బాబూ...ఎవరు కట్టిన మురికివాడలివి...?

రాజధాని అమరావతి నిర్మాణాన్ని విదేశీ కంపెనీలకు ఎందుకు అప్పగిస్తున్నారు? నగరాన్ని నిర్మించే నిర్మాణ కంపెనీలు మన దేశంలోనూ ఉన్నాయి కదా...అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అడిగినప్పుడు 'మనోళ్లకు అప్పగిస్తే మురికివాడలు నిర్మిస్తారు' అని జవాబిచ్చారు. ఈ సంగతి అందరికీ తెలుసు. మురికివాడలను (స్లమ్స్‌) ప్రత్యేకంగా నిర్మిస్తారా? ఏ నిర్మాణ కంపెనీ కూడా మురికివాడలను పనిగట్టుకొని నిర్మించదు. మురికివాడలను నిర్మించేది పాలకులే. అంటే వారి నిర్లక్ష్యం, చేతగానితనం, అవినీతి, ముందుచూపు లేకపోవడం, పేదలపట్ల శ్రద్ధ లేకపోవడం...ఇలాంటి కారణాల వల్ల మురికివాడలు ఏర్పడతాయి.

 సంక్షేమ పథకాల గురించి పాలకులు అదేపనిగా ఊదరగొడుతున్నప్పటికీ మురికివాడల నిర్మూలన జరగడంలేదు. మురికివాడలను నిర్మూలించి వారందరికీ మంచి వసతి సౌకర్యాలు కల్పిస్తే సమస్యలుండవని, అవి లేకపోతే ఓట్లు పడవని పాలకుల భయమా? ఏ కారణంవల్లనైతేనేమి మురికివాడలను పాలకులు పట్టించుకోవడంలేదనేది వాస్తవం. అద్భుత రాజధాని అమరావాతి నిర్మించినా ఈ పరిస్థితి మారుతుందనే నమ్మకం లేదు. తాజా సమాచారం ప్రకారం...దేశం మొత్తం మీద అత్యధిక పట్టణ జనాభా మురికివాడల్లో నివసిస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ రికార్డు సృష్టించింది. 

దేశవ్యాప్తంగా 17.4 శాతం పట్టణ జనాభా మురికివాడల్లో నివసిస్తుండగా ఆంధ్రప్రదేశ్‌లో ఇది 38.3 శాతంగా ఉంది. అంటే జాతీయ సగటు కంటే ఇది రెండింతలు. ఇదంతా బాబు అధికారంలోకి వచ్చాకనే, గత రెండున్నరేళ్లలోనే జరిగింది కాదు. ఈ మురికివాడల పుట్టుకకు ఉమ్మడి ఆంధ్రలో దీర్ఘకాలం అధికారంలో ఉన్న కాంగ్రెసు, టీడీపీ ప్రభుత్వాలే కారణం. ఉమ్మడి ఆంధ్ర సీఎంగా చంద్రబాబు కూడా ఇందుకు బాధ్యత వహించాలి. అద్భుత రాజధాని అమరావతి అంటూ నిరంతరం ప్రచారం చేసుకుంటున్న చంద్రబాబు ఈ మురికివాడల గురించి ఎప్పుడైనా ఆలోచించారా? 

అమరావతిని మురికివాడలు లేని విదేశీ నగరంలా నిర్మించాలని ఆత్రపడుతున్న బాబు ఉన్న మురికివాడలను ఏం చేయాలనుకుంటున్నారో ఎప్పుడైనా చెప్పారా?  మురికివాడల్లో దేశం మొత్తం మీద ఏపీ టాప్‌లో ఉండగా, ఏపీలో కర్నూలు, విజయనగరం, గుంటూరు జిల్లాలు టాప్‌లో ఉన్నాయి. ఈ మురికివాడల్లోని ప్రజలు మంచినీటి సమస్యతో సహా అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. 17.64 మందికి మరుగుదొడ్లు లేవు. 40.26 మందికి సరైన ఇళ్లు లేవు. 9.29 మందికి వంట చేసుకునే సౌకర్యం లేదు. 13.67 శాతం మంది కట్టెల పొయ్యి మీద వంట చేసుకుంటున్నారు.  Readmore!

కర్నూలు, విజయనగరం, గుంటూరుల్లో వరుసగా 44.5, 44.2, 44.1 శాతం మంది మురికివాడల్లో జీవిస్తున్నారు. ఏపీలో పట్టణ జనాభా వేగంగా పెరగుతోంది. ప్రస్తుతం 30 శాతం ప్రజలు అర్బన్‌ ప్రాంతాల్లో ఉన్నారు. రాబోయే పదిహేనేళ్లలో ఇది 45 శాతానికి పెరిగే అవకాశముంది. పట్టణ ప్రాంతాల్లో జనాభా పెరగడానికి ప్రధాన కారణం గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల నుంచి వలసలు. పరిశ్రమలు, ఇతర ఉపాధి అవకాశాల్లేక నిరుద్యోగం పెరిగి జనం పెద్ద పట్టణాలకు, నగరాలకు తరలివస్తున్నారు. 

గత దశాబ్ద కాలంలో విశాఖపట్టణం, శ్రీకాకుళం, కడప, చిత్తూరు జిల్లాల్లో, విజయవాడ తదితర పెద్ద నగరాల్లో పట్టణ జనాభా మూడింతలు పెరిగింది. పట్టణ జనాభా విపరీతంగా పెరగడానికి మరో ప్రధాన కారణం వ్యవసాయ భూమి తగ్గిపోవడమే. వ్యవసాయ భూములన్నీ వ్యవసాయేతర పనులకు (పరిశ్రమలకు, రియల్‌ఎస్టేట్‌ మొదలైనవాటికి ఉపయోగించడం) ఉపయోగిస్తుండటంతో రైతులు, రైతు కూలీలు ఉపాధి కోసం పట్టణాలకు తరలుతున్నారు. గత పదేళ్లలో ఒక్క ఉభయ గోదావరి జిల్లాల్లోనే సుమారు 90 వేల ఎకరాల వ్యవసాయ భూమిని వ్యవసాయేతర పనుల కోసం సేకరించారు. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆంధ్రా జిల్లాల నుంచి ఉపాధి అవకాశాల కోసం అత్యధికంగా హైదరాబాదుకు వెళ్లేవారు. అయితే రాష్ట్ర విభజన తరువాత ఈ  వలసలు తగ్గాయి. దీంతో రాష్ట్రంలోని పెద్ద పట్టణాలు, నగరాలకు వలసలు పోతున్నారు. దీంతో మురికివాడలు పెరిగిపోతున్నాయి. అమరావతి గురించి నిరంతరం స్మరణ చేస్తున్న, దుబారా ఖర్చులు చేస్తున్న చంద్రబాబు మురికివాడలపై దృష్టి సారించకపోతే ఆంధ్రప్రదేశ్‌ 'మురికి రాష్ట్రం' అనే పేరొస్తుంది. ఈ సమాచారం విదేశాలకు పాకితే పెట్టుబడిదారులొస్తారా? అమరాతి ఒక్కటే విదేశీ నగరంలా ఉంటే చాలదు . ఆంధ్రప్రదేశ్‌ మొత్తం అద్భుమనిపించాలి కదా...!

Show comments

Related Stories :