పెద్ద నోట్ల రద్దు అంశాన్ని 'మేగ్జిమైజ్' చేసేందుకు విపక్షాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. నల్లధనాన్ని అరికట్టడం.. అనే ముఖ్య ఉద్దేశ్యంతోపాటుగా, తీవ్రవాదుల చేతుల్లోకి మన కరెన్సీ ఏ రూపంలో అయినా వెళ్ళకుండా చేసేందుకోసం పెద్ద నోట్ల రద్దు అంశాన్ని ప్రధాని నరేంద్రమోడీ తెరపైకి తెచ్చిన విషయం విదితమే. ఆలోచన మంచిదే అయినా, ఆచరణలో మాత్రం అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ సమస్యల్ని ముందుగా అడ్రస్ చేయలేకపోవడం నరేంద్రమోడీ సర్కార్ వైఫల్యమే.
పదిహేను రోజులు గడస్తున్నా, దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొనలేదింకా. ఏటీఎంలు పూర్తిస్థాయిలో పనిచేయడంలేదు. బ్యాంకుల సంగతి సరే సరి. చిన్న వ్యాపారాలు పూర్తిగా చితికిపోయాయి. వ్యాపార కార్యకలాపాలు దాదాపుగా స్తంభించిపోయాయి. ఒక్కమాటలో చెప్పాలంటే, దేశం ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేయబడ్తోంది. అయితే, బ్యాంకులు మాత్రం పండగ చేసుకుంటున్నాయి.. ఎన్నడూ లేని విధంగా వస్తోన్న డిపాజిట్లతో. బ్యాంకుల్లో చేరుతున్న డిపాజిట్లను చూసి మురిసిపోవడానికి వీల్లేదు. డబ్బులు తీసుకునేందుకు తగిన అవకాశాలు పూర్తిస్థాయిలో లేకపోవడంతో బ్యాంకుల్లో డిపాజిట్ల రూపంలో డబ్బు కన్పిస్తోంది తప్ప, అవి డిపాజిట్లు.. అనుకోవడానికి వీల్లేని పరిస్థితి.
దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో విపక్షాలు 'పొలిటికల్ అడ్వాంటేజ్' కోసం ప్రయత్నిస్తున్నాయి. దాన్ని నిలువరించేందుకు మోడీ, 'యాప్'ని తీసుకొచ్చి, దాని ద్వారా పబ్లిసిటీ స్టంట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. 'మా నిర్ణయాన్ని 93 శాతం స్వాగతిస్తున్నారు..' అంటూ బీజేపీ నేతలు చెబుతోంటే, 'బస్తీ మే సవాల్.. అదో ఫాల్తు పబ్లిసిటీ.. మీ నిర్ణయం మీద మీకు గొప్ప గౌరవం, నమ్మకం వుంటే.. అది విజయవంతమైన నిర్ణయం అయితే పార్లమెంటుని రద్దు చేసి ఎన్నికలకు వెళ్దాం పదండి..' అంటూ ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతి సవాల్ విసిరేశారు.
మాయావతి మాత్రమే కాదు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ - నరేంద్రమోడీ సర్కార్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు. కాంగ్రెస్ సైతం వారితో గొంతు కలుపుతుండడం గమనార్హం. ఊహించని ఈ సవాళ్ళతో బీజేపీ ఉక్కిరిబిక్కిరవుతోంది. పార్లమెంటుకు మొహం చూపించలేకపోతున్న ప్రధాని.. అంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలతో, బీజేపీ అధిష్టానం, ప్రధాని నరేంద్రమోడీని చట్ట సభలకు పంపాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
నేడో రేపో ప్రధాని నరేంద్రమోడీ, లోక్‌సభలోనో, రాజ్యసభలోనో ఈ వ్యవహారంపై స్పందించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ప్రధాని స్పందన ఎలా వున్నా విపక్షాల రాద్ధాంతం మామూలేననుకోండి.. అది వేరే విషయం.
ఏదిఏమైనా, పెద్ద నోట్ల రద్దు వ్యవహారం.. నరేంద్రమోడీ సర్కార్‌కి పెద్ద చిక్కే తెచ్చిపడింది. పులి మీద స్వారీ మొదలైపోయింది.. ఇక, దాని మీద నుంచి దిగడానికి వీలేని పరిస్థితి. మరి, తానే సృష్టించుకున్న ఈ సంక్షోభం నుంచి ప్రధాని నరేంద్రమోడీ ఎలా గట్టెక్కుతారు.? వేచి చూడాల్సిందే.