నోట్ల రద్దు.. ఆయనకు ముందే తెలుసా?!

మారకంలో ఉన్న 500, 1000 రూపాయల నోట్ల రద్దు సంచలనంగా నిలుస్తున్నా… ఇందులో లొసుగులు లేకపోలేదనే మాటా వినిపిస్తోంది.  ఆర్థిక ఎమర్జెన్సీ, అవినీతిపై సర్జికల్ స్ట్రైక్స్, సంచలనం.. అంటూ మీడియా అభివర్ణిస్తున్నా, ఈ అంశంపై అధికార పార్టీ అనుకూల వర్గాలకు ముందస్తు సమాచారం ఉందనే మాట వినిపిస్తోంది.

ఉలికి పాటుగా, ఒక్కసారిగా చేతిలో ఉన్న నోట్లు చెల్లవు అని విని సామాన్యుడు నిశ్చేష్టుడు అవుతున్నాడు. గందరగోళానికి గురి అవుతున్నాడు. వంద రూపాయల నోటు మారకం బాగా తగ్గిపోయి.. ఐదువందలు, వెయ్యి రూపాయల నోట్లే పూర్తిగా మారకంగా మారిన నేపథ్యంలో.. సామాన్యులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఎవ్వరూ వారి చేతిలోని ఈ నోట్లు తీసుకోవడం లేదు. 

సంచుల్లో నోట్లను కుక్కుకున్న వాళ్లకు ఏమీ భయం లేదు.. ఇప్పటికప్పుడు కాకపోతే.. ఈ వేడి కొంత తగ్గిన తర్వాత ఆ డబ్బును మార్చుకోగలరు. బ్లాక్ ను ఎలా వైట్ చేసుకోవాలో వాళ్లకు తెలుసు. దాని కోసం వాళ్ల దగ్గర చార్డెట్ అకౌంటెంట్లు ఉండనే ఉన్నారు..వాళ్ల దారులు వాళ్లకు ఉంటాయి. ఆర్థిక అవినీతికి వాళ్ల దగ్గర శతకోటి మార్గాలున్నాయి.

ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన అంశం.. ఈ నోట్లు రద్దు కాబోతున్న అంశం కొంతమందికి ముందే తెలుసు అనేది. ప్రత్యేకించి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి .. ఐదువందల, వెయ్యి నోట్లు రద్దు చేయాలని కేంద్రానికి లేఖ రాసిన నేపథ్యంలో… అనేక అనుమానాలు చెలరేగుతున్నాయి. ఈ నోట్లు రద్దు కాబోతున్నాయని ఆయనకు ముందే తెలుసా? కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి అయిన ఆయనకు పక్కా సమాచారం ఉందా? అనే అనుమానాలతో పాటు, ఉండవచ్చు.. అనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి.

కేంద్ర ప్రభుత్వంలోని ముఖ్యమైన మంత్రులు ఆయనకు సన్నిహితులు. ఈ నోట్ల రద్దు అంశం ఉన్నట్టుండి ప్రకటించినప్పటికీ.. కొంత కాలంగా చర్చ జరిగి ఉంటుందనేది ఎవ్వరూ కాదనలేని అంశం. ఈ చర్చ మోడీ క్యాబినెట్ లోని మంత్రులకే తెలిసి ఉంటుంది. వారు తమకు కావాల్సిన వారికి లీకులు ఇచ్చుకునే అవకాశం ఉంది. ఆ లీకులు అందడంతోనే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నోట్ల రద్దు అంశంపై తన స్పందనను బహిరంగ పరిచాడనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

మరి రాజకీయ నేతలు స్వయంగా ఆర్థిక నేరస్తులు.. మరి కొంతమంది ఆర్థిక నేరస్తులు వారికి సన్నిహితులుగా ఉన్నారు. ఇవన్నీ బహిరంగ రహస్యాలే. ఇలాంటి నేపథ్యంలో దొంగ చేతికి తాళాలు అందినట్టుగా.. ఈ నోట్ల రద్దు అంశం ముందుగా వాళ్లకే తెలిసిఉంటే.. ఇప్పటికే వాళ్లు తీసుకోవాల్సిన చర్యలు అన్నీ తీసుకుని ఉండే అవకాశాలు లేకపోలేదు. 

ఒకవైపు ఈ నోట్ల రద్దు అంశం లేఖ రాసిన ఆయన అనుకూల మీడియా.. ఆయనకే క్రెడిట్ ఇస్తున్నా, ఈ హఠాత్ పరిణామం గురించి ఆయనకు ముందే తెలుసు.. అనే మాటా ఇప్పుడు వినిపిస్తోంది. 
 

Show comments