పవన్ కల్యాణ్ నయా సెంటిమెంట్

తన సినిమాలకు సంబంధించి పెద్దగా సెంటిమెంట్స్ ఏవీ ఫాలో అవ్వడు పవన్ కల్యాణ్. సినిమా కంప్లీట్ చేయడం, రిలీజ్ చేయడం వరకు మాత్రమే దృష్టిపెడతాడు. కానీ ఫస్ట్ టైం ఎందుకో కాస్త సెంటిమెంట్ ఫీల్ అవుతున్నాడు పవన్. అందుకే తన కొత్త సినిమాను ఓ సెంటిమెంట్ డేట్ రోజున విడుదల చేయాలని అనుకుంటున్నాడట.

ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు పవన్. లెక్కప్రకారం ఈ సినిమా ఆగస్ట్ లో విడుదలకావాలి. కానీ ఒక నెల ఆలస్యంగా సెప్టెంబర్ లో విడుదల చేయాలని అనుకుంటున్నారు. దీనికి కారణం అత్తారింటికి దారేది మూవీ. పవన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమా సెప్టెంబర్ లో రిలీజైంది. ఆ సెంటిమెంట్ కొద్దీ తాజా చిత్రాన్ని కూడా సెప్టెంబర్ లోనే విడుదల చేయాలని అనుకుంటున్నారట.

పవన్ ఇలా ఫిక్స్ అవ్వడానికి కొన్ని కారణాలున్నాయి. అత్తారింటికి దారేది చిత్రాన్ని తెరకెక్కించిన త్రివిక్రమ్ శ్రీనివాసే తాజా చిత్రానికి కూడా దర్శకుడు. మరీ ముఖ్యంగా పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ ఇది. పైగా ఇది పవన్ నటిస్తున్న ప్రతిష్టాత్మక 25వ చిత్రం. అందుకే కాస్త సెంటిమెంట్ ఫీల్ అయి సెప్టెంబర్ లో కొత్త సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారట.

Show comments