ఓన్లీ అమెరికా.. ఇంకెందుకు అమెరికా.?

ఓన్లీ అమెరికా.. ఇది అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తాజా నినాదం. అమెరికాలో ఉద్యోగాలు అమెరికన్లకే.. అంటూ ఎన్నికల వేళ నానా హంగామా చేసిన ట్రంప్‌, ఆ తర్వాత అమెరికాలోని అమెరికాయేతరులపై విద్వేషాల్ని పెంచేందుకు నానా రకాల డైలాగులూ పేల్చారు. మొదట్లో ఇది 'స్వాభిమానం' అనుకున్నారంతా. కానీ, ఇది ఇతరుల్ని ద్వేషించడం అనే విషయం అందరికీ అర్థమయ్యింది. 

ఇప్పుడు తాజాగా ఓన్లీ అమెరికా నినాదంతో సరికొత్త ఆందోళనలకు ట్రంప్‌ తెరతీస్తున్నట్టున్నాడు. అమెరికాలో అందరూ అమెరికా ఉత్పత్తుల్నే వాడాలట. ఇదేదో దేశ స్వాతంత్య్రం కోసం అఖండ భారతావని 'విదేశీ వస్తు బహిష్కరణ' పోరాట నినాదంలా వుంది కదూ.! అప్పటి పరిస్థితులకీ, ఇప్పటి పరిస్థితులకీ చాలా తేడా. అందునా, అమెరికా ఆ మాట అంటే అత్యంత హాస్యాస్పదంగానే వుంటుంది. 

చమురు విషయంలోనూ, ఇతరత్రా అనేక విషయాల్లోనూ అమెరికా విదేశాలపై ఆధారపడి తీరాల్సిందే. అంతెందుకు, అమెరికా జనాభాలో అత్యధికులు వలసదారులే. 'రండి బాబూ రండి.. అమెరికాలో పెట్టుబడులు పెట్టి సంపాదించుకోండి..' అంటూ అమెరికా ప్రభుత్వాలు 'రెడ్‌ కార్పెట్‌' వేయడంతోనే అమెరికా ఇప్పుడు ఈ స్థితిలో నిలిచింది. అమెరికా ఇప్పుడు అగ్రరాజ్యం గనుక, 'పోతేపొండి..  అనడం కాదు, ఖచ్చితంగా పోవాల్సిందే..' అంటూ హుకూం జారీ చేస్తోంది. 

ఓ వైపు ఇలా విద్వేషం రగుల్చుతూనే, ఇంకోవైపు 'విద్వేషానికి అమెరికాలో చోటులేదు..' అంటూ స్వయంగా డోనాల్డ్‌ ట్రంప్‌ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించేస్తున్నాడు. ఇటీవల హత్యకు గురైన కూచిబొట్ల శ్రీనివాస్‌కి అమెరికన్‌ కాంగ్రెస్‌లో నివాళులర్పించేశాడాయన. జాతివివక్ష పేరుతో ఎవరు దాడులకు పాల్పడినా సహించేది లేదని ట్రంప్‌ తేల్చిచెప్పడం విశేషమే మరి. నోటితో పిలిచి, నొసటితో వెక్కిరించడమంటే ఇదే మరి.! 

అమెరికా.. ఒకప్పుడు ప్రపంచానికి ఓ డ్రీమ్‌ డెస్టినేషన్‌. యువత అయినా, వ్యాపారవేత్తలు అయినా, ఇంకెవరైనాసరే.. అమెరికానే తమ డ్రీమ్‌ డెస్టినేషన్‌గా భావిస్తున్నారు. బహుశా భవిష్యత్తులో అమెరికా ఇకపై ప్రపంచానికి ఏమాత్రం డ్రీమ్‌ డెస్టినేషన్‌ కాకపోవచ్చు. ఎందుకంటే, అమెరికా అంతలా విద్వేషం పెంచి పోషిస్తోంది మరి.

Show comments