కాబోయే హోంమంత్రిగారట.!

రాజకీయాల్లో అద్భుతాలకు కొదవేం వుంటుంది. కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని ఎవరైనా ఊహించారా.? అయ్యారు కదా.! అందుకే మరి, రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు. అదృష్టం వుండాలంతే. 

ఇక, అసలు విషయానికొస్తే.. ఆయన ఆంధ్రప్రదేశ్‌లోని అధికార పార్టీకి చెందిన నాయకుడు. కాస్త నోరెక్కువ. పైగా ఆజానుబాహుడు. తన రూపం, తన వాయిస్‌తో ప్రత్యర్థుల్ని బెదరగొట్టేయాలనుకుంటారు. పార్టీలో పెద్ద నోరు ఎవరికన్నా వుందంటే అది ఆయనగారికే. ఇప్పుడాయనగారు హోంమంత్రి కాబోతున్నారట. ఉత్తరాంధ్రకు చెందిన ఆయనగారి గురించి ఇప్పుడు ఆ మూడు జిల్లాల్లో విపరీతమైన చర్చ జరుగుతోంది.. కాబోయే హోంమంత్రి అంటూ.! 

ఆలూ లేదు, చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్నాడట వెనకటికి ఎవడో. అచ్చం ఇది కూడా అలానే వుంది కదూ.! ఏమో, చంద్రబాబు తలచుకుంటే ఆయనగారికి హోంమంత్రి పదవి వచ్చేయడం పెద్ద లెక్క కాదు. ప్రస్తుతానికైతే, తనకు అధినేత నుంచి ఎలాంటి ఆఫర్‌ లేకపోయినా, పొలిటికల్‌ సర్కిల్స్‌లో తానే కాబోయే ముఖ్యమంత్రినన్న ప్రచారం ఆ నోటా ఈనోటా ఆయనగారి చెవిన పడేసరికి ఎగిరి గంతేసేస్తున్నారు. అంతేనా, అప్పుడే హోంమంత్రి అయిపోయినట్లు ఊహించేసుకుంటున్నారట. 

'ఏంటి బాబుగారూ.. నిజమేనా.?' అంటూ ఈ మధ్యనే ఆయనగారు ముఖ్యమంత్రి చంద్రబాబుతో 'కన్ఫర్మేషన్‌' చేసేసుకుందామని అడిగేశారట. చంద్రబాబు సింపుల్‌గా నవ్వి ఊరుకున్నారట. ఇంకోపక్క, ఉత్తరాంధ్రలో కుల రాజకీయాలు భగ్గుమంటున్నాయి. మొదటినుంచీ ఆయనగారి సామాజిక వర్గానికీ, ఉత్తరాంధ్రలో మరో బలమైన సామాజిక వర్గానికీ మధ్య రాజకీయంగా ఆధిపత్య పోరు నడుస్తోంది కూడా. ఈ పరిస్థితుల్లో ఆయనగారికి హోంమంత్రి పదవి ఇంకేమన్నా వుందా.? అంటూ, అధికార పార్టీకే చెందిన ఇంకొకాయన తెగ గుస్సా అయిపోతున్నారట. అంతే, 'కుల సమావేశాలు' షురూ చేసేశారట.  Readmore!

అన్నట్టు, ఉత్తరాంధ్రలో బలమైన సామాజిక వర్గంగా చెప్పుకునే ఆ సామాజిక వర్గంలో చీలిక తెచ్చేందుకు ఇప్పుడు 'కాబోయే హోంమంత్రి' శతవిధాలా ప్రయత్నిస్తున్నారన్నది ఇంకో గాసిప్‌. ఒకే పార్టీలో వున్నా 'ఈ కాబోయే హోంంత్రిగారి 'కుటుంబంతో మొదటి నుంచీ వైరం కొనసాగిస్తున్న ఓ కుటుంబానికి చెందిన టీడీపీ నాయకుడు 'పోన్లే ఉత్తరాంధ్రకి హోంమంత్రి పదవి వస్తే మంచిదే కదా..' అనుకోకుండా, అడ్డుపుల్ల వేస్తున్నారట. 

ముందే చెప్పుకున్నాం కదా, 'ఆలూ లేదు.. చూలూ లేదు..' అని, రాజకీయాల్లో ఇంతే మరి. ఒకే పార్టీలో వున్నా, రాజకీయ ప్రత్యర్థులుగా వుంటారు. ఒకరికి పదవి వస్తోందంటే, ఇంకొకరు గుస్సా అవుతారు. పదవి వచ్చే అవకాశముంటే చాలు, పదవి వచ్చేసిందని తలెగరేసేస్తుంటారు. ఏంటో, ఈ రాజకీయం.?

Show comments

Related Stories :