దేశంలో సార్వత్రిక ఎన్నికలు వచ్చినా, రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు వచ్చినా చాలాకాలం ముందునుంచే మీడియాకు చేతి నిండా పనుంటుంది. రకరకాల విశ్లేషణలు వస్తుంటాయి. ముఖ్యంగా ప్రాంతీయ మీడియా సంస్థలతోపాటు జాతీయ మీడియా సంస్థలు కూడా సర్వేలు చేస్తుంటాయి. ఉత్తరప్రదేశ్ వంటి కీలక రాష్ట్రమైతే ఇంక చెప్పక్కర్లేదు. ఇప్పుడక్కడ అదే జరుగుతోంది. వచ్చే ఏడాది యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతుండటంతో (దీంతోపాటు మరికొన్ని రాష్ట్రాల్లో జరుగుతాయి) మీడియా హడావుడి చాలాకాలం కిందటే మొదలైంది. ఇది పెద్దది, రాజకీయంగా కీలక రాష్ట్రం కావడమే కాకుండా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో ఎవరు అధికారంలోకి రావాలో నిర్ణయించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.
అందుకే ఈ రాష్ట్రంపై రాజకీయ పార్టీలకు, మీడియాకు ఆసక్తి ఎక్కువ. ఈ రాష్ట్రంలో వివిధ పార్టీల భవిష్యత్తుపై ఇప్పటికే పలు సర్వేలు జరిగాయి. ప్రజాభిప్రాయాన్ని మీడియా ఎప్పటికప్పుడు తెలుసుకొని పరిస్థితిని అంచనా వేస్తోంది. రాజకీయ పరిణామాలు, ప్రజాభిప్రాయం ఎప్పటికప్పుడు మారతుంటాయి కాబట్టి సర్వేలు జరుగుతూనే ఉంటాయి. తాజాగా జరిగిన ఒక సర్వే ద్వారా రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందా? అనే అనుమానం కలుగుతోంది. రాష్ట్రంలో ప్రధాన పార్టీ అయిన బహుజన సమాజ్ పార్టీ (బీఎస్‌పీ) సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించవచ్చని తాజాగా జరిగిన ఓ సర్వే అంచనా వేసింది.
'పార్లమెంటేరియన్' అనే పత్రిక 'మూడ్ ఆఫ్ యూపీ సర్వే' పేరుతో ప్రజాభిప్రాయ సేకరణ జరిపింది. ఈ సర్వేలో అధికార సమాజ్‌వాదీ పార్టీ భారీగా నష్టపోయే అవకాశముందని, దాదాపు 150 స్థానాలు కోల్పోవచ్చని తెలిసింది. ఎస్‌పీ కోల్పోయే స్థానాలను బీజేపీ, బీఎస్‌పీ పంచుకుంటాయని అంచనా. మొత్తం 403 అసెంబ్లీ స్థానాల్లో బీఎస్‌పీ 89 స్థానాలు సాధించవచ్చని అంచనా. ప్రస్తుతం దానికి 80 స్థానాలున్నాయి. ప్రస్తుతం 47 స్థానాలున్న బీజేపీ 88 సీట్లు సాధించవచ్చని తెలుస్తోంది.
గత ఎన్నికల్లో 28 సీట్లు సాధించిన కాంగ్రెసు పార్టీ వచ్చే ఎన్నికల్లో 13 స్థానాలకు పరిమితమవుతుందని అంచనా. ఈ సర్వే ప్రకారం 39 శాతం మంది ఓటర్లు అఖిలేష్ యాదవ్ పనితీరు అసలు బాగాలేదని చెప్పారు. 33 శాతం మంది ఫర్వాలేదన్నారు. 28 శాతం మంది 'గుడ్' అని సర్టిఫికెట్ ఇచ్చారు. ఇక బీఎస్‌పీ విషయానికొస్తే దాని అధినేత మాయావతి ముఖ్యమంత్రి కావాలని 28 శాతం మంది ఓటర్లు కోరుకుంటున్నారు. అఖిలేష్ మళ్లీ సీఎం కావాలని 25 శాతం మంది కోరుకున్నారు. బీజేపీ నాయకుడు, కేంద్ర మంత్రి మేనకా గాంధీ కుమారుడు వరుణ్ గాంధీ ముఖ్యమంత్రి కావాలని 23 శాతం మంది అభిప్రాయపడ్డారు.
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కలిపి ఇరవైఐదు వేల మంది అభిప్రాయాలను పార్లమెంటేరియన్ పత్రిక సేకరించింది. ఈ సర్వే ఫలితాలను బట్టి చూస్తే మాయావతికి ఆదరణ పెరుగుతున్నట్లు అర్థమవుతోంది. ఎస్‌పీలో, తద్వారా ములాయం సింగ్ కుటుంబ సభ్యుల్లో తలెత్తుతున్న విభేదాలు ఎన్నికలపై ప్రభావం చూపించే అవకాశాలున్నాయి. ఈమధ్య కాలంలో అధికార పార్టీలో, ప్రభుత్వంలో లుకలుకలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఇక యూపీలో జరుగుతున్న ప్రతీ సర్వేలోనూ కాంగ్రెసు పరిస్థితి దయనీయంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ పార్టీ అధికారంలోకి రావడం కల్ల అని సర్వేలు చెబుతున్నాయి.
ప్రధానిగా నరేంద్ర మోదీని, బిహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్‌ను అధికారంలోకి తేవడానికి వ్యూహాలు రచించిన ప్రశాంత్ కిషోర్. కాంగ్రెసు ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఇంత భారీ ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు ఒకవేళ కాంగ్రెసు అధికారంలోకి రాలేకపోయినా గట్టి పోటీ ఇస్తుందని, చెప్పుకోదగ్గ స్థానాలు సంపాదిస్తుందని ఎవ్వరైనా అనుకుంటారు. కాని కొంతకాలం క్రితం వెలువడిన ఓ మీడియా సంస్థ సర్వే వివరాలు కాంగ్రెసు పార్టీ దారుణ, దయనీయ స్థితిని తెలియచేశాయి.
హఫ్‌పో-సి ఓటర్ సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్రంలో రాండమ్ సర్వే జరిగింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెసుకు వచ్చే స్థానాలు ఎన్నో తెలుసా? 5-13 స్ధానాలు. 403 అసెంబ్లీ స్థానాలున్న యూపీలో ఓ జాతీయ పార్టీ సాధించాల్సిన స్థానాలేనా ఇవి? ఇవి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వచ్చే స్థానాలు. అసలు అసెంబ్లీ ఎన్నికల్లో ఇంతకంటే ఎక్కువ రావొచ్చు. అయినప్పటికీ కాంగ్రెసు దయనీయ స్థితిని ఈ సర్వే తెలియచేస్తోంది.