జైట్లీ జీ.. ఏమిటి ఈ చిల్లర రాజకీయం!

గౌరవనీయమైన ఆర్థిక శాఖ మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి మీరు. దేశంలోని కొన్ని కోట్ల మంది ఆశలు, ఆలోచనలు, ఆర్థిక వ్యవహారాలను, 120 కోట్ల మంది దైనందిన ఆర్థిక  వ్యవహారాలను, దేశ ఆర్థిక ప్రగతిని, దేశంలోని వ్యాపార వర్గాల మనుగడను.. నిర్దేశించే వ్యక్తి మీరు. వ్యక్తిగతంగా కాదు, ఆ పదవిలో ఉన్న వ్యక్తి ఒక శక్తి. మీరు కాకుండా.. ఏ ఎల్లయ్య, పుల్లయ్య.. ఆ సీటులో కూర్చున్నా ఎంతో బాధ్యతాయుతమైన స్థాయిలో ఉన్నట్టే.

మరి అంత బాధ్యతాయుతమైన స్థాయిలో ఉండాల్సిన మాటలా ఇవి? నోట్ల రద్దుతో కాంగ్రెస్ వాళ్లకు ఇబ్బందిగా మారింది.. అంటూ జనాల కళ్లు తెరిపిస్తున్నట్టుగా, తనేదో బ్రహ్మాండాన్ని కనుగొన్నట్టుగా మాట్లాడాడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ.

కుంభకోణాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇది మింగుడుపడని నిర్ణయమని.. ఫక్తు రాజకీయం మాటలు మాట్లాడాడు అరుణ్ జైట్లీ. నిజమే కావొచ్చు, కాంగ్రెస్ పార్టీ అవినీతి మరకల గురించి రాజకీయ విమర్శలు చేస్తూ కూర్చోవడం ఇప్పుడు మీ పని కాదు.

నోట్ల రద్దుతో కాంగ్రెస్ పార్టీ వాళ్లే ఇబ్బందులు పడుతున్నారు.. అనడం మూర్ఖత్వపు స్థాయిని సూచిస్తోంది, ప్రజల ఇక్కట్లను పట్టించుకోకుండా.. రాజకీయ ఎదురు దాడికి మీరు ప్రాధాన్యం ఇస్తున్నారని అనుకోవాల్సి వస్తోంది. కొన్ని కోట్ల మంది అర్ధరాత్రులకే బ్యాంకుల ముందుకు చేరుతున్నారు, చలికి రోడ్లపై పడుకుని.. ఎప్పుడు తెల్లారుతుందా, ఈ చీకటి ఎప్పుడు పోతుందా అని ఎదురుచూస్తున్నారు.

ఏమాత్రం శాస్త్రీయ అధ్యయనం, ఆలోచనలు లేకుండా… మీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఫలితంగా ఏర్పడి దుస్థితి నెలన్నర గడుస్తున్నా తొలగడం లేదు. అసలు ఎప్పటికి తొలగుతుందో కూడా తెలీదు. దేశం అగమ్యగోచరంగా తయారైంది. 

మరి ఇప్పుడు కాంగ్రెస్ కే ఇబ్బంది, మీ మిచ్చిన షాక్ తో కాంగ్రెస్ పనైపోయింది.. వంటి చిల్లర మాటలు మాట్లాడటం  మాత్రం హేయం. ప్రజల పుండు మీద కారం జల్లడమే. రాజకీయ విమర్శలకేం.. ఎన్నైనా చేయొచ్చు! మీరు ఇప్పుడు కాంగ్రెస్ ను అంటున్నారు. వాళ్లు కూడా.. ఎంపీగా పోటీ చేసి చిత్తు చిత్తు గా ఓడిన వ్యక్తి అరుణ్ జైట్లీ, ఆయన ఒక లాయరు, ఆయనకు అర్థశాస్త్రంలో ఓనమాలు కూడా రావు.. అసలు ఎంపీగా ప్రజల ఆమోదం పొందని వ్యక్తి ఈ దేశ ఆర్థిక వ్యవస్థను శాసిస్తున్నాడు… అంటూ వారు ఎదురుదాడి చేస్తే, ఆ తర్వాత మరో రకంగా మీరు ప్రతిదాడి చేయవచ్చు. కానీ ఈ చెత్త వల్ల ప్రజలకు ప్రయోజనం ఏంటి?

Show comments