కేంద్ర మంత్రిగా హరిబాబు!

ఆగస్టులో అమాత్య కిరీటం

గుట్టుగా వ్యవహారం నడిపిన ఎంపీ

ఏ పదవి వచ్చినా ఒరిగేది ఏముందన్న కేడర్‌

రాజకీయ గురువు, ఆప్తుడు వెంకయ్యనాయుడు క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఆయన అనుంగు శిష్యుడు, విశాఖ ఎంపీ హరిబాబుకు కేంద్రమంత్రి పదవి దక్కనున్నట్లుగా పార్టీ వర్గాల సమాచారం. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ముగిసిన వెంటనే జరిగే విస్తరణలో సహాయమంత్రిగా కేంద్ర కేబినెట్‌లో హరిబాబుకు చోటు కల్పించేందుకు రంగం సిద్ధమైంది. వెంకయ్య ఆశీస్సులు పుష్కలంగా ఉన్న హరికి అమాత్య కిరీటం దక్కడం లాంఛనప్రాయమేనని అంటున్నారు. 

నాలుగున్నర దశాబ్దాల క్రితం ఎక్కడో ప్రకాశం జిల్లా నుంచి ఉన్నత విద్య కోసం ఏయూకు వచ్చిన హరిబాబుకు, అదే ఏయూలో న్యాయ విద్యను అభ్యసిస్తున్న వెంకయ్య పరిచయ భాగ్యమే ఆయనను ఇంతటి వాడిని చేసిందన్నది కమలం పార్టీలోనే కాదు, బయట కూడా అందరికీ తెలిసిన సత్యం. ఇందుకు హరిబాబు స్నేహం ఎంతగా దోహదపడిందో, అంతకంటే ఎక్కువగా ఒకటే సామాజికవర్గం అన్న మమకారం పనిచేసిందని గిట్టని వాళ్లు అన్నా కూడా ఈ ఇద్దరిదీ చెరిగిపోని బంధమే అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

ఏయూలోనే చదువుకుని అక్కడే మాస్టారుగా పాఠాలు చెప్పుకుంటూ కాలం వెళ్లదీస్తున్న హరిబాబును అటు అసెంబ్లీ, ఇటు పార్లమెంట్‌ మెట్లు ఎక్కించిన వెంకయ్య ఎంతో చేయాల్సి ఉందనుకూంటుండగా, ఇంతలోనే ఇలా ఉపరాష్ట్ర పదవిలోకి వెళ్లిపోవడం ఎవరికి ఎలాఉన్నా హరిబాబు కు మాత్రం బాగానే లోటు అన్నది కూడా నిజమంత నిజం. 

వెంకయ్య కేంద్రమంత్రిగా ఉన్న రోజులలోనే హరిబాబు అధ్యక్ష పీఠానికి బీటలు వారడం మొదలైంది. ఆయన పార్టీ బలోపేతానికి ఎటువంటి కృషీ చేయడం లేదని, తెలుగుదేశానికి నమ్మకమైన నేస్తంగా కాలం వెళ్లబుచ్చుతున్నారన్న అసంతృప్తి రాగాలు బీజేపీ అధి నాయకత్వానికి వినిపించినా హరి స్థానంలో వేరొకరిని కూర్చోబెట్టకుండా మంత్రాంగం నడిపిన వెంకయ్యే ఆయనను ఒకవేళ కనుక ఆ పదవి నుంచి దింపాలను కుంటే ప్రత్యామ్నాయంగా మరింత ఉన్నత పదవి ఇవ్వాలన్న షరతును విధించారన్న ప్రచారమూ నాడు జరిగింది.

ఇపుడు ఆ సమయం, సందర్బమూ వచ్చేసింది, ఎటూ వెంకయ్య క్రియాశీల రాజకీయాలలో లేరు, ఆయన స్థానంలో అదే సామాజికవర్గానికి చెందిన హరిబాబును కేంద్ర మంత్రిగా నియమిస్తే ముఖ్యంగా సంతోషపడేది ఆ సామాజికవర్గమే. ఎంత కాదనుకున్నా ఏపీ బీజేపీకి బలమూ, బలహీనతా రెండూ ఆ సామాజికవర్గ మేనన్నది నిష్టుర సత్యం. ఆ విధంగా చూసుకుంటే వెం కయ్యను ఏపీకి కాకుండా చేశారని ఇప్పటికే అపప్రధను మోస్తున్న అధినాయకత్వానికీ హరిని చేరదీయడం ద్వారా దానిని బాపుకునే అవకాశం మెండుగా ఉంది.

అదే సమయంలో ఏళ్ల తరబడి అధ్యక్ష పీఠంపై కూర్చున్న హరిని కూడా సునాయాసంగా కదిలించినట్లవుతుంది. రెండిందాలుగా లాభంగా ఉన్న ఈ వ్యూహానికి సాధ్యమైనంత తొందరలోనే పదును పెట్టి హరిని కేంద్ర మంత్రిని చేస్తారన్న టాక్‌ ఇపుడు విశాఖ మహానగరంలోనూ, ప్రత్యేకించి బీజేపీ వర్గాలలోనూ గట్టిగా వినిపి స్తోంది. ఇక, విశాఖ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున తొలిసారి గెలవడమే కాదు, వైసీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మను ఓడించడం ద్వారా ఘనమైన రికార్డు సాధించిన హరిబాబుకు నాటి నుంచే కేంద్రంలో మంత్రి పదవి చేపట్టాలన్న కోరిక ప్రగాఢంగా ఉందంటారు.

అయితే, ఆయన మంత్రి పదవికి రాజకీయ గురువు వెంకయ్యే అడ్డు కావడం రాజకీయ విచిత్రం. సాంకేతికంగా వేరే రాష్ట్రం రాజ్యసభకు ప్రాతి నిధ్యం వహిస్తున్నా వెంకయ్య మూలాలు, సామాజిక నేపధ్యం, ఏపీలో ఆయన చేసే హడావుడి వంటివి తెలుగు కోటాలో మంత్రిగానే అధినాయకత్వం భావించేలా చేశాయి. దాంతో, ప్రత్యక్ష ఎన్నికలలో గెలిచినా, ఏపీ బీజేపీ అధ్యక్షుని హోదాలో ఉన్నా కూడా హరిబాబుకు కేంద్ర మంత్రి పదవి అందని పండు అయింది.

ఎట్టకేలకు ఇపుడు మంత్రి పదవి దక్కే సూచనలు మెండుగా కనిపిస్తున్నాయి. అయితే, మరే రకమైన సామాజిక సమీకరణలు అడ్డుపడతాయో, ఇంకే రకమైన రాజకీయ అవసరాలు కధ అడ్డం తిరిగేలా చేస్తాయోనన్న ఆలోచనలతో హరిబాబు ఈసారి గుంభనంగా మంత్రి పదవి కోసం ప్రయత్నాలు మొదలుపెట్టినట్లుగా సమాచారం. ఎటూ వెంకయ్య ఆశీస్సులు పుష్కలంగా ఉన్నా తన వంతుగా కూడా హరిబాబు కార్యాచరణతో ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తోంది.

ఇదిలా ఉండగా, ఏపీ అధ్యక్షునిగా, ఎంపీగా విశాఖకు, బీజేపీకి ఆయన చేసిందేమీ లేదని, ఇపుడు కేంద్రమంత్రి అయినా ఒరిగేది ఏముంటుందని కమలం పార్టీలోనే కేడర్‌ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. మితభాషిగా ఉంటూ తన పని తాను చేసుకుని పోయే హరిబాబు ఏనాడూ పెదవి విప్పరు, ఏ సంగతీ పార్టీలోని ముఖ్యులకు కూడా చెప్పరు, విమర్శలు, ప్రతివిమర్శలు అంతకంటే చేయరు, కేడర్‌తోనూ, లీడర్లతోనూ సంబంధం లేకుండా బీజేపీలో పై స్ధ్థాయిలో తనకున్న బలమైన ఛానల్‌ను నమ్ముకుని ఆయన రాజకీయాలలో ముందుకు సాగిపోతున్నారు.

ఈ నేపధ్యంలో ఆయన కేంద్ర మంత్రి అయినా ఏపీలోని ఆయన సొంత సామాజికవర్గానికే ఖుషీ తప్ప, విశాఖకు కాదన్నది సిసలైన కార్యకర్తల భావన. విశాఖ రైల్వే జోన్‌, మెట్రో రైలు, జాతీయ విద్యా సంస్ధల ఏర్పాటు, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్రతిపత్తి వంటి అంశాలలో ఏనాడూ పెద్దగా వత్తిడి చేయని విశాఖ ఎంపీ తన నియోజకవర్గంలో భారీ ఎత్తున సాగిన భూ దందాపైనా ఇంతవరకూ నిగ్గదీయలేదన్న అభిప్రాయం సర్వత్రా ఉంది. ఈ నేపధ్యంలో హరిబాబుకు ప్రమోషన్‌ దక్కినా పార్టీకి రాజకీయంగా మైలేజ్‌ రాదన్నది కమలదళం నిశ్చితాభిప్రాయం.

ఏదో ఆశిస్తే..!

తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేతలు ఏదో ఆశిస్తే మరేదో జరిగిందని వాపోతున్నారు. పార్టీలో మూడున్నర దశాబ్దాల అనుబంధమే కాదు, పలు మార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి మంత్రి పదవి కోసం ఎంతగానో ప్రయత్నించి విఫలమయ్యారు. ఈ నేపధ్యంలో ఆయన తన స్థాయికి తగినట్లుగా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌ పదవినో, లేక వుడా చైర్మన్‌ గిరీనో కోరుకున్నారు. అదేదీ కాకుండా ఆయనను కాకినాడ పార్లమెంట్‌ నియోజకవర్గానికి సంబంధించి ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న మంత్రి కళా వెంకటరావుకు సహాయకునిగా అధినేత చంద్రబాబు నియమించడంతో కక్కలేక మింగలేక అన్నట్లుగా లోలోపలే అసంతృప్తి చెందుతున్నారు.

తాను కూడా కళాకు ఏ మాత్రం తీసిపోనని, తన సేవలను పార్టీ ఉపయోగించుకోవాలనుకుంటే నేరుగానే ఇన్‌చార్జి పదవి ఇవ్వవచ్చునని ఆయన వాపోతున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎవరైనా ప్రభుత్వ పదవిని కోరుకుంటారు కానీ, తనను సహాయ ఇన్‌చార్జిగా నియమించడమేమిటని కూడా గరం గరం అవుతున్నట్లుగా సమాచారం.

ఇక, మరో సీనియర్‌ ఎమ్మెల్యే పెతకంశెట్టి గణబాబు కూడా మంత్రి పదవిని కోరుకున్నారు, ఆయనకు విస్తరణలో అవకాశం కల్పించకపోవడంతో నిరాశకు గురికాగా, ఆయనను కూడా శ్రీకాకుళం పార్లమెంట్‌ నియోజకవర్గానికి సహాయక ఇన్‌చార్జిగా నియమించారు. అక్కడ ఇన్‌చార్జిగా ఉన్న మంత్రి పితాని సత్యనారాయణకు గణబాబు సహాయకునిగా పనిచేయాల్సి ఉంటుంది. దీంతో, ఈ ఇద్దరూ బయటకు చెప్పుకోలేక బాధపడుతూంటే అనుచరులు మాత్రం అదేదో పార్టీ అందించిన గొప్ప గౌరవం అంటూ వారికి పుష్ప గుచ్చాలు ఇస్తూ హడావుడి చేస్తూంటే ఇరకాటంలో పడిపోవడం సీనియర్ల వంతవుతోంది.

వైసీపీలో పీలా ప్రకంపనలు

వైసీపీకి ఉత్తరాంధ్ర జిల్లాల పెద్ద దిక్కుగా ఉన్న సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణకు ఇపుడు పెద్ద తంటాయో వచ్చి పడింది. ఆ పార్టీ ఓ వైపు విశాఖ జిల్లాలో భూ దందాపై పోరాటం చేస్తూంటే మరో వైపు తెలుగుదేశం పార్టీకి చెందిన అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణతో ఆయనకు ఉన్న సాన్నిహిత్యం ఇరకాటం పెడుతోంది. ఉత్తరాంధ్రలో మద్యం వ్యాపారం చేసే వారంతా రాజకీయాలలో ఉన్నారు. వారంతా పార్టీలకు అతీతంగా ఒకే గూటి పక్షులు. ఇలా కలసిన బంధమే పీలా బొత్సలది కూడా.

ఆ బంధానికి ఇపుడు సరిగ్గా గురిచూసి కొట్టింది తెలుగుదేశం అధినాయకత్వం. ఒక దెబ్బకు రెండు పక్షులు ఉన్న రీతిలో తమ ఎమ్మెల్యేపైన తమ ప్రభుత్వమే కేసు పెట్టిందన్న ప్రచారంతో పాటుగా, వైరి పక్షానికి కూడా షాక్‌ ఇచ్చేసింది. రెండు దశాబ్దాలుగా సాగిన పీలా కుటుంబీకుల భూ దందాలో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం పాత్ర కూడా ఉందన్నది వాస్తవం. అదే సమయంలో పీలాతో బొత్సకు ఉన్న లిక్కర్‌ అనుబంధం కూడా ఇపుడు ప్రముఖంగా ముందుకు వస్తోంది.

దీంతో,వైసీపీ నేతలకు పీలాను విమర్శిస్తే ఓ ఇబ్బంది, అలాగని ఊరుకుంటే మరో ఇబ్బంది అన్నట్లుగా పరిస్థితి తయారైంది. మొత్తానికి నెల రోజుల క్రితం విశాఖ నడిబొడ్డున వైసీపీ అధినేత జగన్‌ ఆధ్వర్వంలో నిర్వహించిన సేవ్‌ విశాఖకు వచ్చిన భారీ స్పందనను నీరు కార్చే విధంగా పైఎత్తు వేసిన టీడీపీ అధినాయకత్వం మురిసిపోతూంటే వైసీపీ నేతలు మాత్రం భుజాలు తడుముకుంటున్నారు.

పార్టీలు వేరైనా వ్యక్తిగత స్నేహాలు ఉండకూడదంటే ఎలా, తమకు టీడీపీలో ఇప్పటికీ ఎంతోమంది స్నేహితులు ఉన్నారంటూ స్వయంగా బొత్స సత్యనారాయణ దీనిపై ఇచ్చిన వివరణ వైసీపీని మరింతగా ఇరకాటంలోకి నెడుతోంది. ఏది ఏమైనా ఒక్క టీడీపీ ఎమ్మెల్యేపై కేసుతోనే వైసీపీ మూలాలు కదిపిపోయేలా చేశామని పసుపు తమ్ముళ్లు ముసిముసిగా నవ్వుకుంటున్నారు.

Show comments