'నేను పంజాబీనే.. అయినా తెలుగుమ్మాయిలా వుండాలనుకుంటున్నాను.. ఎప్పటికీ..' అంటూ ముద్దు ముద్దుగా 'ధృవ' ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో తెలుగులో మాట్లాడేసింది పంజాబీ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. తెలుగు సినిమాల్లో నటించే హీరోయిన్లు, తెలుగు నేర్చుకోవడంలో అంతగా ఇష్టం చూపించరు ఇప్పటికీ. అయితే, గతంతో పోల్చితే ఇప్పుడు చాలా బెటర్.
నయనతార తెలుగులో డబ్బింగ్ ఓ సినిమాకి చెప్పినా, ఆమె తెలుగులో మాట్లాడింది లేదు. త్రిష సంగతి సరే సరి. శ్రియ కూడా అంతే. కాజల్ తెలుగులో కొంచెం కొంచెం మాట్లాడగలదుగానీ, మాట్లాడదు. సమంత మాత్రం తెలుగులోనే మాట్లాడుతుంది. డబ్బింగ్ చెప్పుకోలేదు. నిత్యామీనన్ తెలుగులో మాట్లాడటం, డబ్బింగ్ చెప్పుకోవడమే కాదు, పాటలు కూడా పాడేస్తుంది.
రకుల్ విషయానికొస్తే, ఇప్పటికే డబ్బింగ్ చెప్పేసుకున్న ఈ అందాల భామ, తాను పంజాబీనే అయినా, ఆ విషయం మర్చిపోయి, తెలుగుమ్మాయిలా మారిపోయాననీ, తెలుగుమ్మాయిలానే వుండాలనుకుంటున్నాననీ, తమిళ సినిమాల్లో నటించడం ద్వారా అక్కడ పాపులర్ అయినా, ఎప్పటికీ తెలుగమ్మాయినేనని ఉద్వేగంగా మాట్లాడేసింది. నిజమే, రకుల్ మాట్లాడేటప్పుడు తన మాటల్లో ఎక్కడా ఇంగ్లీషు దొర్లకుండా జాగ్రత్తపడ్తుంది. తెలుగుకి ఇంత గౌరవమిస్తున్న రకుల్‌కి హేట్సాఫ్ చెప్పకుండా వుండలేం కదా.!