మొదటిదానికే దిక్కులేదు...అప్పుడే రెండోదా?

రాజకీయ నాయకులకు పీకి పాకం పెట్టడానికి ఏదో ఒక అంశం దొరుకుతూనే ఉంటుంది. ఎవరో నాయకుడు ఏదో ప్రకటన చేస్తాడు. ఇక దానిపై మీడియాలో విమర్శలు, ప్రతివిమర్శలు, చర్చలు కొనసాగుతుంటాయి. కొన్నాళ్ల తరువాత అది మరుగున పడిపోయి మరో అంశం తెర మీదికి వస్తుంది. 'కాదేదీ కవితకనర్హం' అన్నట్లుగా 'కాదేదీ రాజకీయానికనర్హం' అని చెప్పుకోవచ్చు. అసలు విషయానికొస్తే ...ఆంధ్రప్రదేశ్‌కు తిరుపతిని రెండో రాజధానిగా చేయాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. తిరుపతిని రెండో రాజధాని చేస్తే రాయలసీమకు ప్రాధాన్యం ఇచ్చినట్లవుతుందని ఆయన అభిప్రాయం. ప్రజలు కూడా సంతోషిస్తారట...! తిరుపతిని రెండో రాజధానిగా ప్రకటించి అక్కడ ట్రాన్సిట్‌ సెక్రటేరియట్‌ ఏర్పాటు చేయాలట...! ఏపీలో రాయలసీమకు ప్రాధాన్యం ఇవ్వడంలేదనే సమస్య ఎప్పుడూ ఉంటూనే ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ ఉంది. ఇప్పుడు రెండో రాజధాని పేరుతో రాయలసీమ ఉద్యమాన్ని తెర మీదికి తెస్తారేమో. 

రాష్ట్రానికి ఇప్పటివరకు రాజధాని లేదు. 'అమరావతి' ఎప్పుడు సాకారమవుతుందో తెలియదు. మొదటి రాజధానికే దిక్కు లేనప్పుడు రెండో రాజధాని గురించి ఎందుకు డిమాండ్‌ చేస్తున్నారో..! ఒక రాజధాని నగరమంటూ ఉంటే రెండోదాన్ని గురించి ఆలోచించవచ్చు. కాకపోతే రెండో రాజధాని డిమాండ్‌ తాజాగా శ్రీకాంత్‌ రెడ్డి చేసింది కాదు. గతంలోనే పలువురు రాయలసీమ నాయకులు దీన్ని తెరమీదికి తెచ్చి రాజకీయం చేశారు.  ఉమ్మడి  రాష్ట్రాన్ని విభజించే సమయంలో హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధాని చేయాలని ఆంధ్రా నాయకులు డిమాండ్‌ చేశారు. అభివృద్ధి చెందిన హైదరాబాదును తెలంగాణకు దక్కనివ్వకూడదనే ఉద్దేశంతో ఈ డిమాండును ముందుకు తెచ్చారు. హైదరాబాదును దేశానికి రెండో రాజధాని చేయాలని డాక్టర్‌ అంబేద్కర్‌ ఏనాడో చెప్పారని వాదించారు. అదే తరహాలో ఆంధ్రప్రదేశ్‌కు రెండో రాజధాని ఏర్పాటు చేయాలని, అది రాయలసీమలో ఉండాలని డిమాండ్‌ చేస్తున్నారు.  ప్రస్తుత టీడీపీ నాయకుడు , రాయలసీమ హక్కుల కోసం పోరాడుతున్న టీజీ వెంకటేష్‌ కొంతకాలం కిందట  'రెండో రాజధాని' డిమాండ్‌ను ప్రస్తావించారు.

రాయలసీమలో రెండో రాజధాని ఉండాలంటే కర్నూలును ఎంపిక  చేయాలని ఆయన ఉద్దేశం. రాష్ట్రానికి ఒక రాజధాని  ఉంటే రెండో రాజధాని ఉండాలని అడగడంలో (అవసరం లేకపోయినా) అంతో ఇంతో అర్థం ఉంది. రాజధాని ఏర్పాటు చేస్తే రాయలసీమ అభివృద్ధి చెందుతుందా?  రాయలసీమలో రెండో రాజధాని ఏర్నాటు చేయకపోయినా, ఇతరత్రా అభివృద్ధి చేయకపోయినా వేర్పాటువాద ఉద్యమం మొదలవుతుందని అప్పట్లో టీజీ వెంకటేష్‌ అన్నారు. ఇది ప్రభుత్వానికి హింట్‌ ఇవ్వడమా? హెచ్చరించడమా? లేదా తాను టీడీపీని వదిలేసి రాయలసీమ ఉద్యమంలో పాల్గొంటానని చెప్పడమో తెలియదు. మళ్లీ దీన్ని గురించి ఈయన మాట్లాడలేదు.  జమ్మూ కాశ్మీర్‌కు జమ్ము వింటర్‌ క్యాపిటల్‌గా ఉండగా, శ్రీనగర్‌ సమ్మర్‌ క్యాపిటల్‌గా ఉంది. ఇక్కడి ప్రత్యేక పరిస్థితుల కారణంగా ఇలా ఏర్పాటు చేశారు.  13 జిల్లాల ఏపీలో రెండో రాజధానితో ఒరిగేది ఏముంటుంది? రాయలసీమవాసులకు అమరావతి దూరం అనే వాదన ఉంది. అయితే అమరావతికి సులభంగా వెళ్లడానికి రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవడం అసాధ్యం కాదు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర ప్రాంతం విడిపోగానే కర్నూలును రాజధానిగా చేశారుగాని మూడేళ్లకే రాజధానిగా హైదరాబాదును (తెలంగాణను కలిపేసుకొని) రాజధానిగా చేయడంతో దీని ప్రాధాన్యం తగ్గిపోయింది. ఈ బాధ కర్నూలువాసుల్లో (పాత తరం) ఉంది.

ఉమ్మడి రాష్ట్రం విడిపోగానే మళ్లీ కర్నూలును రాజధాని చేయాలనే డిమాండ్‌  వచ్చినా అది నెరవేరలేదు. అమరావతిని ప్రతిపాదించగానే రాయలసీమలో పెద్ద ఎత్తున ఉద్యమం లేస్తుందని, రాజధానిపై రగడ అవుతుందని అనుకున్నా అలాంటిదేమీ జరగలేదు. రాజధాని అవకాశం పోయింది కాబట్టి రెండో రాజధానిని తెర మీదకు తెచ్చారు. ఇదిలా ఉంటే కొంతకాలం కిందట ఓ వార్త వచ్చింది. దాని ప్రకారం అమరావతి దేశానికి రెండో రాజధాని అవుతుందట..! 'రెండో రాజధానిగా అమరావతికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం' అని ఓ తెలుగు పత్రిక రాసింది.  ఇది ఎంతవరకు నిజమో తెలియదు. ఈ వార్త ప్రకారం....భవిష్యత్తులో పాకిస్తాన్‌ నుంచి ఇండియాకు అణు ముప్పు ఉంది. ఈ ముప్పును తప్పించుకోవాలంటే మరో రాజధాని అవసరం. ఏపీ రాజధాని అమరావతి ఇందుకు సరైన ప్రాంతమని కేంద్రం భావిస్తోంది. చెన్నయ్‌, బెంగళూరు, హైదరాబాద్‌ కంటే కృష్ణా నది ఒడ్డున ఉన్న అమరావతి సురక్షిత ప్రాంతమని కేంద్రం భావిస్తోంది. పాకిస్తాన్‌ న్యూక్లియర్‌ క్షిపణులను ప్రయోగించినా ఎలాంటి ముప్పూ ఉండదట. రెండో రాజధానిపై హోం శాఖ తయారుచేసిన ప్రతిపాదనలకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందట. ఈ వార్త నిజమైనదై ఉంటే పెద్ద చర్చనీయాంశమయ్యేది. కాని ఎవ్వరూ పట్టించుకోలేదు.

Show comments