అమరావతి నిర్మిస్తే ఒలింపిక్స్‌ నిర్వహించినట్లే...!

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని చాలామంది పరిపాలనాదక్షుడని అంటారు. రాజకీయ చాణక్యుడంటారు. విజన్‌ ఉన్న నాయకుడని పొగుడుతుంటారు. ఇదంతా ఆయన ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఉంందేమోగాని ఇప్పుడు అలాంటిది కనబడటంలేదు. అవశేష ఆంధ్రాకు ముఖ్యమంత్రి అయిన తరువాత ఆయన జస్ట్‌ 'షో మ్యాన్‌'గా కనబడుతున్నారు. పరిపాలన దక్షత ఉన్న ముఖ్యమంత్రిగా కంటే తనను తాను గొప్ప నాయకుడిగా ప్రచారం చేసుకోవడానికి సమయం వెచ్చిస్తున్నారు. ఆయనలో ప్రజలను మభ్యపెట్టే మాంత్రికుడు కనబడుతున్నాడు తప్ప వాస్తవికంగా ఆలోచించే మేధావి కనబడటంలేదు. 

ముఖ్యంగా  స్పష్టంగా కనబడుతున్న లోపం రాష్ట్రాభివృద్ధికి సంబంధించి ప్రధానంగా అమరావతి నిర్మాణం విషయంలో ప్రాధాన్యాలు తెలియకపోవడం. ప్రచార పటాటోపం అధికంగా ఉండటం. ఈ విషయంలో ఎన్ని విమర్శలు వస్తున్నా  ధోరణి మార్చుకోవడంలేదు. రకరకాల పైత్యాలు ముదిరిపోతున్న బాబుకు కొంతకాలంగా ఒలింపిక్స్‌ పైత్యం పట్టుకుంది.  ఎందుకో అర్థం కావడంలేదు. ఈ ధోరణి 'మింగ మెతకు లేదు మీసాలకు సంపెంగ నూనె' అన్నట్లుగా ఉంది. అసలు ఒలింపిక్స్‌ క్రీడలు నిర్వహించడమంటే పుష్కరాలు నిర్వహించడం అనుకుంటున్నారేమో. అవే సరిగా నిర్వహించలేకపోయారు. 

ఇక ఒలింపిక్స్‌ నిర్వహించాలని ఆశ ఎందుకు? అసలు దానిపై ప్రాథమిక జ్ఞానం లేకుండా ఒలింపిక్స్‌ నిర్వహిస్తామంటూ బాబు చేస్తున్న ప్రకటనలు చూస్తే ఈయన మేధావిత్వం ఏమిటో అర్థమవుతుంది. గతంలో ఓసారి ఒలింపిక్స్‌ నిర్వహణ గురించి మాట్లాడిన బాబు తాజాగా 'అమరావతిలో ఒలింపిక్‌ నగరం నిర్మిస్తాం' అని ప్రకటించారు. ఒలింపిక్‌ క్రీడల నిర్వహణకు అనుగుణంగా నగరం నిర్మించాలని తలపెట్టామన్నారు. అంతర్జాతీయ స్థాయిలో దీన్ని నిర్మిస్తామన్నారు. ఈ విషయంలో బార్సిలోనా నగర మేయర్‌ తన అనుభవాలను చంద్రబాబుకు చెప్పారట...! 

ఒలింపిక్‌ నగరం సంగతి తరువాత ముందు అమరావతి నగరం నిర్మిస్తే అదే పదివేలు. అనుకున్నవిధంగా రాజధాని కడితే ఒలింపిక్స్‌ నిర్వహించేనట్లే భావించాలి. ముందు దాని సంగతి చూడకుండా 'ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగిరిందట' అనే సామెతలా వ్యవహరిస్తే ఎలా? ఒలింపిక్స్‌ పైత్యం ఈయన బుర్రలోనే పుట్టిందా? ఎవరైనా సలహా ఇచ్చారా?  సరే...మాట వరసకు బాబు ఒలింపిక్స్‌ నిర్వహిస్తారనే అనుకుందాం. ఎప్పుడు నిర్వహిస్తారు? దీంట్లో రెండు రకాలున్నాయి. వింటర్‌, సమ్మర్‌ ఒలింపిక్స్‌. ఏది నిర్వహిస్తారు? 

ఒలింపిక్స్‌ నిర్వహించే నగరాన్ని ఎంపిక చేసే ప్రక్రియ, ఎంతకాలం ముందు ఎంపిక చేస్తారు? నగరానికి ఉండాల్సిన అర్హతలేమిటి? ఒలింపిక్స్‌ కోసం దేశాలు ఎలా పోటీ పడి బిడ్‌ దక్కించుకుంటాయి? ....ఇదంతా బాబుకు తెలుసా? అతి పెద్ద అంతర్జాతీయ క్రీడోత్సవమైన ఒలింపిక్స్‌ను దేశం నిర్వహిస్తుందిగాని రాష్ట్రం నేరుగా నిర్వహిస్తుందా?  భవిష్యత్తులో మన దేశానికి ఒలింపిక్స్‌ నిర్వహించే అవకాశం వస్తుందనే అనుకుందాం. అప్పుడు అమరావతినే ఎంపిక చేస్తారనే నమ్మకం ఏమిటి? 'ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం' అన్నట్లుగా ఏవేవో ఊహించుకొని ఒలింపిక్‌ నగరం నిర్మిస్తారా? 

ఒకవేళ నిర్మించాలనుకుంటే ఎన్ని వందల కోట్లు కావాలి? అమరావతి నిర్మాణానికే ముక్కీ మూల్గుతున్న చంద్రబాబు ఇంత ఓవరాక్షన్‌ చేయడం అవసరమా? బాబు అధికారంలో ఉండేది ఇంకా రెండున్నరేళ్లు మాత్రమే. వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కుతుందో లేదో తెలియదు. అది తెలియనప్పుడు అమరావతి నిర్మాణం కొంతవరకు పూర్తి చేసుకొని ఎన్నికల్లో ప్రచారం చేసుకోవాలిగాని ఒలింపిక్స్‌ గొడవెందుకు? ఈ ఒలింపిక్స్‌ గోల పక్కన పెట్టి చంద్రబాబు నేషనల్‌ గేమ్స్‌ (జాతీయ క్రీడలు) గురించి జనాలకు వివరణ ఇస్తే బాగుంటుంది. 

అవశేష ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి కాగానే 2019 జాతీయ క్రీడలను విజయవాడలో నిర్వహిస్తామని ప్రకటించారు. అందుకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? నేషనల్‌ గేమ్స్‌ అంటే ఆషామాషీ వ్యవహారం కాదు కదా...! పోనీ రాష్ట్రం ఆర్థికంగా బలంగా ఉండి, పూర్తిస్థాయిలో వసతులు సౌకర్యాలుంటే అది వేరే విషయం. కాని అవేమీ పట్టించుకోని బాబు జాతీయ క్రీడలు నిర్వహిస్తామని మెహర్బానీగా ప్రకటించారు. 

కాని ఇప్పటివరకు దీనిపై ఎప్పుడైనా మాట్లాడారా? రాష్ట్రంలో ఏ క్రీడలకూ సంబంధించి  అంతర్జాతీయస్థాయి ప్రమాణాల వసతి సౌకర్యాలు లేవు. ఒక్క విశాఖపట్నంలో మాత్రమే అంతర్జాతీయ క్రికెట్‌ పోటీలు నిర్వహించగల స్టేడియం ఉంది. విజయవాడలో క్రికెట్‌ స్టేడియం దశాబ్దాలుగా కాగితాల మీద ఉంది. రాష్ట్రంలో 30 స్టేడియంల  నిర్మాణం డబ్బు కొరత కారణంగా అసంపూర్తిగా ఉండిపోయాయి. బడ్జెటులో క్రీడలకు భారీగా నిధులు కేటాయించడంలేదు. ముందు ఈ పనుల గురించి ఆలోచించండి బాబుగారూ....!

Show comments