ఇద్దరూ దేశద్రోహం కేసులోనే అరెస్టయ్యారు... ఇద్దరూ విద్యార్థి దశలోనే రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యారు. ఒకరేమో, ఇన్‌స్టంట్‌గా పాపులారిటీ తెచ్చుకుంటే.. ఇంకొకరేమో, సుదీర్ఘకాలం పోరుబాట నడిచారు. అయితే అందులో ఒకరు రాజకీయంగా తేలిపోయారు.. ఇంకొరు రాజకీయ తెరపై ఓ వెలుగు వెలిగేందుకు సమాయత్తమవుతున్నారు.
వారెవరో కాదు, జేఎన్‌యూ విద్యార్థి కన్హయ్య కుమార్, పటీదార్ అమానత్ ఆందోళన సమితి (పాస్) నేత హార్దిక్ పటేల్. అయితే, ఇక్కడ కన్హయ్య కుమార్ ఇంకా రాజకీయ తెరపై కన్పించలేదు, కన్పించాలనుకుని భంగపడ్డాడు. జెఎన్‌యూ వివాదం, హెచ్‌సీయూ రగడతో దేశవ్యాప్తంగా కన్హయ్య కుమార్ పేరు మార్మోగిపోయింది. కాంగ్రెస్, వామపక్షాలు కన్హయ్యకుమార్‌ని 'ఓన్' చేసుకోవడానికి పడ్డ పాట్లు అన్నీ ఇన్నీ కావు. పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో కన్హయ్యకుమార్ తమ తరఫున 'ట్రంప్' కార్డ్ అవుతాడని వామపక్షాలు, కాంగ్రెస్ భావించి భంగపడ్డాయి. ఇప్పుడు కన్హయ్య కుమార్ గురించి ఎవరూ పట్టించుకోవడంలేదు.
ఇక, హార్దిక్ పటేల్ విషయానికొస్తే, పటేల్ రిజర్వేషన్ కోసం పోరాడుతున్న ఈ యువనేత రాజకీయాల్లోకి వచ్చేందుకు మార్గం సుగమం చేసుకుంటున్నాడు. 'పాస్' ఒప్పుకుంటే రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమేనని హార్దిక్ పటేల్ ఇప్పటికే ప్రకటించాడు. అతి త్వరలో ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీలు ఆయనకు గాలం వేస్తున్నాయి. పటేల్ రిజర్వేషన్ల కోసం పోరాడిన హార్దిక్, గుజరాత్ మినహా ఇతర రాష్ట్రాల్లో ప్రభావం చూపగలడా.? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నే.
అయితే, పటేల్ పోరాటంలో హార్దిక్ పటేల్ రాజకీయ వ్యూహాలు అందర్నీ విస్మయానికి గురిచేశాయి. క్షణాల్లో లక్షలాది మందిని పోగేయగల 'అతని మాటల్లోని శక్తి'ని కాంగ్రెస్ సహా వివిధ రాజకీయ పార్టీలు గుర్తించాయి. అందుకే, హార్దిక్‌ని తమవైపుకు తప్పుకోడానికి ఆయా పార్టీలు ప్రయత్నాల్ని ముమ్మరం చేశాయి. 'కలిసి పనిచేద్దాం..' అని స్వయానా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, హార్దిక్ పటేల్‌కి సమాచారమిచ్చారట.
ప్రస్తుతానికైతే హార్దిక్ పటేల్, గుజరాత్ నుంచి ఆరు నెలలపాటు బహిష్కరణకు గురయ్యారు. న్యాయస్థానం ఈ షరతుతోనే అతనికి దేశద్రోహం సహా పలు కేసుల్లో బెయిల్ మంజూరు చేసిన విషయం విదితమే. ఇప్పుడు రాజస్తాన్‌లో వున్న హార్దిక్ పటేల్, రానున్న రోజుల్లో ఏ రాజకీయ పార్టీ వైపు దృష్టి సారిస్తాడో వేచి చూడాల్సిందే.