వైసీపీని వీడను అంటున్న మరో ఎమ్మెల్యే!

ఇప్పటి వరకూ చాలా మంది ఎమ్మెల్యేలు తమ గురించి అసత్య ప్రచారం జరుగుతోందని అన్నారు. తమకు కోట్ల రూపాయలను ఎరగా వేసి తెలుగుదేశంలో చేరమని ఆఫర్లు వస్తున్నాయని  అన్నారు. ఫిరాయింపును నీతి మాలిన చర్యగా అభివర్ణించారు. అలా అభివర్ణించిన వారే.. తదుపరి కాలంలో ఫిరాయింపుకు పాల్పడ్డారు. 

భూమా నాగిరెడ్డి, జలీల్ ఖాన్, ఎస్వీ మోహన్ రెడ్డి… వీళ్ళంతా కూడా ఫిరాయింపు అంటే అంతకు మించిన పాపపు పని, పాపర్ పని లేదని అన్న వాళ్లే. ఫిరాయింపును వ్యభిచారంగా అభివర్ణించిన వాళ్లే. ఫిరాయించిన ఎమ్మెల్యేకు, వేశ్యకూ తేడా లేదని వ్యాఖ్యానించిన వాళ్లే. భూమా పార్టీ మారిన రోజు ఎస్వీ మోహన్ రెడ్డి టీవీలకు ఎక్కి సొంత బావను తిట్టాడు. అనంతర కాలంలో ఎస్వీ కూడా జంప్ చేశాడు!

దీంతో.. ఎవరైతే ఫిరాయింపును వ్యభిచారంగా అభివర్ణిస్తారో.. తదుపరి కాలంలో వాళ్లే ఆ కార్యాన్ని చేస్తారని అనుకోవాల్సి వస్తోంది. ఎవరైతే పార్టీ మారమూ అని కచ్చితంగా చెబుతారో.. వారిని అనుమానించని తప్పని పరిస్థితి నెలకొంది!

ఇప్పుడు తను వైకాపాను వీడను అని అంటూ వార్తల్లోకి వచ్చారు కృష్ణా జిల్లా తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధి. తను వైకాపాను వీడనున్నట్టుగా వచ్చిన వార్తలను ఖండించారు. తనను తెలుగుదేశం చేరమని కూడా ఎవరూ అడగలేదని ఈయన స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో కూడా తను వైకాపా తరపు నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు.

తెలుగుదేశంలోకి ఫిరాయింపుల తీరును చూస్తుంటే.. టీడీపీ వాళ్లు ఎస్సీ రిజర్వ్ డ్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలను ఎక్కువగా కాన్సన్ ట్రేట్ చేసినట్టుగా స్పష్టం అవుతోంది. టీడీపీ నుంచి వెళ్లి వైకాపా తరపున ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్లు, ఎస్సీ రిజర్వ్ డ్ నియోజకవర్గాల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను ఆకర్షించడానికి టీడీపీ చాలా ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తోంది. తిరువూరు కూడా ఎస్సీ రిజర్వ్ డ్ నియోజకవర్గమే! కాబట్టి.. అనుమానాలు మరింత బలపడుతున్నాయి. 

Show comments