రెడ్డిగారి ఆబ్లిగేషన్‌ను వెంకయ్య తొక్కేశారా?

నాయకుల మాటలకు చాలా చాలా అర్థాలు ఉంటాయి. వారు పైకి ఒకటి మాట్లాడారంటే లోపల పది అర్థాలుంటాయి. నాలుగోసారి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన వెంకయ్యనాయుడికి ఆత్మీయ సత్కారం చేస్తూనే... నాయకులు పరోక్షంగా ఆయన మీద సెటైర్లు వేయడం గమనిస్తే ఎవరికైనా ఈ సంగతే అర్థమవుతుంది. వెంకయ్యనాయుడు తాజాగా ఎంపీ అయిన తర్వాత మొదటిసారిగా తన రాష్ట్రానికి వచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ, తెలంగాణలోనూ ఆయనకు ఆత్మీయ సత్కారాలు జరిగాయి. హైదరాబాదులో జరిగిన కార్యక్రమానికి అన్ని పార్టీల నాయకులు హాజరయ్యారు. వెంకయ్యనాయుడును ఒక్కొక్కరు ఒక్కొక్క తీరులో కీర్తించారు. తెలంగాణ తెదేపా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డికి ఆయన ఘనతను కీర్తించడానికి సాటి తెలుగు వారిలో నీలం సంజీవరెడ్డి తప్ప మరొకరి పేరు గుర్తుకు రాలేదు. రాష్ట్రపతి అయిన నీలం సంజీవరెడ్డి తర్వాత జాతీయస్థాయిలో అంతా గుర్తింపు సంపాదించిన నాయకుడు వెంకయ్య ఒక్కరేనని రేవంత్‌ కీర్తించారు. అయితే మన దేశ వ్యవస్థ రూపు రేఖలను మార్చేసిన ప్రధాని పివి నరసింహారావును రేవంత్‌ ఎలా మరచిపోయారనేది మాత్రం చిత్రమే. 

అదే మాదిరిగా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మాజీ కేంద్రమంత్రి టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ.. వెంకయ్యపై పరోక్షంగా సెటైర్లు వేసినట్టు జనం భావిస్తున్నారు. సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ వెంకయ్య నాయుడు రాజకీయాలకు అతీతంగా అందరి గుండెల్లో ప్రేమ పొందారని కితాబులు ఇచ్చారు. సోనియా సైతం విలువ ఇచ్చే నాయకుడిగా అభివర్ణించారు. కానీ నిజానికి గతంలో కొన్ని ప్రభుత్వ బిల్లులకు సంబంధించి విన్నపాలు చేయడానికి వెంకయ్యనాయుడు, సోనియా నివాసానికి వెళ్లినప్పుడు చేదు అనుభవాలే ఎదురై ఉన్నాయి. వీటితో పాటూ వెంకయ్యనాయుడు ఉన్నతస్థానాలకు వెళ్లినాస్నేహితుల్ని మరచిపోరని, నిబంధనలకు లోబడి సాయం చేస్తారని కామెంట్‌ చేశారు. ఈ ఇద్దరు నాయకులు నెల్లూరు జిల్లాకు చెందిన వారే. ''నిబంధనలకు లోబడి'' సాయం చేయడం అనే మాటలోనే చాలా గూఢార్థం ఉన్నదని, టి.సుబ్బరామిరెడ్డి ఆబ్లిగేషన్‌ లను బహుశా వెంకయ్యనాయుడు తొక్కేసి ఉంటే.. ఆయన ఇలా ఆవేదన చెందుతున్నారని జనం భావిస్తున్నారు. అయినా నోటితో పొగడుతూ నొసటితో వెక్కిరించడం అంటే ఇదేనేమో?

Show comments