తమిళనాట బీజేపీ గేమ్ మొదలైంది!

ఒక పార్టీ లెజిస్ట్లేటివ్ నేతగా ఎన్నుకోబడిన వ్యక్తి చేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించడానికి గవర్నర్ అందుబాటులో లేకపోవడం.. అనేది ఎప్పుడైనా విన్నారా? కనీస స్థాయిలో ఎమ్మెల్యేల మద్దతు లేని వ్యక్తుల చేత కూడా గవర్నర్లు వివిధ సందర్భాల్లో సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేయించారు! తమకు బలం ఉందని లేఖలు ఇచ్చిన  వారి చేత ప్రమాణ స్వీకారం చేయించి, ఆ తర్వాత బలనిరూపణకు అవకాశం ఇచ్చిన సందర్భాలు బోలెడున్నాయి.

అలాంటి సమయాల్లో నిలబడిన ప్రభుత్వాలు, కుప్పకూలిన ప్రభుత్వాలు కూడా ఉన్నాయి. అయితే.. లెజిస్ట్లేటర్ల బలం ఉన్న వ్యక్తి చేత ప్రమాణ స్వీకారం చేయించడానికి గవర్నర్ అందుబాటులో లేడట తమిళనాడులో! దీంతో శశికళ ప్రమాణ స్వీకారోత్సవం జరిగే అవకాశం లేదనే ఊహాగానాలే ఉన్నాయి ఇప్పటి వరకూ.

ఈ నేపథ్యంలో ఇదంతా కమలం పార్టీ గేమ్.. అనే మాట వినిపిస్తోంది. ఎలాగూ తమిళనాడు గవర్నర్ భారతీయ జనతా పార్టీకి చెందిన వ్యక్తే. శశికళ దూకుడు బీజేపీకి ఏ మాత్రం ఇష్టం లేదనే మాటే వినిపిస్తోంది. కనీసం పన్నీరు సెల్వాన్ని అయినా అడ్డు పెట్టుకుని వ్యవహారాన్ని నడిపిద్దామనుకుంటే.. అతడు చిన్నమ్మ ముందు కూడా సాగిలపడిపోతున్నాడు! ఈ నేపథ్యంలో కమలం పార్టీ గవర్నర్ వైపు నుంచి నరుక్కొస్తోందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

అంతా మీరు అనుకున్నట్టుగా కాదు.. అనే సంకేతాలు ఇవ్వడానికే గవర్నర్ అందుబాటులో లేకుండా పోయాడనే మాట వినిపిస్తోంది. నిజంగానే.. కేసుల వ్యవహారంలో తీర్పును ఉద్దేశించి శశికళ చేత గవర్నర్ ప్రమాణం చేయించడానికి ఇష్టపడటం లేదంటే.. ఈ మేరకు అధికారిక ప్రకటన చేయవచ్చు కూడా! అలా ఆయన ప్రకటిస్తే.. ఆ తర్వాత ఆయన నిర్ణయంపై కోర్టుకు వెళ్లొచ్చు అన్నాడీఎంకే లెజిస్ట్లేటర్లు. అందుకే.. ‘అందుబాటులో లేకపోవడం’ అనే వ్యూహాన్ని కమలం పార్టీ అనుసరింపజేస్తోందనే విశ్లేషకులు భావిస్తున్నారు.

శశికళ చేత ప్రమాణ స్వీకారమూ చేయించకుండా, చేయిస్తానని చెప్పకుండా.. వారం రోజుల వరకూ ఈ వ్యవహారాన్ని నాన్చే అవకాశాలు ఉండవచ్చు! ఏదేమైనా.. తమిళనాడు పరిణామాల పట్ల కిమ్మనకుండా కనిపించిన కమలం పార్టీ, ఆఖరి నిమిషంలో తన అస్త్రాన్ని సంధించింది. ఇప్పుడు ఈ వ్యవహారం మరింత రసవత్తరంగా మారింది.

Show comments