ఎమ్మెల్యేలపై బాబు నిఘా?

ఏ పరిస్థితినైనా తనకు అనుకూలంగా మార్చుకోవడంలో చంద్రబాబు నాయుడు అంత ఘనుడు, ఘటికుడు వర్తమాన రాజకీయాల్లో మరెవరు లేరేమో?

పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని ప్రకటన రాగానే, తనదే ఆ రికమెండేషన్ అంటూ స్టేట్ మెంట్ పడేసారు. కానీ తీరా జనాలు ఆ చర్యతో ఇబ్బందులు ఎదుర్కొంటుంటే, సైలెంట్ అయిపోయారు. కానీ తెరవెనుక మాత్రం చంద్రబాబు ఈ విషయంలో ఫుల్ స్కీమ్ తో బిజీగా వున్నారని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

మొత్తం తెలుగుదేశం మంత్రులు, ఎమ్మెల్యేలలో ఎవరి దగ్గర నల్లధనం వుండిపోయింది. దాన్ని ఎలా మారుస్తున్నారు. ఎంత వుంది..ఇత్యాది వివరాలను ఆరా తీసి నివేదిక ఇవ్వమని నిఘా వర్గాలను బాబు ఆదేశించారట.

తమ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఏ మేరకు సంపాదిస్తున్నారన్నది బాబుకు తెలియంది కాదు. ఇసుక దందాలు, ఎమ్మెల్యేల నిధుల అలాట్ మెంట్లు, బదిలీలు, ఇంకా చాలా చాలా వ్యవహారాల ద్వారా వీళ్లంతా భారీగానే ఆర్జనలు చేస్తున్నారని ఆయనకు తెలియంది కాదు.

కానీ పదేళ్లు ప్రతిపక్షంలో వున్నపుడు పార్టీని బతికించడానికి వీళ్లంతా ఎంత ఎంత ఖర్చు చేసారో కూడా తెలుసు. అందుకే అలా అలా జస్ట్ హెచ్చరికలు చేస్తూ వదిలేసారు. దానివల్ల భారీగా అవినీతి పెరిగిందని, బాబు అనుకూల మీడియా కూడా కోడై కోసింది.

ఇప్పుడు చంద్రబాబు నిఘా వర్గాలను ఆదేశించి, ఎమ్మెల్యేలు, మంత్రులు, నాయకుల నల్లధనంపై నిఘా పెట్టారన్నది రాజకీయ వర్గాల గుసగుస. కానీ దీని వెనుక బాబు కు వేరే కారణాలు వున్నాయని తెలుస్తోంది.

మంత్రి వర్గ విస్తరణ, మళ్లీ ఎన్నికలు వచ్చినపుడు టికెట్ ల కేటాయింపు, మళ్లీ  ఎన్నికల సమయంలో పార్టీ ఫండ్ సేకరణ  ఇలాంటి అనేక బహుళార్థక ప్రయోజనాలు వున్నాయని రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. ఎప్పడు తనకు అందుతున్న సమాచారాన్ని ఆయన అప్పటికప్పుడే విశ్లేషించి, వెంటనే వారికి తనకు విషయం తెలిసిందని హెచ్చరిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇలా హెచ్చరించడం ద్వారా, తనకు విషయాలు తెలుసని, వివరాల ఫైళ్లు తన దగ్గరున్నాయన్న విషయాన్ని బాబు వారికి తెలియచెప్పినట్లు అవుతోంది. భవిష్యత్ లో జస్ట్ కొంచెమైనా ఈ నాయకులు కట్టు తప్పకుండా ఈ ఫైళ్లు కట్టుతాళ్లలా పనిచేస్తాయని, అదే బాబు వ్యూహమని తెలుస్తోంది. ఏమైనా బాబు ఘటికుడే.

Show comments