జనసేన పరీక్ష: ఉత్తరాంధ్ర, హైద్రాబాద్‌లలో

జనసేన పార్టీ పరీక్షలు మొన్నీమధ్యనే అనంతపురం జిల్లాలో జరిగిన విషయం విదితమే. భారీ స్థాయిలోనే అభిమానులు ఆ పరీక్షలకు హాజరయ్యారు. ఆ ఉత్సాహంతో ఇప్పుడు ఉత్తరాంధ్రతోపాటు, హైద్రాబాద్‌లోనూ పరీక్షలు నిర్వహించేందుకు జనసేన సిద్ధమయ్యింది. అయితే, ఈ పరీక్షలు 'టాలెంట్‌'కి కొలమానంలా భావించవద్దనీ, ప్రజాసేవ కోసం జరుగుతున్న ఈ పరీక్షల ద్వారా రాజకీయాల్లోకి మంచి ఆలోచనలున్నవారిని తీసుకురావడమే తమ ఉద్దేశ్యమని పవన్‌కళ్యాణ్‌ ప్రకటించారు. 

2019 ఎన్నికల్లో జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్‌ నుంచి పోటీ చేయడం దాదాపు ఖాయమైపోయింది. అయితే, తెలంగాణ విషయంలో ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. ఆ సందిగ్ధానికి తెరదించేందుకు హైద్రాబాద్‌లోనూ జనసేన 'నియామక పరీక్షలు' జరగనున్నాయన్నమాట. హైద్రాబాద్‌, ఉత్తరాంధ్ర నియామక పరీక్షలు పూర్తయ్యాక, మిగతా జిల్లాలపై దృష్టిపెట్టనున్నారు. 

మరోపక్క, వివిధ అంశాలపై జనసేన పార్టీ తరఫున పవన్‌కళ్యాణ్‌, పత్రికా ప్రకటనలు విడుదల చేస్తూ తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తుండడం గమనార్హం. మిర్చి ధరల విషయంలోనూ, గ్రూప్స్‌ పరీక్షల విషయంలో అభ్యర్థుల ఆందోళనల్ని పరిగణణలోకి తీసుకోవాలని చంద్రబాబు సర్కార్‌పై ఒత్తిడి తీసుకురావడంలోనూ పవన్‌ తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. అయితే, సోషల్‌ మీడియాలో స్పందించడం, పత్రికా ప్రకటనలు విడుదల చేయడం ద్వారా రాజకీయంగా అది జనసేనకి ఎంత ఉపయోగం.? తద్వారా ప్రజా సమస్యలు ఎంతవరకు పరిష్కారమవుతాయి.? అన్న విషయమై భిన్నాభిప్రాయాలు మామూలే. 

మొత్తమ్మీద, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకుగాను, ముందస్తుగా నియామకాల ప్రక్రియ చేపడ్తున్న జనసేన పార్టీ, అభిమానుల నుంచి మంచి స్పందననే రాబట్టుకుంటోంది. అయితే, ఈ పరీక్షల ద్వారా జనసేన రాజకీయంగా బలోపేతమవుతుందా.? అన్నది ప్రస్తుతానికైతే మిలియన్‌ డాలర్ల ప్రశ్నే.

Show comments