నిరుద్యోగ భృతి చెల్లిస్తాం!

నిరుద్యోగ భృతి చెల్లింపుపై ప్రభుత్వం అధ్యయనం చేస్తోందని మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగం లేక నిదుర్యోగ భృతి చెల్లించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయం ప్రకారం రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పించి పనుల కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన ప్రజాసాధికార సర్వే ప్రకారం 12లక్షల మంది నిరుద్యోగ యువత ఉన్నట్టు తేలిందని పేర్కొన్నారు.

ఈ సంఖ్యను ప్రభుత్వం పరిశీలిస్తోందని, రాష్ట్రంలో నిరుద్యోగులకు భృతి కల్పించే విధానాన్ని ప్రభుత్వం అధ్యయనం చేస్తోందని చెప్పారు. ప్రభుత్వ ఖజానా నుండి చెల్లించే ప్రతి పైసా సద్వినియోగం కావల్సి ఉందన్నారు. నిరుద్యోగ భృతి చెల్లింపులో శ్రీలంక, బ్రెజిల్‌ వంటి దేశాలలో సామాజిక సేవతో ముడివేసే విధానంపై కూడా ప్రభుత్వం ఆలోచిస్తోందని తెలిపారు.

ఈ దేశాలలో నిరుద్యోగ భృతి చెల్లింపు ద్వారా సామాజిక సేవా కార్యక్రమాల్లో యువత సేవలను వినియోగించుకుంటున్నారని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల్లో భాగంగా ఇటీవలి కాలంలో 30నుండి 40వేల ఉద్యోగాల ఖాళీల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. వీరిలో భాగంగా పోలీస్‌, మెడికల్‌, పారా మెడికల్‌ సిబ్బంది ఉన్నారని, విద్యాశాఖలో 26వేల కాంట్రాక్ట్‌ ఉపాధ్యాయులకు జీతాలు పెంచినట్టు వివరించారు.

రాష్ట్రంలో వచ్చే 2 సంవత్సరాల్లో నిరుద్యోగ సమస్య పరిష్కారం దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. వివిధ విద్యా సంస్థలు, వైద్య, ఇంజనీరింగ్‌ కోర్సులు చేసిన వారికి సకాలంలో ఉద్యోగ, ఉపాధి లభించని పక్షంలో వీరిలో నిరాస, నిస్పృహలు చోటుచేసుకునే ప్రమాదం ఉందన్నారు.

త్వరలో నూతన యువజన విధానాన్ని ప్రభుత్వం తీసుకువస్తోందని, యువతకు ఉపాధి కల్పించేందుకు వారిలో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించేందుకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి చెప్పారు.

Show comments