పవన్ కసరత్తు....!

పవర్ స్టార్ కమ్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కసరత్తు ప్రారంభించారట...! ఏం కసరత్తు? కొత్త సినిమాల గురించి కసరత్తు చేస్తున్నారా? అది మామూలేగా అనుకుంటున్నారా? కాదు...వచ్చే ఎన్నికలకు సంబంధించి ఆయన ఎక్సర్‌సైజ్ ప్రారంభించారని సమాచారం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనాతీరు, ప్రభుత్వ పథకాల అమలు తీరు వగైరాలపై సమాచారం తెప్పించుకొని అధ్యయనం చేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటినుంచే ఎందుకిలా కసరత్తు చేస్తున్నారు? ఎందుకంటే...వచ్చే ఎన్నికల్లో పవన్ ఒంటరిగా పోటీ  చేయాలనుకుంటున్నారు. అంటే ఎవ్వరితో పొత్తులు లేకుండా జనసేన పార్టీని ఒంటరిగా బరిలోకి దింపుతారన్నమాట...! ఓ ఆంగ్ల పత్రిక కథనం ప్రకారం పవన్ కళ్యాణ్ 201 నుంచి జనంలోకి వచ్చేస్తారు. అప్పటివరకు ఆయన ఎలాంటి ప్రచార పటాటోపం లేకుండా పూర్తిగా అధ్యయనంలో మునిగివుంటారు.

ప్రభుత్వానికి, పాలనకు సంబంధించిన సమాచారం తెప్పించుకొని అధ్యయనం చేసేందుకు ఆయనకు సన్నిహితులైన కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు సహకరిస్తున్నారు. ప్రభుత్వంలో జరుగుతున్న ప్రతీ విషయాన్ని ఇద్దరు మంత్రులు, ముగ్గురు ఎమ్మెల్యేలు పవన్‌కు వివరిస్తున్నారు. కొందరు సివిల్, పోలీసు ఉన్నతాధికారులు పవన్ ఔట్‌డోర్ షూటింగుల్లో ఉన్నప్పుడు అక్కడికి వెళ్లి సమావేశాలు జరుపుతున్నారు. తనకు వ్యతిరేకంగా రెండు తెలుగు ఛానెళ్లు పనిచేస్తున్నాయని, వాటిపట్ల అప్రమత్తంగా ఉండాలని పవన్ తన శ్రేయోభిలాషులకు, సహకరిస్తున్నవారికి చెప్పారట...! 

పవన్‌ను కలుసుకుంటున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు రాజకీయ పరిణామాలను, రాజధాని అమరావతి నిర్మాణ విశేషాలను, స్విస్‌ఛాలెంజ్ విధానాన్ని, భూసేకరణ/సమీకరణ సంగతులను ఎప్పటికప్పుడు వివరిస్తున్నారు. ఈ సబ్జెక్టులకు సంబంధించి కాన్ఫిడెన్షియల్ రిపోర్టులు అందచేస్తున్నారని తెలుస్తోంది. ఇక పవర్ స్టార్ ప్రత్యేక హోదా, భూసేకరణ, స్విస్‌ఛాలెంజ్, రాజధాని నిర్మాణం మొదలైన విషయాల్లో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహంగా ఉన్నారు.

బాబు మంత్రివర్గంలోని ‘నీలి కళ్ల’ మినిస్టర్ ఒకాయన పవన్‌తో నిరంతరం ‘టచ్’లో ఉంటున్నారు. ఈయన గత మూడు నెలలుగా రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ)కు సంబంధించిన ప్రతి చర్యనూ, నిర్ణయాలను హీరోకు వివరిస్తున్నారు. చంద్రబాబు ‘కటాక్ష వీక్షణాలు’ అంతగా లేని ఉత్తర కోస్తాంధ్రకు చెందిన ఓ మంత్రి పవన్‌కు సన్నిహితంగా ఉన్నారు. ఇక పవర్ స్టార్ నిరంతరం ప్రసిద్ధ కవి గుంటూరు శేషేంద్ర శర్మ కవిత్వాన్ని అధ్యయనం చేస్తున్నారని ఓ నాయకుడు చెప్పాడు. శ్రీశ్రీ కవిత్వం మాదిరిగానే శేషేంద్ర శర్మ కవిత్వం కూడా ‘ఘాటు’గా ఉంటుంది. ఈయన కవిత్వం కూడా ఒంట్లో విద్యుత్తేజం పుట్టిస్తుంది. ఎన్నికల ప్రచారంలో తాను ఉత్తేజం పొందడానికి, ప్రజలను ఉత్తేజ పరచడానికి శేషేంద్ర కవిత్వాన్ని అధ్యయనం చేస్తున్నాడేమో. మొత్తం మీద పవన్ కళ్యాణ్ పైకి మౌనంగా ఉన్నా తెర వెనక ‘చేయాల్సిన పని’ చేస్తున్నాడని అర్థమవుతోంది.

ఈమధ్య అంటే కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ప్రయివేటు బిల్లు ప్రవేశపెట్టినప్పటినుంచి ప్రత్యేక హోదాపై రాష్ర్ట వేడి పుట్టింది. పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఒకదాన్ని మించి మరొకటి ఉద్యమిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా పవన్ పెదవి విప్పి ఒక్కమాటా మాట్లాడలేదు. ఆయన పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి రాకపోయినా ఇతర పార్టీల వారు నాయకుడిగానే చూస్తున్నారు. కాబట్టి కొందరు నాయకులు ‘పవన్ ఎందుకు మాట్లాడటంలేదు?’ అని ప్రశ్నించారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకుండానే రాజకీయ నాయకుడిగా ప్రభావం చూపుతున్న వ్యక్తి పవన్ తప్ప మరొకరు లేరేమోననిపిస్తోంది.  గత ఎన్నికల్లో టీడీపీబీజేపీ కూటమికి మద్దతు ఇచ్చిన పవన్‌ను వచ్చే ఎన్నికల్లో తమ వైపు లాక్కోవాలని కొన్ని పార్టీలు 
అనుకుంటున్నాయి. టీడీపీతో తెగదెంపులైతే పవన్‌తో జత కట్టాలని బీజేపీ నాయకులు ఇప్పటినుంచే ప్లాన్ చేస్తున్నారని కొందరు నాయకులు చెబుతున్నారు. 

ఆంధ్రప్రదేశ్  కమలం, సైకిల్ నాయకులు పవన్ మావాడంటే మావాడంటున్నారు. బీజేపీ నాయకులైతే జనసేనను తమ పార్టీలో విలీనం చేస్తే మంచిదని అన్నారు. పవన్ తమవాడేనని, తమతో చేతులు కలిపితే ఉభయులకూ ప్రయోజనకరంగా ఉంటుందని టీడీపీ నేతలు అంటున్నారు. పవన్ ఎటువైపుంటే అటు వైపు కాపుల ఓట్లు పడతాయని అంచనాయే ఈ బంధుత్వ పోటీకి కారణం.  గత ఎన్నికల్లో పవన్ మద్దతు కారణంగానే కూటమికి కాపుల ఓట్లు పడ్డాయని రెండు పార్టీల నాయకులూ అంగీకరిస్తున్నారు.  ‘టీడీపీని వదిలేసి పవన్‌తో కలవడం ప్రయోజనకరం’ అని కూడా బీజేపీ నాయకుడొకరు ఈమధ్య వ్యాఖ్యానించారు.   రెండూ పార్టీలూ పవన్‌ను బంధువని అనుకుంటున్నా ఆయన ఆలోచనలు వేరుగా ఉన్నాయి. ‘కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి’ అనుకుంటున్నట్లుగా ఉంది. అందుకే ఒంటరి పోటీ గురించి ఆలోచిస్తున్నారు.      

నాగ్ మేడేపల్లి

Show comments