మంత్రి నారాయణపై మండిపడుతున్న తమ్ముళ్లు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశానికి దక్కిన పరాభవానికి ఎవరో ఒకరు బాధ్యత వహించాల్సిందే. ఉపాధ్యాయ- పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పప్పులు ఉడకలేదు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో.. నికార్సుగా తమ పార్టీకి చెందిన ఓట్లు తక్కువే ఉన్నప్పటికీ.. కొందరు రాజకీయ నాయకులతో బేరసారాలు సక్సెస్‌ఫుల్ గా చేస్తే సరిపోతుంది గనుక.. తెలుగుదేశం పార్టీ.. తమ అభ్యర్థుల్ని మోహరించి విజయం సాధించింది. అదే విద్యావంతులు, ప్రభుత్వ పరిపాలనలోని లొసుగులను సరిగ్గా అర్థం చేసుకోగల వారు ఉండే పట్టభద్ర, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో మాత్రం పార్టీ బోల్తా కొట్టింది. వాస్తవమైన ప్రజాభిప్రాయం ప్రతిబింబించే అవకాశం ఉన్నచోట వారికి దెబ్బ పడింది. ఒక్కో పరాజయానికి ఒక్కో సాకు చెప్పి వారు తప్పించుకోవచ్చు గానీ.. నెల్లూరు జిల్లా పరిధిలో పరాజయాలకు మాత్రం మంత్రి నారాయణ చేతగానితనమే కారణం అని తెలుగుదేశం పార్టీ నాయకులే వ్యాఖ్యానిస్తున్నారట. ఏమాత్రం మంచి పేరు లేని వ్యక్తులను తన అనుచరులు, తన తొత్తులు అనే క్వాలిఫికేషన్ తో ఎన్నికల టికెట్ ఇప్పించుకుని పోటీకి నిలబెట్టడం వల్ల ఇలాంటి పరాజయం తప్పలేదని వారు వ్యాఖ్యానిస్తున్నారట. 
నెల్లూరు- చిత్తూరు- ప్రకాశం జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి పార్టీలోని ఇతర నాయకుల నుంచి ఎంత వ్యతిరేకత ఉన్నప్పటికీ.. మంత్రి నారాయణ తన అనుచరిగా పేరున్న వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డికి టిక్కెట్ ఇప్పించుకున్నారు. ఆయనకు టిక్కెట్ ఇవ్వడంతోనే తెదేపా ఓడిపోయినట్లు అయిందని, పట్టాభిరామిరెడ్డికి అసలు ఏ వర్గాల్లోనూ ఎలాంటి మంచి పేరు లేదని.. పార్టీ అధిష్టానంపై మంత్రి నారాయణ ఒత్తిడి తెచ్చి టిక్కెట్ ఇప్పించుకున్నారని పలువురు ఇప్పుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ పీడీఎఫ్ అభ్యర్థి యండపల్లి శ్రీనివాసులురెడ్డి గెలిచారు. 

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ విషయంలో కూడా పార్టీలో చాలా మంది అసలు పోటీనే వద్దని వారించే ప్రయత్నం చేసినప్పటికీ పట్టించుకోకుండా.. మంత్రి నారాయణ మాట మేరకే వాసుదేవనాయుడును నిలబెట్టారు. మంత్రి నారాయణ నెల్లూరు జిల్లాకు చెందిన వారు, చిత్తూరు జిల్లాకు ఇన్‌ఛార్జి ఇలా రెండు జిల్లాల్లో ఆయన హవా చూపించి నెగ్గించగలరని అనుకున్నారు. కానీ.. నారాయణ మీద డిపెండ్ కావడం వల్లనే పరాజయం వరించిందని పార్టీలో ఇప్పుడు గుసగుసలు వినిపిస్తున్నాయి.

బుధవారం సాయంత్రం అమరావతిలో నెల్లూరు జిల్లా నాయకులతో చంద్రబాబునాయుడు సమీక్ష సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కూడా పలువురు నాయకులు, లోకల్ గా నారాయణ తో విభేదాలు ఉన్నవారు ఆయన మీద ఆరోపణలు చేయబోతున్నట్లుగా పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు ఈ పరిస్థితుల్ని ఎలా చక్కదిద్దుకుని, ప్రజల్లో తమ పట్ల ఉన్న వ్యతిరేకతను తగ్గించుకోగలరో చూడాలి. 

Show comments