ఈ వేలమైనా సక్రమంగా జరుగుతుందా?

ప్రభుత్వం వేలం వేసినా, కాంట్రాక్టులకు బహిరంగ బిడ్ లు కాల్ చేసినా జరిగేదేమిటో అందరికీ తెలిసిందే. బలమున్నవాళ్లు రింగ్ అయిపోయి, వేరే వాళ్లను రానివ్వకుండా చేసి, తమకు అనుకూలమైన రేటుకు కాంట్రాక్టులు కానివ్వండి, టెండర్లు కానివ్వండి చేజిక్కించుకుంటారు. ఇది చాలా అంటే చాలా కామన్. 

నిన్నమొన్నటి సదావర్తి సత్రం భూముల వ్యవహారం అందరికీ తెలిసిందే. ఆంధ్రబ్యాంకు కు బాకీపడిన ఇల్లు వేలం చేజిక్కించుకునే విషయంలో ఎంపీ గల్లా జయదేవ్ వ్యవహారం ముఖ్యమంత్రి దృష్టికే వెళ్లిన సంగతి తెలిసిందే. ఇలాంటి వైనాల నేపథ్యంలో, ముఖ్యమంత్రి నిన్నటికి నిన్న వీలయినంత త్వరగా అగ్రిగోల్డ్ భూములు వేలం వేసేయమని అధికారులను ఆదేశించడం అనుమానాలకు తావిస్తోంది. 

నిజంగా బాధితుల మీద ప్రేమతోనేనా? లేక అస్మదీయులు విలువైన అగ్రిగోల్డ్ భూములను హ్యాపీగా వేలం పాడేసుకోవడానికా? ఇలాంటి అనుమానాలు రాకూడదు అంటే అగ్రీ గోల్డ్ భూములకు నికార్సయిన మార్కెట్ రేటు సెట్ బ్యాక్ ప్రయిస్ గా నిర్ణయించాలి. అదే విధంగా నేషనల్ వైడ్ గా ఆన్ లైన్ వేలం నిర్వహించాలి. లేదూ అంటే అస్మదీయులు రింగ్ అయిపోయి, రేటు రానివ్వకుండా, విలువైన భూములు తన్నుకు పోయే ప్రమాదం వుంది.

Show comments