కాపు మంత్రుల్లో విద్యా వ్యాపారే లక్కీ....!

'అదృష్టవంతుడిని చెడగొట్టలేరు...దురదృష్టవంతుడిని బాగుచేయలేరు' అనే సామెత ఉంది. ఏపీలోని చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోని  'కాపు' సామాజికవర్గానికి చెందిన ముగ్గురు మంత్రుల పరిస్థితి ఇలాగే ఉంది. ఈ మంత్రుల పనితీరు బాగాలేదని తేలినప్పుడు ఉద్వాసన పలికితే ముగ్గురికీ పలకాలి కదా. కాని ముఖ్యమంత్రి చంద్రబాబు అనుసరించే ధర్మం అది కాదు. బాబుకు కోటీశ్వరులు, బడా కార్పొరేటర్లు అంటే ప్రేమ కాబోలు. పార్టీ బండికి వారు ఇం'ధనం'లా ఉపయోగపడతారు కాబట్టి వారి పనితీరు బాగాలేదని తేలినా ఏదోరకంగా ప్రాధాన్యం ఇస్తారు. ఏపీ ప్రభుత్వంలో ఇదే జరగబోతోందని సమాచారం. 

దసరా సమయానికి మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేయాలని బాబు భావిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఉన్నవారిలో కొందరిని తొలగించి, కొందరిని మంత్రివర్గంలోకి తీసుకుంటారు. అలా తీసుకునేవారిలో ఆయన కుమారుడు కమ్‌ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. తొలగించేవారిలో ముగ్గురు కాపు సామాజికవర్గానికి చెందిన మంత్రులున్నట్లు సమాచారం. వారు: పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ, మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఉప ముఖ్యమంత్రి కమ్‌ హోం శాఖ మంత్రి నిమ్మకాయల చిన రాజప్ప ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకు? మంత్రులుగా వీరి పనితీరు బాగాలేదట. అలాగే పార్టీ వ్యవహారాల్లో సామర్థ్యం చూపించడంలేదట. 

ఈమధ్య చేసిన ఇంటలిజెన్స్‌ సర్వేలో, బాబు పార్టీపరంగా చేయించిన సర్వేలో ఈ విషయం తేలింది. ఈ సర్వే లోకేష్‌ ఆధ్వర్యంలోనే జరిగింది.  బాబు ఐవీఆర్‌ విధానంలో మొబైల్‌ యూజర్లతో టెలిఫోనిక్‌ సర్వే నిర్వహించారు. దాంట్లోనూ కాపు మంత్రుల పనితీరు సో...సో..గా ఉన్నట్లు తేలింది. హోం శాఖ కూడా నిర్వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి చినరాజప్పపై పోలీసు శాఖ నుంచే నెగెటివ్‌ రిపోర్టు అందిందట. పోలీసు అధికారులకు-మంత్రికి మధ్య కమ్యూనికేషన్‌ గ్యాప్‌ ఉన్నట్లు సర్వేలో తేలింది. దీంతో వీరికి స్వస్తి చెప్పాలని నిర్ణయించుకున్నారట. 

పదవులు తీసేస్తే గంటా, నిమ్మకాయల ఇంటికి వెళ్లాల్సిందే.  కాని నారాయణ మాత్రం వెళ్లరు. అదే బాబు ఆయనకు ఇస్తున్న ప్రాధాన్యం. ఆయన్ని రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ)కు ఛైర్మన్‌గా చేయాలని నిర్ణయించారు. ఇది కేబినెట్‌ ర్యాంకు పదవి. ఏ పార్టీకైనా లక్షాధికారులు, కోటీశ్వరులు, శత కోటీశ్వరులు ఎంతో అవసరం. ఎన్ని రాజకీయాలున్నా అధినేతలు అలాంటివారిని అనవసరంగా దూరం చేసుకోరు. తెలివైన బాబు అలాంటి పని అసలే చేయరు.  నారాయణను మంత్రి పదవి నుంచి తొలగించినా ఆయన స్థాయి, హోదా తగ్గకుండా చూడాలని, రాష్ట్రంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉండాలని చంద్రబాబు అనుకుంటున్నారు. దాని ఫలితమే ఏపీసీఆర్‌డీఏ ఛైర్మన్‌ పదవి.   Readmore!

పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా రాజధాని నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్న నారాయణ సీఆర్‌డీఏకు ఛైర్మన్‌ అయితే మరింత పవర్‌ఫుల్‌గా ఉంటారని కొందరు నాయకులు చెబుతున్నారు. విద్యా శాఖ మంత్రిగా గంటా పనితీరుపై చంద్రబాబు చాలాకాలం నుంచి అసంతృప్తిగానే ఉన్నారు. గతంలో ఎంసెట్‌ పరీక్షలు తదితర విద్యా సంబంధమైన వ్యవహారాల్లో ఏపీ-తెలంగాణ మధ్య గొడవలు జరిగాయి. అప్పడు గంటా సరిగా వ్యవహరించలేదని చంద్రబాబుకు అసంతృప్తిగా ఉంది. ఇక కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు చిరంజీవితో గంటా సన్నిహితంగా ఉంటుండటం కూడా బాబుకు ఆగ్రహం కలిగిస్తోంది. 

అల్లు అర్జున్‌ హీరోగా నటించిన 'సరైనోడు' ఫంక్షన్‌ను పనిగట్టుకొని విశాఖపట్నంలో పెట్టించి గంటా అంతా తానై నడిపించారు. గతంలో గంటా ప్రజారాజ్యం నాయకుడనే సంగతి తెలిసిందే. టీడీపీలోకి వచ్చినా ఆ సన్నిహితత్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇది నచ్చని చంద్రబాబు గంటాకు గట్టిగా క్లాసులు పీకినట్లు మీడియాలో వార్తలొచ్చాయి. మొత్తం మీద కాపు మంత్రుల్లో శత కోటీశ్వరుడు నారాయణ లక్కీ ఫెలో అయ్యారు. గంటా, నారాయణ వియ్యంకులనే సంగతి తెలిసిందే. వీరిలో ఒకరు చంద్రబాబుకు అత్యంత ఆప్తుడిగా మారగా, మరొకరు ఆగహ్రానికి గురవుతున్నారు. 

Show comments

Related Stories :