వీళ్లను చూస్తే బీజేపీకే బాధగా ఉందట...!

ఆంధ్రప్రదేశ్‌లో ఇద్దరు నాయకులను చూసి బీజేపీ నాయకులు బాధపడుతున్నారట...! 'ఇదేం కల్చర్రా బాబూ' అని ఆశ్చర్యపోతున్నారట...! ఇలాంటి నాయకులు దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేరని చెప్పుకుంటున్నారట...! బీజేపీ నాయకులు బాధపడి, ఆశ్చర్యపడుతున్న నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి. వీళ్లను చూసి బీజేపీ నాయకులు అంతగా చెప్పుకోవల్సిన అవసరమేముంది?

అసెంబ్లీ సమావేశాల్లో కొట్టుకోవడం తప్ప ఈ ఇద్దరు నాయకులు గత మూడేళ్లుగా బయట ఎక్కడా ఒకరినొకరు పలకరించుకోలేదు. ఇంకా చెప్పాలంటే కనీసం కన్నెత్తి ఒకరినొకరు చూసుకోలేదు. అసలు ఇద్దరూ ఒక చోట తారసపడితే కదా కన్నెత్తి చూసుకోవడానికి. నిజానికి బీజేపీ నాయకులు ఈ విషయంలో ఎందుకు బాధపడుతున్నారో తెలియదు. వారు అధికార పక్షం మిత్రులు. అధికారంలో భాగం పంచుకుంటున్నవారు. అయినప్పటికీ టీడీపీకి వంత పాడటంలేదు. 

బద్ధ శత్రువులైన చంద్రబాబు-జగన్‌ మధ్య అంతో ఇంతో సఖ్యత కుదర్చాలని బీజేపీ సీనియర్‌ నాయకులు ప్రధాని నరేంద్ర మోదీని అడుగుదామని ఆలోచిస్తున్నారని సమాచారం. బాబు-జగన్‌ మధ్య రాజకీయ శత్రుత్వమే కాకుండా వ్యక్తిగత వైరం కూడా ఉన్న విషయం తెలిసిందే. అసెంబ్లీ వర్షాకాలపు సమావేశాల సందర్భంగా ఈ ఇద్దరు నాయకుల మధ్య ఓ సహృద్భావ సమావేశం ఏర్పాటు చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారట...! అనుకోవడం బాగానే ఉందిగాని సాధ్యమవుతుందా?

పూర్తిగా ముదిరిపోయిన శత్రుత్వం వీరిది. ఇద్దరిలో వైరం నరనరాల్లో జీర్ణించుకుపోయింది. అలాంటప్పుడు వీరిని ఒక్కచోట చేర్చడం ఎంతవరకు సాధ్యమవుతుందనేది కీలక ప్రశ్న. ముఖ్యమంత్రి-ప్రధాన ప్రతిపక్ష నేత కన్నెత్తి చూసుకోకపోవడం, పన్నెత్తి పలకరించుకోకపోవడం దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేదని బీజేపీ నాయకులు చెబుతున్న మాట వాస్తవం.

ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు ప్రత్యర్థులేగాని శత్రువులు కావు. రాజకీయ పార్టీలు నిజంగా ఒకదానికొకటి శత్రువులే అయితే ఒక పార్టీలోని నాయకులను మరో పార్టీ చేర్చుకోకూడదు. జగన్‌ తనకు పరమ శత్రువుగా చంద్రబాబు భావిస్తున్నప్పుడు అతని పార్టీ నుంచి భారీగా ఎమ్మెల్యేలను ఎందుకు తన పార్టీలోకి చేర్చుకున్నారు? ఇదే జగన్‌కూ వర్తిస్తుంది. ఏపీలో మినహాయించి ఇతర రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నాయకులు మాట్లాడుకుంటూనే ఉన్నారు.

రాజకీయ ప్రయోజనాలు ఆశించనప్పటికీ బద్ధ శత్రువులా చూసే కల్చర్‌ లేదు. చాలా రాష్ట్రాల్లో అసెంబ్లీ సమావేశాల్లోనే అధికార, ప్రతిపక్షాలు ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు చేసుకుంటూ ఉంటాయి. అసెంబ్లీ సమావేశాలు లేనప్పుడు వారూ వీరూ ఎదురుపడినప్పుడు లేదా ఒక వేదిక పై కలిసినప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటారు. కేంద్రంలోనూ ఇలాగే ఉంది.

కాని చంద్రబాబు-జగన్‌ అసెంబ్లీలో పొట్టుపొట్టుగా తిట్టుకోవడమే కాకుండా బయటా అదే పని చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలే ఉండకూడదని, జగన్‌ పార్టీ అసలు ఉండకూడదని చంద్రబాబు అభిప్రాయం. జగన్‌ పార్టీ రాష్ట్రాభివృద్ధికి అడ్డుగా ఉందంటూ బాబు జపం చేస్తుంటారు. గత మూడేళ్లగా రాష్ట్రానికి వస్తున్న పారిశ్రామికవేత్తలు, వ్యాపార వేత్తలు తమ సమావేశాల్లో ప్రతిపక్ష నాయకుడి భాగస్వామ్యం ఎందుకు లేదని అడుగుతున్నట్లు ఓ సీనియర్‌ అధికారి చెప్పారు.

ఇతర దేశాల నుంచి అమరావతికి వస్తున్న ఉన్నతస్థాయి నాయకులు, వ్యాపార దిగ్గజాలు చంద్రబాబు-జగన్‌ మధ్య శత్రుత్వం గురించి విని ఆశ్చర్యపోతున్నారట...! ఇండియాకు ఇతర దేశాల రాయబారులు, పారిశ్రామికవ్తేత్తలు, దేశాధినేతలు వచ్చినప్పుడు ప్రధాని, రాష్ట్రపతిని కలుసుకున్న తరువాత ప్రతిపక్ష నేత సోనియా గాంధీని మర్యాదపూర్వకంగా కలుసుకుంటూ ఉంటారు. ఇందుకు ప్రభుత్వం అడ్డు చెప్పదు. ఏపీలో అలా ఎవరైనా జగన్‌ను కలుసుకుందామన్నా బాబు ప్రభుత్వ కలవనివ్వదనేది వాస్తవం.

వెలగపూడిలో నిర్మించిన తాత్కాలిక అసెంబ్లీలో  మొదటి శాసనసభ సమావేశాలే  ఎంత చక్కగా నిర్వహించారో తెలిసిందే.  ఈ సమావేశాలు చూశాక ఆంధ్రప్రదేశ్‌కు అసెంబ్లీ అవసరమా? అని కొందరు ప్రశ్నించారు.  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత జగన్‌ చొక్కాలు పట్టుకోవడం ఒక్కటే తక్కువ. అంతలా విమర్శించుకున్నారు. ఆరోపణలు చేసుకున్నారు. చివరకు వ్యక్తిగతంగా తిట్టుకున్నారు.

ఈ అసెంబ్లీ సమావేశాల సారాంశం ఒక్కటే. చంద్రబాబు, జగన్‌ హోదాలు మర్చిపోయి పూర్తిగా దిగజారిపోయారు. విద్యార్హతలు, పరీక్షలు, ఇంగ్లిషు మాట్లాడటం..మొదలైన పనికిమాలిన విషయాలపై ఇద్దరూ తిట్టుకున్న తరువాత పూర్తిగా దిగజారిపోయారని, ఇంకా దిగజారేందుకు అవకాశం లేదని అర్థమైంది. ఇలాంటివారు కలిసి మాట్లాడుకోవడం అత్యాశే.

Show comments