ పేరుతో మార్కెట్ అవుతోందని చెప్పి..  ప్రీ రిలీజ్ బిజినెస్‌లో మెజారిటీ వాటాను తామే సొంతం చేసుకుంటూ, తమ ఇంట్లో వాళ్లను, తమ డమ్మీలను నిర్మాతలుగా పెట్టేసుకుని.. లాగించేస్తున్నారు. ఇక తమ పరపతిని ఉపయోగించుకొంటూ.. ఆఖరికి దర్శకులను కూడా తమ ఇంట్లో పాలేర్లుగా మార్చుకుంటున్నారు టాలీవుడ్ ఘనులు! మరి ఇలాంటి ఇండస్ట్రీ నుంచి వైవిధ్యభరితమైన సినిమాలనో, గొప్ప సినిమాలనో ఆశించడం.. వేపచెట్టు నుంచి తేనె చుక్కను ఆశించడమేనేమో!

-వెంకట్ ఆరికట్ల 

Show comments