సల్మాన్ 'ట్యూబ్‌లైట్‌' వెలుగులెంత.?

సల్మాన్‌ఖాన్‌ తాజా చిత్రం 'ట్యూబ్‌లైట్‌' ఈ రంజాన్‌ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం విదితమే. 'ట్యూబ్‌లైట్‌' సినిమాపై అంచనాలకు ఆకాశమే హద్దు అన్నట్లుంది పరిస్థితి. తమ అభిమాన హీరో సినిమా కోసం సల్మాన్‌ఖాన్‌ అభిమానులు ఎదురుచూస్తోన్న వైనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. 

తొలి రోజు, తొలి వారం వసూళ్ళ పరంగా బాలీవుడ్‌ గత రికార్డుల్ని 'ట్యూబ్‌లైట్‌' కొల్లగొట్టేస్తుందని సల్మాన్‌ఖాన్‌ అభిమానులు ఆశిస్తున్నారు. సల్మాన్‌ఖాన్‌ జోరు కూడా ఈ మధ్య అదే స్థాయిలో వుంది మరి.

వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతున్న సల్మాన్‌ఖాన్‌, 'ట్యూబ్‌లైట్‌'తో మరో హిట్‌ తన ఖాతాలో వేసుకుంటాడని అంతా అనుకుంటున్న సమయంలో, 'ట్యూబ్‌లైట్‌' సినిమా నిడివిని చిత్ర దర్శక నిర్మాతలు తగ్గించేయడం అందర్నీ విస్మయానికి గురిచేసింది. 

'ట్యూబ్‌లైట్‌' సినిమా నిడివి ఎంతో కాదు, జస్ట్‌ 2 గంటల 16 నిమిషాలు మాత్రమే. ఎందుకిలా.? అన్న ప్రశ్నకు ప్రస్తుతానికైతే సమాధానం లేదు. ముందుగా ఈ సినిమాని 2 గంటల 35 నిమిషాల నిడివితో విడుదల చేయాలనుకున్నారు.

సల్మాన్‌ఖాన్‌ స్వయంగా 'కత్తెరపట్టి' నిడివి తగ్గించాడన్నది తాజా ఖబర్‌. అలా సల్మాన్‌ఖాన్‌ కత్తెర పట్టుకోవడం వెనుక, సినిమాపై నమ్మకం లేకపోవడమేనన్న వాదన బలంగా విన్పిస్తోంది బాలీవుడ్‌లో. 

ఇక, రికార్డుల పరంగా చూస్తే బాలీవుడ్‌ సినిమా 'దంగల్‌' ఇప్పటిదాకా అత్యధిక వసూళ్ల రికార్డుని కలిగి వుంది. అదీ బాలీవుడ్‌ చిత్రం కేటగిరీలో.

కానీ, ఇండియన్‌ సినిమా లెక్కల్లో 'బాహుబలి' భారీ మార్జిన్‌తో 'దంగల్‌'ని దాటేసిన విషయం విదితమే. ఇంతకీ, 'ట్యూబ్‌లైట్‌', 'దంగల్‌'ని దాటుతుందా.? హిందీ వెర్షన్‌ 'బాహుబలి'ని 'ట్యూబ్‌లైట్‌' టచ్‌ చేయగలుగుతుందా.? వేచి చూడాల్సిందే.

Show comments