నాన్నకు ప్రేమతో సినిమా బిజినెస్ ఎప్పుడో క్లోజ్ అయింది కదా..ఇప్పుడు వెనక్కు రావడం ఏమిటి? షేర్ ఏమన్నా పెండింగ్ వుండి కొత్తగా వచ్చిందా అన్న అనుమానం రావచ్చు..కానీ విషయం అది కాదు ముచ్చట..విదేశాల్లో షూటింగ్ చేస్తే వచ్చే రిబేటు అన్నమాట. యూరప్ లోను మరికొన్ని దేశాల్లోనూ షూటింగ్ చేసిన తరువాత, అక్కడ జరిపిన మొత్తం ఎక్స్ పెన్ డిచర్ వివరాలు ఆ దేశంలోని సంబంధిత శాఖలకు అందించాల్సి వుంటుంది.
ఆ దేశంలో ఖర్చు పెట్టిన ప్రతి పైసా అన్నమాట. అలా జరిపిన ఖర్చులో కొంత శాతం మొత్తాన్ని ఆ దేశం వెనక్కు ఇస్తుంది. అలా ఇటీవల నాన్నకు ప్రేమతో యూనిట్ కు 8 కోట్ల వరకు వచ్చినట్లు తెలుస్తోంది.మన సినిమాలు కొన్ని ఎక్కువ భాగం విదేశాల్లో షూట్ చేయడం వెనుక ఈ మర్మం కూడా వుంది. శాతకర్ణి సినిమా జార్జియాలో చేయడం వెనుక కూడా ఈ ధర్మసూక్ష్మం వుందట. ఆ దేశం ముఫై శాతం ఖర్చును వెనక్కు ఇస్తుందట.
పైగా మన దగ్గర షూటింగ్ అంటే సవాలక్ష అనుమతులు కావాలి. అంతకు మించి ఔట్ డోరో షూటింగ్ అంటే సంబంధిత పోలీస్ స్టేషన్లలో ఫిక్స్ డ్ మామూళ్లు కూడా వుంటాయని టాక్ వుంది. ఇక్కడ షూట్ కన్నా విదేశాల్లో షూట్ నే బెటర్ అనుకుంటున్నారు సినిమా జనాలు.