జనం ఛీకొడుతున్న పార్టీ అధినేత...!

దేశంలో ప్రస్తుతం ప్రాంతీయ పార్టీలకు చాలా ఆదరణ లభిస్తోంది. ప్రాంతీయ పార్టీల అధినేతలను జనం విపరీతంగా అభిమానిస్తున్నారు. ఏదైనా ప్రాంతీయ పార్టీ అధికారంలో లేకపోయినా దాని అధినేత ఆదరణకు ఢోకా ఉండటంలేదు. ఇతర రాష్ట్రాల విషయం ఎలా ఉన్నా తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలకు, దాని అధినేతలకు ఉన్న ప్రజాదరణ తెలిసిందే. డీఎంకే అధికారంలో లేదు. అయినప్పటికీ దాని అధినేత కరుణానిధికి ప్రజాదరణ బాగానే ఉంది. ఎంజీఆర్‌, జయలలిత అన్నాడీఎంకే పార్టీకి దశాబ్దాలుగా తిరుగులేని నాయకులుగా కొనసాగారు. జయలలితపై అవినీతి ఆరోపణలు వచ్చినా ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. ఆమె చనిపోయాక సుప్రీం కోర్టు అక్రమాస్తుల కేసులో ఆమెను దోషిగా ప్రకటించినా ప్రజల్లో ఆమెకు ఆదరణ తగ్గలేదు. జనం ఆమెను దోషిగా కాకుండా దేవతగానే చూస్తున్నారు. కాని అక్రమాస్తుల కేసులో జయతో పాటు దోషి అయిన శశికళ నటరాజన్‌ను మాత్రం జనం అసహ్యించుకుంటున్నారు. 

ప్రధానంగా వచ్చే నెలలో ఉప ఎన్నిక జరగబోయే చెన్నయ్‌లోని ఆర్కేనగర్‌లో ఓటర్లు శశికళ పేరెత్తితే మండిపడుతున్నారు. జయలలిత చనిపోయాక పార్టీ నాయకులు ఆమెను అన్నాడీఎంకేకు ప్రధాన కార్యదర్శిగా (తాత్కాలిక) ఎన్నుకున్నారు. అంటే ఆమె పార్టీ అధినేత అన్నమాట. అయితే అన్నాడీఎంకే నాయకులకు శశికళ అధినేతగా ఉందిగాని జనం ఆమెను జయలలిత స్థానంలో చూడలేకపోతున్నారు. ఆర్కేనగర్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో తలెత్తిన సంక్షోభంతో అన్నాడీఎంకే రెండు ముక్కులై, శశికళ వర్గం అన్నాడీఎంకే పక్కన బ్రాకెట్లో 'అమ్మ' అని చేర్చుకోగా, మాజీ సీఎం పన్నీరుశెల్వం వర్గం బ్రాకెట్లో 'పురట్చితలైవి' అని పెట్టుకుంది. అన్నాడీఎంకే పేరును ఎన్నికల కమిషన్‌ ఫ్రీజ్‌ చేసింది. ఎన్నికల చిహ్నం 'రెండాకులు' కూడా ఎవ్వరికీ ఇవ్వకుండా నిలిపేసింది. శశికళ వర్గం 'టోపి' గుర్తుతో, పన్నీరు వర్గం 'కరెంటు స్తంభం' గుర్తుతో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. శశికళ వర్గం అభ్యర్థి కమ్‌ పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి కమ్‌ శశి అక్క కుమారుడైన దినకరన్‌కు ఆర్‌కే నగర్‌లో చేదు అనుభవాలు ఎదురవుతున్నట్లు సమాచారం.

శశికళను జనం అసహ్యించుకోవడమే ఈ చేదు అనుభవం. చివరకు దినకరన్‌కు గత్యంతరం లేక 'శశికళ పేరు చెప్పుకొని ఓట్లు అడగకండి' అని తన వర్గం నాయకులకు, కార్యకర్తలకు చెబుతున్నాడట...! వాల్‌పోస్టర్లలో, బ్యానర్లలో, కరపత్రాల్లో శశికళ బొమ్మ కనబడేందుకు వీల్లేదని చెప్పాడట. ఆమె పేరు చెప్పినా, బొమ్మ కనబడినా తన వర్గానికి ఓట్లు వేయరని భయపడుతున్నాడు. శశికళ కారణంగానే 'అమ్మ' చనిపోయిందని, ఆమెకు సంబంధించిన సమాచారం బయటకు రాకుండా తొక్కిపెట్టింది చిన్నమ్మేనని జనం అభిప్రాయం. అమ్మ ఉన్నంత కాలం తాము ప్రభుత్వం ద్వారా అనేక ప్రయోజనాలు పొందామని, కాని ఆమె ఆస్పత్రిలో చేరినప్పటినుంచి తమను ఎవ్వరూ పట్టించుకోలేదని, ఆమె మరణించాక పరిస్థితి ఇంకా దారుణంగా ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం మంచినీళ్లు కూడా రోజూ రావడంలేదంటున్నారు. అన్నాడీఎంకే పేరును, రెండాకుల గుర్తును ఎన్నికల సంఘం నిలిపేయడం శశికళకు తొలి అపజయంగా భావించవచ్చు. ఇది ఊహించని దెబ్బ. 

జయలలిత చనిపోవడానికి శశికళే కారణమని ఆర్కేనగర్‌ జనం గట్టిగా నమ్ముతున్నారు.  సాధారణంగా ఏ పార్టీ అయినా అధినేత పేరు చెప్పుకొని, ఆయన/ఆమె బొమ్మ ముందు పెట్టుకొని ఎన్నికల ప్రచారం చేస్తుంది. కాని శశికళ వర్గం విషయంలో రివర్స్‌ అయింది. ఈ వర్గం ఎంజీఆర్‌, జయలలిత బొమ్మలతో ప్రచారం చేస్తున్నట్లు సమాచారం. ఏప్రిల్‌ 12న ఆర్కేనగర్‌ ఉప ఎన్నికల అయిపోయిన వారం రోజుల్లోగా ఎన్నికల సంఘం ఓ కీలకాంశంలో నిర్ణయం తీసుకోబోతోంది. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎంపిక చెల్లుతుందా? లేదా? అనే విషయంపై ఎన్నికల సంఘం ఉప ఎన్నిక తరువాత నిర్ణయం ప్రకటిస్తుంది. పన్నీరుశెల్వం వర్గం, మరికొందరు చేసిన ఫిర్యాదులపై ఎన్నికల సంఘం విచారణ జరుపుతోంది. ఆమె ఎంపిక పార్టీ నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని పన్నీరు వర్గం గట్టిగా వాదిస్తోంది. ఎన్నికల సంఘం శశికళకు వ్యతిరేకంగా తీర్పు ఇస్తే ఆమె రాజకీయ జీవితం ముగిసిపోయినట్లేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Readmore!

Show comments

Related Stories :