ఛలో చైనా: చంద్రబాబు జంప్‌ జిలానీ

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చైనా వెళుతున్నారు. ఈ నెల 26 నుంచి 29 వరకు చంద్రబాబు చైనా పర్యటనలోనే బిజీ బిజీగా గడిపేయనున్నారట. ఆయనతోపాటు మంత్రి నారాయణ కూడా చైనాకి వెళుతుండడం గమనార్హం. పెట్టుబడులు రాబట్టేందుకు, అమరావతి నిర్మాణంలో సహకరించమని కోరేందుకు.. ఈ టూర్‌ని చంద్రబాబు అండ్‌ టీమ్‌ ప్లాన్‌ చేసిందట. 

నమ్మేద్దామా.? అయినా, సరిగ్గా జూన్‌ 26 - 29 మధ్య చంద్రబాబు అండ్‌ టీమ్‌ చైనా టూర్‌కి ఎందుకు ప్లాన్‌ చేసినట్లు.? ఇదే ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. విదేశాల్లో పర్యటించడం అనేది సాధారణ విషయమే. చైనా వెళ్ళొచ్చు, జపాన్‌ వెళ్ళొచ్చు, సింగపూర్‌ వెళ్ళొచ్చు, ఇంకో దేశం వెళ్ళొచ్చుగాక. ఆయా దేశాల నుంచి అధికారంలో వున్నవారికి అధిరారిక ఆహ్వానాలు రావడం ఎంత సహజమో, అధ్యయనం కోసమనీ.. ఒప్పందాల కోసమనీ, పెట్టుబడుల వేట కోసమనీ అధికారంలో ఉన్నవారు విదేశాలకు వెళ్ళడమూ అంతే సహజం. 

అయితే, అనుమానాలు ఎక్కడ వస్తున్నాయంటే, జూన్‌ 27 నుంచి అమరావతిలోని వెలగపూడి కేంద్రంగా తాత్కాలిక సచివాలయం నుంచే పరిపాలన సాగాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తరలింపు ప్రక్రియ కూడా జోరుగా సాగుతోంది. హైద్రబాద్‌ నుంచి పెట్టేబేడా సర్దేసుకుని ఉద్యోగులు అమరావతి వైపు పరుగులు తీస్తున్నారు. ఇందుకోసమే ప్రత్యేక రైలుని కూడా నిన్ననే ప్రారంభించారు కూడా. 

ఈ పరిస్థితుల్లో చంద్రబాబు అండ్‌ టీమ్‌ చైనా పర్యటన అంటే సహజంగానే అనుమానాలు తలెత్తుతాయి. తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనుల్ని స్వయంగా పర్యవేక్షిస్తున్నది మంత్రి నారాయణ. ముఖ్యమంత్రి చంద్రబాబు వారానికోసారి అక్కడికి వెళ్ళి పనులు వేగవంతమయ్యేలా ఆదేశాలు ఇచ్చి వస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 27 నుంచి వెలగపూడి సచివాలయం అందుబాటులోకి రావాల్సిందేనని పలు సందర్భాల్లో చంద్రబాబు చెప్పారాయె. 

కానీ, తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులు ఇంకా ఓ కొలిక్కి వచ్చిన పరిస్థితి అయితే లేదక్కడ. సో, ఉద్యోగుల నుంచే కాదు, రాష్ట్ర ప్రజానీకం, ఈ విషయమై ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఆస్కారమేర్పడింది. విపక్షాల సంగతి సరే సరి. అందుకే, ఆ మూడు నాలుగు రోజులు, ఎవరికీ అందుబాటులో వుండకపోతే సమస్యే వుండదు కదా.. అన్నది చంద్రబాబు అండ్‌ టీమ్‌ ఆలోచన కావొచ్చేమో.! లేకపోతే, నాలుగైదు రోజులు ఆలస్యంగా చైనా పర్యటను చంద్రబాబు ప్లాన్‌ చేసుకునేవారే కదా. 

కొసమెరుపు: చంద్రబాబు గతంలోనూ చైనాకి వెళ్ళొచ్చారు. జపాన్‌, సింగపూర్‌ చుట్టివచ్చారు. కానీ, ఏదీ ఎక్కడ.? ఆంధ్రప్రదేశ్‌లో ఆయా దేశాలు నెలకొల్పిన పరిశ్రమలేవి.? అమరావతి నిర్మాణానికి ఆయా దేశాలు సహకరించిందెక్కడ.? మళ్ళీ ఇప్పుడు కొత్తగా చంద్రబాబు చైనా పర్యటనతో రాష్ట్రానికి ఒరిగేదేముంటుంది.? చంద్రబాబూ.. ఆన్సర్‌ ప్లీజ్‌.!

Show comments