తెలుగుదేశం పార్టీలో నేతలు జగన్ మేనియాలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడాల్సి వస్తే జగన్.. పోలవరం గురించి మాట్లాడాల్సి వస్తే జగన్.. అమరావతి గురించి మాట్లాడాల్సి వస్తే జగన్.. అవినీతి గురించి మాట్లాడాల్సొస్తే జగన్.. ఓటుకు నోటు కేసు గురించి మాట్లాడాలన్నా జగన్.. ఇంకే విషయం గురించి మాట్లాడన్నా జగన్. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పేరు తలవకుండా అధికార తెలుగుదేశం పార్టీ నేతలకు తెల్లారడంలేదు.
రాజకీయాల్లో విమర్శలు సర్వసాధారణం. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం సహజాతి సహజం. కానీ, ఆ మాటల యుద్ధానికి హద్దులంటూ వుండాలి కదా.! ప్రతిపక్షానికి ఇంకో పని వుండదు, అధికార పక్షాన్ని విమర్శించడం తప్ప. ప్రతిపక్షం పనే అది. ప్రభుత్వాన్ని విమర్శిస్తేనే కదా, ప్రజలకు మెరుగైన పాలన అందేది. ప్రభుత్వంలోని లోటుపాట్లను ఎత్తి చూపడమే ప్రతిపక్షం విధి. కానీ, అదే తప్పంటోంది అధికారపక్షం.
రెండేళ్ళయినా అమరావతి నిర్మాణం ఎందుకు ప్రారంభం కాలేదంటే, రైతుల్ని రెచ్చగొట్టి అమరావతి నిర్మాణానికి వైఎస్ జగన్ అడ్డు తగులుతుండడం వల్లే.. అన్నది చంద్రబాబు అండ్ కో వాదన. ప్రత్యేక హోదా ఎందుకు రావడంలేదయ్యా.? అంటే, దానికీ వైఎస్ జగనే అడ్డుపడ్తున్నారట. పోలవరం మాటేమిటి.? అంటే, ఇక్కడా సేమ్ ఆన్సర్. జగనే దానికీ అడ్డంకి. వాట్ ఏ నాన్సెన్స్.. అని జనం ముక్కున వేలేసుకుంటున్నాసరే, టీడీపీ నేతలు జగన్ మేనియాలోంచి బయటకు రాలేకపోతున్నారు.
మంత్రి యనమల రామకృష్ణుడు తాజాగా, 'జగన్ చాలీసా' మొదలు పెట్టేశారు. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా రావడం జగన్‌కి ఇష్టం లేదని ఆ చాలీసాలో పేర్కొన్నారు. ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని చెబుతున్నది కేంద్రం. బీజేపీ నేతలు ఆ విషయాన్ని నిర్మొహమాటంగా చెబుతున్నారు. ఇవ్వాల్సింది కేంద్రంలోని బీజేపీనే. తీసుకురావాల్సింది టీడీపీ. కానీ, ప్రత్యేక హోదా జగన్ చేతుల్లో వుందనుకుంటున్నారేమో, యనమల 'జగన్ చాలీసా' మొదలు పెట్టేశారు.
కేంద్ర మంత్రి సుజనా చౌదరి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్నారట కామెడీగా. ఈ మధ్యకాలంలో సుజనా చౌదరి ప్రత్యేక హోదా గురించి మీడియా ముందు కూడా మాట్లాడ్డంలేదు. ఆయన మీడియా ముందుకొస్తే చాలు ప్యాకేజీ గురించే మాట్లాడుతున్నారు. కానీ, యనమల వారికి 'ప్యాకేజీ అంటే హోదా' అని అర్థమవుతున్నట్లుంది. ఆయనేం ఆర్థిక మంత్రో మరి.!
చివరికి ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా బుక్కయిపోతే, దానిక్కూడా కారణం వైఎస్ జగనేనట. ఇది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకోవడమేనట. యనమల వారి ఉవాచ ఇది. నిస్సిగ్గుగా తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టి, ఓటుకు నోటు కేసులో చంద్రబాబు బుక్కయిపోతే.. దానికి వైఎస్ జగన్ ఎలా కారకుడవుతారు.? 'చంద్రబాబు బ్రీఫింగ్ చేశారా? లేదా?' అన్న ప్రశ్నకి ఇప్పటిదాకా టీడీపీ నేతలే సమాధానం చెప్పలేకపోతున్నారు.
ఏదిఏమైనా, జగన్ మేనియా టీడీపీకి ఇప్పట్లో వదిలేలా లేదు. 20 మంది ఎమ్మెల్యేల్ని వైఎస్సార్సీపీ నుంచి లాగేసినాసరే, జగన్ పేరు చెబితే టీడీపీ ఉలిక్కిపడ్తోందంటే, చంద్రబాబు ఏ స్థాయిలో అభద్రతాభావానికి గురవుతున్నారో అర్థం చేసుకోవచ్చు.