ఎర్రబెల్లి చేసిందే.. జానా చేస్తున్నాడా?!

జానా రెడ్డి… కాంగ్రెస్ పార్టీ కి వరమా శాపమా? కాంగ్రెస్ కు నేషనల్ లెవల్లో తెలుగు రాష్ట్రం లెవల్లో అధికారం చేతిలో ఉండిన రోజుల సంగతేమో కానీ .. ఇప్పుడు మాత్రం జానా రెడ్డి తీరు ఏ మాత్రం సమర్థనీయం కాకుండాపోయింది. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగానే కాదు.. సీఎల్పీ లీడర్ గా కూడా జానారెడ్డి దారుణంగా విఫలం అయ్యాడనే వ్యాఖ్యానాలు కాంగ్రెస్ నేతలే చేస్తుంటారు!

అసలు రెండేళ్ల కిందట తెలంగాణ తొలి అసెంబ్లీ ఏర్పడినప్పుడు జానాను సీఎల్పీ లీడర్ గా ఎన్నుకోవడాన్ని చాలా మంది వ్యతిరేకించారు. ఏదో బలవంతంగా ఆ సీటను ఆక్రమించినట్టుగా.. మొహమాటంతో పైకి చెప్పలేని వారిని మధ్య వాళ్లందరి అభిప్రాయాన్నీ పట్టించుకోకుండా.. జానా రెడ్డి సీఎల్పీ సీటును ఆక్రమించినట్టు అనిపించింది. 

అప్పటి మొదలు.. అనేక మంది అనేకసార్లు  జానా నాయకత్వం పట్ల విమర్శలు చేస్తూనే ఉన్నారు. తనకు కేసీఆర్ అసెంబ్లీలో గౌరవం ఇస్తున్నాడని.. ఆ గౌరవం కోసం అయినా తను కేసీఆర్ ను విమర్శించకూడదని.. జానా రెడ్డి చేసిన వ్యాఖ్య అత్యంత బాధ్యతారాహిత్యమైదనిగా పేరు తెచ్చుకుంది. ఇలాంటి వ్యక్తి ప్రతిపక్ష నేతగా ఉంటే.. అధికారంలో ఉన్న పార్టీ అంత కన్నా కోరుకునేది ఏమీ ఉండదని కూడా వేరే చెప్పనక్కర్లేదు!

ఇలా రెండేళ్లలో సీఎల్పీకి లీడర్ గా జానానే ఉన్నాడు కానీ.. సీఎల్పీలో సభ్యులు మాత్రం సగం మంది మాయం అయ్యారు. అంతా తెరాస బాట  పట్టారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు జానా రెడ్డి విషయంలో కొత్త మాట వినిపిస్తోంది. తెలుగుదేశం పార్టీలో మొన్నటి వరకూ ఎర్రబెల్లి దయాకరరావు ఎలాంటి పాత్ర పోషించాడో ఇప్పుడు కాంగ్రెస్ లో జానా రెడ్డి అలాంటి రోలే పోషిస్తున్నాడనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. Readmore!

తుది కంట వరకూ తెలుగుదేశంలో ఉంటానని ప్రతినబూనిన ఎర్రబెల్లి.. చాలా మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలను టీడీపీ గేటు దాటించడంలో ఎనలేని కృషి చేశాడని అంటారు. ఒకవైపు ప్రెస్ మీట్లలో కేసీఆర్ పై విరుచుకుపడుతూనే.. ఫిరాయింపుల విషయంలో కేసీఆర్ తీరుపై దుమ్మెత్తిపోస్తూనే.. దాదాపు తెలుగుదేశం ఎమ్మెల్యేలు అంతా తెరాస తీర్థం పుచ్చుకున్నాకా.. ఎర్రబెల్లి జంప్ అయ్యాడు.

జానా రెడ్డి కూడా ఇదే కోవకు చెందిన వ్యక్తే అని.. దాదాపు కాంగ్రెస్ లోని ఎమ్మెల్యేలు అంతా తెరాస కాంపౌండ్ లో చేరిపోయాకా.. ఈ పెద్దమనిషి నింపాదిగా తెరాస తీర్థం పుచ్చుకుంటాడని నల్లగొండ జిల్లాకు చెందిన  కాంగ్రెస్ నేతలు అంటున్నారు. జానాను నమ్మడానికి లేదని.. సీఎల్పీ లీడర్ అనే హోదాతో అయన తెరాసలో చేరిపోతే.. కాంగ్రెస్ కు ఇక్కడ సమాధి ఏర్పడిందని జాతీయ స్థాయిలో  ప్రచారం వస్తుందని.. అందుకని ఆ ముహూర్తం లోపే జానాను ఆ పదవి నుంచి తప్పించాలని ఇప్పటికీ కాంగ్రెస్ కు విధేయతతో ఉన్న నేతలు కోరుతున్నారు! అయినా వీరి ఆక్రందన వినిపించేదెవరికి?!

Show comments

Related Stories :