మొత్తానికి తమిళ రాజకీయ హైడ్రామా ఒక్కో అంకం ముందుకు వెళుతున్న కొద్దీ పన్నీరు సెల్వం అనే వ్యక్తి ఎంత వీకో అనే విషయంపై స్పష్టత అవుతోంది. కేంద్రం అండ ఉన్నా, గవర్నర్ అవకాశం ఇస్తూ వస్తున్నా.. ప్రజల సానుభూతి వెల్లువెత్తినా పన్నీరు ఏం చేయలేకపోయాడు, చేయలేకపోతున్నాడు. ఈయన చేతగాని తనాన్ని కొంతమంది మంచితనం అని అనొచ్చు.. ఎమ్మెల్యేలను కొనలేకపోతున్నాడు అని సానుభూతి వ్యక్తం చేయవచ్చు గాక!
జయలలితే దోషిగా తేలాకా.. ఆమె పేరు చెప్పుకుని బతుకుతున్న పన్నీరు ఎలా నీతిమంతుడు అవుతాడు? అంతా ఆ తానులోని ముక్కలే కదా!
ఆ సంగతలా ఉంటే.. తమిళనాడు అసెంబ్లీలో విశ్వాస పరీక్షకు రేపే ముహూర్తాన్ని ఎంచుకున్నాడు పళనిసెల్వం. పదిహేను రోజులు గడువు ఉన్నా.. కేవలం మూడో రోజే ఆయన విశ్వాస పరీక్షను ఎదుర్కొనడానికి సిద్ధం కావడం పన్నీరుకు ఒక విధంగా ఎదురుదెబ్బే!
వీలైనంత తొందరగా ఈ వ్యవహారాన్ని తేల్చేయాలని పళనిస్వామి ప్రణాళిక రచించాడు. రోజులు గడిచే కొద్దీ ఎమ్మెల్యేల బేరసారాలకు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. అలా కాకుండా.. విశ్వాస పరీక్ష తొందరగా అయిపోతే.. బేరసారాలకు అవకాశం ఉండదు. విశ్వాస పరీక్ష విషయంలో నెగ్గగలమనే పూర్తి విశ్వాసంతో కనిపిస్తున్నాడు పళని. ఒకవేళ ఎమ్మెల్యేలే గనుక చేజారేటట్టు అయితే.. శశికళపై తీర్పు రాగానే జారిపోయేవారు! ఇప్పటి వరకూ జారలేదు కాబట్టి.. రేపటిలోగా పన్నీరు వైపు నుంచి అద్భుతాలు జరిగే అవకాశం లేదు.
అంతేకాదు.. ఇప్పటి వరకూ పన్నీరు వైపు వెళ్లిన పదిమంది విషయంలో కూడా పళని పాచికలు వేస్తున్నాడు. ఒక్క పన్నీరును తప్ప మిగిలిన ఎమ్మెల్యేల్లో ఎవరైనా తిరిగొస్తే తీసుకుంటామని ప్రకటించేశాడు! దీంతో.. పన్నీరు వైపు ఉన్న పదిమందిలో కూడా ఎంతమంది మిగులుతారు? అనేది శేషప్రశ్న! వీరిని కాపాడుకోవడం కూడా పన్నీరుకు ఇప్పుడు పెద్ద పనే.
ఇక పన్నీరు ఆశలన్నీ ఎన్నికల కమిషన్ మీదే ఉన్నాయట. శశికళ ను ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగించాలని ఈసీని కోరిన వ్యవహారంపై ఈ రోజు నిర్ణయం వెలువడుతుందట. ఇక ఈ రోజు ప్రజల్లోకి వెళ్లి ఎమ్మెల్యేలను భయపెట్టేపని చేస్తాడట..ఈ రెండు వ్యవహారాలతోనూ పెద్దగా ప్రయోజనం ఉండదనే అనుకోవాలి. ఒకవేళ శశికళ సీఎం పదవిని అధిష్టించి ఉంటే.. ప్రజల నుంచి పన్నీరుపై సానుభూతి వచ్చేదేమో కానీ, పళనిస్వామి కాబట్టి ఆ అస్త్రం ఉపయోగపడదు. పన్నీరెంతో.. పళనీ కూడా అంతే కదా! సో.. పన్నీరు కథ కంచికేనేమో ఇక!